రిజర్వు బ్యాంకుపై దువ్వూరి ముద్ర

4 Sep, 2013 16:10 IST|Sakshi
రిజర్వు బ్యాంకుపై దువ్వూరి ముద్ర

యాగా వేణుగోపాలరెడ్డి తర్వాత రిజర్వు బ్యాంకు పగ్గాలు చేపట్టిన మరో తెలుగువాడు.. దువ్వూరి సుబ్బారావు. దేశ ఆర్థిక వ్యవస్థ  క్లిష్ల పరిస్థితిలో ఉన్న తరుణంలో అత్యంత కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన.. ధరలను ఆదుపులో ఉంచడం, కరెంటు ఖాతా లోటును పూడ్చడం, ద్రవ్యలోటును అదుపులోకి తీసుకురావడం వంటి అనేక ఘన విజయాలు సాధించారు. రిజర్వు బ్యాంకుకు 22వ గవర్నర్గా పనిచేసిన ఆయన.. తన వారసత్వాన్ని రఘురామ్ రాజన్కు అప్పగించి విశ్రాంతి తీసుకున్నారు. గతంలోనే ఆయనకు పదవీ విరమణ వయస్సు వచ్చినా, ప్రభుత్వ కోరిక మేరకు నాలుగేళ్ల పాటు అదనంగా సేవలు అందించారు. మరికొంత కాలం మీరే ఉండాలని సర్కారు పెద్దలు కోరినా, సున్నితంగా తిరస్కరించి, తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పిన నిరాడంబరుడు.

తిరుమలలో మర్యాదలకు నో
గతంలో ఓసారి తిరుమల వెళ్లినప్పుడు కూడా ఆయన ఆలయ మర్యాదలను పక్కన పెట్టి, సామాన్య భక్తుడిలా కాలినడకనే దర్శనానికి వెళ్లారు. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లడమే కాక, తిరిగి వెళ్లేటప్పుడు కూడా కాలినడకనే అలిపిరి చేరుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనను సుపథం మార్గం నుంచి అతి దగ్గర క్యూలైనులో ఆలయంలోకి తీసుకెళ్లాలని చూసినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రత్యేక దర్శనం కోసం 300 రూపాయల టికెట్లు కొనుక్కుని భక్తులందరితో పాటే వెళ్లారు. అందరితో మహాలఘు దర్శనమే చేసుకున్నారు తప్ప, అధికారులు మరికొంతసేపు ఉండాలని కోరినా వినిపించుకోలేదు.

ఏలూరు నుంచి హస్తిన వరకు..
దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగస్టు 11న జన్మించారు. అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్. పట్టా పొందిన ఆయన, 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శిగాను పనిచేశాడు. తర్వాత జాతీయ సర్వీసులకు వెళ్లి, చాలా కాలం పాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. యాగా వేణుగోపాలరెడ్డి పదవీ విరమణ చేయగానే స్వతహాగా ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ చూపు దువ్వూరిపైనే పడింది.  

బాల్యం, విద్యాభ్యాసం
దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగస్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన మల్లికార్జునరావుకు మూడో సంతానం. కోరుకొండ సైనిక పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తిచేసి ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎస్సీ చదివారు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచారు.

రూపాయి పతనంపై ఒంటరి పోరు
రోజురోజుకూ పతనమవుతున్న రూపాయిపై దువ్వూరి ఒంటరిపోరు సాగించారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో బ్యాంకులు విచ్చలవిడి స్పెక్యులేషన్‌కు పాల్పడుతుండటంతో దాన్ని నిరోధించేందుకు ఈ ఏడాది జూలై 15న ఒక్కసారిగా బ్యాంక్ రేటును 2 శాతానికి పైగా పెంచేశారు. అది సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో, పెంపు తాత్కాలికమేనంటూ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తిరిగి రూపాయిని పడేసింది. ఆర్థికాభివృద్ధే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యం కావాలని, ధరల అదుపు అంశం అందులో ఒక భాగమేనని ఒక పక్క చిదంబరం అంటుంటే, ధరల కట్టడే తమ లక్ష్యమంటూ దువ్వూరి పేదల పక్షపాతి అనిపించుకున్నారు.

చిదంబరంతో ఢీ అంటే ఢీ
అనేకసార్లు తనపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆర్థికమంత్రి చిదంబరానికి దువ్వూరి పరోక్షంగానే సమాధానమిచ్చారు. కానీ ఇటీవల పదవీ విరమణకు ముందు ప్రత్యక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆర్‌బీఐ ఉండటం వల్లే దేశం బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనేరోజు వస్తుందని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు చిదంబరం సైతం ‘నేను మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయా. ఎంతలా అంటే... అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నా. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది... అనే రోజు వస్తుంది’  అంటూ జర్మనీ మాజీ చాన్స్‌లర్ గెరార్డ్ ష్రోడర్‌ను ఉటంకించారు దువ్వూరి.

నిర్వహించిన పదవులు
1988-93 కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీ
1993-98 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి
1998-04 ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం
2004-08 కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా
2008-13 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌

ఇతరాలు
అత్యధిక జ్ఞాపకశక్తి ఉన్న వారితో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంఘంలో దువ్వూరి సుబ్బారావు కూడా సభ్యుడు. ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి ఈయనే.

>
మరిన్ని వార్తలు