వాహ్.. తాజ్ ఫలక్‌నుమా

17 Nov, 2014 01:01 IST|Sakshi
వాహ్.. తాజ్ ఫలక్‌నుమా

షహర్‌కీ షాన్
 
ఫలక్‌నుమా ప్యాలెస్.. ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ స్పాట్. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం ఇక్కడ ఈనెల 18న జరగనున్న నేపథ్యంలో ప్యాలెస్ మరోసారి వార్తల్లోకెక్కింది. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చరిత్రాత్మక కట్టడాలలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ది ప్రత్యేక స్థానం.
 
ఫలక్‌నుమా అంటే ఆకాశదర్పణం అని అర్థం. చార్మినార్ కట్టడానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రెండు వేల అడుగుల ఎత్తయిన కొండపై దీన్ని నిర్మించారు. ఇటలీ వాస్తు నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్‌ను పై నుంచి చూస్తే తేలు ఆకారంలో కనిపిస్తుంది. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్  హయాంలో హైదరాబాద్ ప్రధానమంత్రి, పైగా వంశస్తుడు సర్ వికార్ ఉల్ ఉమ్రా దీనిని నిర్మించారు.

1884 మార్చి 3న శంకుస్థాపన జరగగా 1893లో నిర్మాణం పూర్తయింది. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చయ్యాయి. ఎంతో అందంగా తయారైన ఈ రాజ భవనాన్ని ఉమ్రా.. మీర్ మహబూబ్ అలీఖాన్‌కు 1895లో బహుమానంగా ఇచ్చారు. దీంతో 1898లో నిజాం నవాబు ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తన గెస్ట్‌హౌస్‌గా మలచుకున్నారు. జీవిత చరమాంకాన్ని ఇదే ప్యాలెస్‌లో గడిపిన ఆయన, 1911లో ఇక్కడే తుదిశ్వాస విడిచారు. ప్యాలెస్‌కు స్వాగత తోరణంగా ఉన్న కమాన్‌ను ప్రస్తుతం ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపోకు ప్రవేశద్వారంగా మార్చారు.
 
ప్రస్తుతం తాజ్ ఫలక్‌నుమా..

ఫలక్‌నుమా ప్యాలెస్.. నాలుగేళ్ల క్రితం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌గా మారింది. ఏడో నిజాం మనుమడు ప్రిన్స్ ముఖరం జా అధీనంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను నాలుగేళ్ల
 
కిందట తాజ్ గ్రూప్‌నకు
 
లీజుకిచ్చారు. దీంతో శుభకార్యాలు, బోర్డు సమావేశాలు, విందులు, వినోదాలకు ఈ ప్యాలెస్ వేదికైంది. నగరంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఈ ప్యాలెస్ ఒకటి. నిజాం ఉపయోగించిన వస్తువులను, క్రీడాపరికరాలను, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తువులను, పుస్తకాలను ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. ఈ హోటల్‌లో ప్రధాన సూట్‌లతో పాటు 60 రూమ్‌లను వినియోగంలోకి తీసుకొచ్చారు. అద్దె రూ.20 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంది. నిజాం కాలం నాటి రాచమర్యాదలను ఈ హోటల్‌లో అందుకోవచ్చు. స్పెషల్ బాత్, స్పా, జావా, హెల్త్‌క్లబ్, స్విమ్మింగ్‌పూల్, స్మోకింగ్ ఏరియా, ఇటాలియన్ రెస్టారెంట్, హైదరాబాద్ స్పెషల్ (అదా) రెస్టారెంట్‌లు ఉన్నాయి. నిజాం నవాబుతో పాటు బేగం ఉపయోగించిన పరికరాలనూ ప్రదర్శనకు ఉంచారు. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కుర్చీలను అతిథులూ వాడుకోవచ్చు.
 
గేమ్స్ రూమ్

ప్యాలెస్‌లో ఇండోర్ గేమ్స్ రూమ్ ఓ అద్భుతం. నిజాం లండన్ నుంచి తెప్పించిన స్నూకర్, ఇటలీ నుంచి తెప్పించిన చెస్ బోర్డ్ ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కా ఏర్పాటు చేసి అతిథులకు అందిస్తున్నారు. ఇందులో ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్ కాయిన్స్ ఉన్నాయి.
 
అదా రెస్టారెంట్

ప్యాలెస్‌లో అదా రెస్టారెంట్‌కు తాజ్ గ్రూపు ప్రత్యేక స్థానం ఇచ్చింది. ఇందులో హైదరాబాద్ రుచులైన బిర్యానీ, పత్తర్‌కీ మటన్, ధమ్‌కీ చికెన్
 
తదితర వంటకాలతో పాటు

ఆంధ్రాభోజనాన్నీ అందిస్తున్నారు. దీని పక్కనే చెలాస్‌రే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.
 
స్మోకింగ్ ఏరియా

ప్యాలెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందమైన గార్డెన్‌ను స్మోకింగ్ జోన్‌గా వ్యవహరిస్తున్నారు. సంధ్య వేళలో దమ్ములాగుతూ.. నగర అందాలను వీక్షించవచ్చు.
 
నిజాం సూట్

ప్యాలెస్‌లో నిజాం సూట్ అన్ని సూట్‌లలో (నంబర్ 204)లలో ఖరీదైనది. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ఈ సూట్‌లో నిజాం ఉపయోగించిన వస్తువులతో పాటు వివిధ
 
 దేశాల నుంచి

సేకరించిన వస్తువులను అలంకరించారు. సూట్ పక్కనే అక్బర్ సూట్, షాజాదీ సూట్ ఇతర సూట్‌లు ఉన్నాయి. వీటితో పాటు 60 సూట్‌లు ఉన్నాయి.
 
ప్యాలెస్‌లో స్పా..

ప్యాలెస్‌లో పూర్తి ఇండియన్ స్టైల్‌లో నిర్వహించే స్పా, యోగా సెంటర్ ఉన్నాయి. రెండున్నర గంటల పాటు నిర్వహించే స్పా కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాలి.
 
 -కర్నాటి శ్రీనివాసగౌడ్
 
అతిపెద్ద డైనింగ్ హాల్

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిజాం ఉపయోగించిన అతిపెద్ద డైనింగ్ హాల్‌ను అద్దెపై వినియోగించుకునే వీలు కల్పించారు. ఒకేసారి నూటొక్క (101) మంది అతిథులు ఈ హాల్‌లో విందారగించవచ్చు. పూర్తి ఇటాలియన్ ఫర్నిచర్, తొమ్మిది దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తు సామగ్రి ప్రత్యేక ఆకర్షణ. 33 మీటర్ల పొడవైన ఈ డైనింగ్ హాల్‌లోనే నిజాం తన బంధువులు, విదేశీ అతిథులకు ఆతిథ్యమిచ్చేవారు.
 
మార్బుల్ మెట్లు..

ప్యాలెస్‌లో కేవలం నాలుగు ఫిల్లర్లపై ఉన్న స్టేర్ కేస్ ప్యాలెస్ అందాన్ని ఇనుమడింప చేస్తోంది. ఇటలీ మార్బుల్‌తో ఏర్పాటు చేసిన ఈ స్టేర్ కేస్ పైనున్న దర్బార్ హాల్ టీ సెక్షన్‌కు వెళ్తుంది.
 
మహల్‌లో లైబ్రరీ..

నిజాం వివిధ దేశాల నుంచి సేకరించిన 900 గ్రంథాలతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో పార్సీ, అరబిక్, ఉర్దూలలో లిఖించిన పుస్తకాలున్నాయి. ఇందులో 1911 నుండి 1951 వరకు ప్యాలెస్‌ను సందర్శించిన వారి వివరాలతో కూడిన విజిటర్ బుక్ సైతం ఉంది.
 

మరిన్ని వార్తలు