చిన్నప్పటి నుండి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం : ఆదిత్య కార్తీక్

1 Jul, 2013 05:13 IST|Sakshi
చిన్నప్పటి నుండి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం : ఆదిత్య కార్తీక్
పేరు: ఆదిత్య కార్తీక్
 కెమెరా: నికాన్ 60 డి
 
 మీ గురించి...
 చిన్నప్పటి నుండి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. పదవ తరగతి వరకూ సరదాగా సెల్ కెమెరాతో తీసేవాణ్ణి. మా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఫొటోగ్రఫీ స్టార్ట్ చేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో నాన్న డిఎస్‌ఎల్‌ఆర్ కొని ఇచ్చారు. నా జీవితంలో నాకు దొరికిన గిఫ్ట్స్‌లో బెస్ట్ గిఫ్ట్ ఇది. 
 
 మీ దృష్టిలో ఫొటోగ్రఫీ అంటే ఏమిటి?
 బాధయినా, సంతోషమైనా మన మెదడు తర్వాత మన ప్రతి జ్ఞాపకాన్ని గుర్తుంచుకొనేది ఫొటోగ్రఫీనే. ఆ జ్ఞాపకాన్ని మనం మర్చిపోయినా ఫొటో మాత్రం మర్చిపోనివ్వదు. మన గతాన్ని వేరొకరితో పంచుకోవడానికి ఫొటోగ్రఫీని మించింది లేదు. 
 
 తర్వాత ఏంటి?
 నేను చదువుతున్నది బి.టెక్ అయినా, లైఫ్‌లో ఫొటోగ్రఫర్‌గానే సెటిల్ అవుదామనుకుంటున్నాను. బి.టెక్ తర్వాత యూఎస్‌లోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీలో పీజీ చేద్దామనుకుంటున్నాను. దేవుడు సృష్టి నిండా ఎన్నో అందాలని దాచిపెట్టాడు. అందులో వీలైనన్ని అందాలని నా కెమెరా కన్నుతో చూడాలన్నదే నా ఆశయం.
 
  స్త్రీకి అంకితం
 బ్యాక్‌స్టోరీ: స్త్రీ పువ్వులాంటిది. ఎంత అసమానమైనదో అంత సున్నితమైనది స్త్రీ మనసు. అందుకే మన జీవితంలోకి ప్రవేశించే ప్రతి స్త్రీ ప్రత్యేకమైనదే. వారికి ఈ చిత్రం అంకితం.
 
 రంగురంగుల జీవితం 
 బ్యాక్‌స్టోరీ: ఈ చిత్రంలోని ప్రతి కలర్ పెన్సిల్, మనకి రోజూ ఎదురయ్యే రకరకాల మనుషులు. ఒక్కొక్కరిది ఒక్కోరంగు. కానీ వాళ్ళే మన జీవితాన్ని రంగులమయం చేసేది. 
 
 హోప్
 బ్యాక్‌స్టోరీ: జీవితంలో అన్నీ కోల్పోయినా, మళ్ళీ ఆశ అనేది చిగురిస్తుందని  చెబుతోంది ఈ ఎండిపోయిన చెట్టు. అప్పటిదాకా దానికి తోడుగా ఉన్న కాకులే ఆకులుగా మారినట్టు ఉంది. నా కెమెరా కన్నుకి నచ్చడంతో క్లిక్కుమనిపించాను.
 
 స్ల్పాష్ ఆఫ్ వాటర్
 బ్యాక్‌స్టోరీ: రెండు అందమైన వస్తువులు ఉంటే సరిపోదు. వాటి జోడీ అంతే అందంగా ఉండాలి. అలా అందమైన జోడీలలో ఒకటి ‘సూర్యాస్తమయం-నీరు’ దేని ప్రత్యేకత దానిది. వీటి కలయికని మించిన అందం దేనిది?
 
 - జాయ్
మరిన్ని వార్తలు