దర్జాగా.. దౌర్జన్యంగా.. ఏం మగాళ్లండీ వీళ్లు?!

2 Jul, 2014 09:31 IST|Sakshi
దర్జాగా.. దౌర్జన్యంగా.. ఏం మగాళ్లండీ వీళ్లు?!

పురుషోత్తములు
రైళ్లలో, సిటీ బస్సుల్లో ‘స్త్రీలకు మాత్రమే’ అని ఉన్నచోట ఈ మగాళ్లెలా ధైర్యంగా కూర్చోగలరో ఎప్పటికీ అర్థం కాని విషయం. పైగా దబాయింపు చూపొకటి... ‘లేవం, ఏం చేసుకుంటావో చేస్కో ఫో’ అన్నట్లు! ఎందుకిలా ప్రవర్తిస్తారు వీళ్లు? ఆ... ఆడవాళ్లే కదా అన్న తేలిక భావమా? సంస్కారం లేకపోవడమా? కారణాలు ఏవైనా ఇలాంటి మగాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మహిళాప్రయాణికులతోపాటు, ఇప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్సులూ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ మెట్రో రైళ్లు. వీటిల్లో మొదటి కంపార్ట్‌మెంట్ పూర్తిగా మహిళలది.

మగాళ్లు కూర్చోకూడదు. అయినా కూడా ఈ ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ కంపార్ట్‌మెంట్‌లలో పట్టుబడిన ‘పురుషోత్తముల’ సంఖ్య 3,500. ఈ సంఖ్య గతేడాది ఇలా లేడీస్ కంపార్ట్‌మెంట్‌లలో దర్జాగా కూర్చొని దొరికిపోయినవారి సంఖ్య కన్నా తక్కువేనట. అంటే మగాళ్లలో మార్పు వచ్చిందనా? కాదు కాదు, ‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (మెట్రో) నిఘా పెరిగింది. ఈ ఫోర్సు మెల్లగా వస్తుంది. మామూలు దుస్తులలో వస్తుంది. లేడీస్ సీట్లలో కూర్చొని ఉన్న మగాళ్లను మెరుపులా పట్టేస్తుంది. కొందరు ‘తెలియక ఎక్కాం’ అంటారు.

కొందరు ‘పెహ్‌లీ బార్ థా, జానేదో ప్లీజ్’ అంటారు. కొందరు ‘ఐ వాజ్ జస్ట్ చార్జింగ్ మై మొబైల్’ అంటారు. కొందరు ‘సారీ’ చెప్పి స్టేషన్ రాగానే దిగి పోతారు. ఇలాంటివి మినహాయించినా కూడా ఇన్ని వేల మంది దొరకడమే విశేషం. పట్టుకున్న వారిని సెక్యూరిటీ ఫోర్స్ ఊరికే వదిలి పెట్టదు. ఫైన్ వేస్తుంది. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రాలు చేస్తుంటే పోలీసులకు అప్పజెబుతుంది. ప్లాట్‌ఫారమ్ మీద, ఉమన్ కంపార్ట్‌మెంట్ లోపల స్త్రీలకు మాత్రమే అని గమనికలు ఉంటాయి. ‘స్త్రీల కంపార్ట్‌మెంట్‌లో స్త్రీలనే కూర్చోనివ్వండి’ అనే అనౌన్స్‌మెంట్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే, మగాళ్లు కనిపిస్తూనే ఉండడం సెక్యూరిటీ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
‘‘రోజుకి సుమారు 50 మంది మగాళ్లు లేడీస్ కోచ్‌లో మాకు పట్టుబడతారు. వాళ్లను మా సిబ్బంది... స్టేషన్ కంట్రోల్ రూమ్‌కి తరలిస్తారు. అక్కడే వాళ్లు ఫైన్ కూడా కట్టాలి. మహిళలను వేధించడానికే వాళ్లంతా ఆ కోచ్‌లో కూర్చున్నారు అనేందుకు లేదు. కానీ కొందరు అందుకోసమే ఎక్కుతారు. ఏ ఉద్దేశంతో ఎక్కినా, తమ తప్పు ఒప్పుకుని లేచిపోతే పర్వాలేదు కానీ, వాదనకు దిగితే మాత్రం వారికి ఫైన్ తప్పదు’’ అని సీఐఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ అరవింద్ రంజన్ అంటారు.
 
ఒక్క ఢిల్లీ మెట్రోలోనే కాదు, మెట్రో వ్యవస్థ ఉన్న ప్రతి నగరంలోనూ, సిటీ బస్సులలోను మహిళా ప్రయాణికులకు మగవాళ్ల బెడద తప్పడం లేదు. అంతదాకా ఎందుకు... మన హైదరాబాద్ సిటీ బస్సులలోనే చూడండి. లేడీస్ సీట్లలో మగాళ్లొచ్చి కూర్చుంటారు. లేవమంటే కోపంగా చూస్తారు. లేదంటే మాట వినిపించుకోనట్లు కిటికీల్లోచి బయటికి చూస్తుంటారు. చాలాసార్లు కండక్టర్ కూడా వాళ్లను లేపలేని అసహాయ స్థితిలో పడిపోవడం కనిపిస్తుంది. టికెట్ చెకింగ్‌కి ఉన్న విధంగా... లేడీస్ సీట్లలో ధీమాగా, దర్జాగా, ధైర్యంగా, దౌర్జన్యంగా కూర్చున్న మగాళ్లను లేపడానికి సిటీ  బస్సులలో కూడా సెక్యూరిటీ ఫోర్స్‌లాంటి మెరుపు దాడులుండాలి. అప్పుడుగానీ లేడీస్ సీట్లు లేడీస్‌కి దక్కవేమో!

మరిన్ని వార్తలు