పెళ్లి ముస్తాబుతో దర్పంగా నడుస్తున్న ‘గుర్రాలు’

5 Oct, 2014 23:48 IST|Sakshi
పెళ్లి ముస్తాబుతో దర్పంగా నడుస్తున్న ‘గుర్రాలు’

గోల్కొండ కోట దర్వాజాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆ వీధి రెండు వైపులా ప్రజలు నిలబడి పెళ్లి ఊరేగింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో బారాత్ వచ్చేసింది... అందమైన అలంకారం.. ముత్యాల హారాలు.. ఖరీదైన వస్త్రాలు..
పెళ్లి ముస్తాబుతో దర్పంగా నడుస్తున్న ‘గుర్రాలు’!


ఇది 1592 సమయంలో మాట. అప్పట్లో. 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గోల్కొండ పట్టణం 30 వేల జనాభాతో కిటకిటలాడుతుండేది. కానీ మనుషుల కంటే గుర్రాల సంఖ్యే అధికం. రాచఠీవీకి దర్పంగా నిలిచే గుర్రాలను పెంచుకోవటం అప్పట్లో సర్వసాధారణం. గుర్రం లేని ఇళ్లంటే చిన్నచూపే. ఇక శుభకార్యాలు జరిగితే గుర్రాలను అందంగా తీర్చిదిద్దేవారు. వాటికి స్నానం చేయించి, ముత్యాలతో ఘనంగా అలంకరించేవారు. మామూలు గుర్రాల కంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న వాటిని పెంచుకోవటం ఓ గొప్ప గౌరవంగా భావించేవారు.

అలాంటి మేలు జాతి గుర్రాలపై ఊరేగటమంటే పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ముఖ్యంగా పెళ్లికొడుకులను అలాంటి గుర్రాలపై మాత్రమే వేదిక వద్దకు తీసుకువచ్చేవారు. గోల్కొండ పరిధి విస్తరించి వెలుపల నగరం రూపుదిద్దుకున్న తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వచ్చింది. కుతుబ్‌షాహీల జమానా ముగిసి అసఫ్‌జాహీల హయాం మొదలైన తర్వాత ఈ సంప్రదాయం సాధారణ ఇళ్లకూ పాకింది. గుర్రాల సందడి లేకుండా శుభకార్యం జరిగేది కాదు. మేలు జాతి గుర్రం అప్పట్లో స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అలా మొదలైన సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా పెళ్లి వేడుకల్లో గుర్రాలను వినియోగిస్తున్నారు. బారాత్‌లో గుర్రం లేకుండా పెళ్లి కుమారుడి కుటుంబం ముందుకు సాగదు.
 
తరతరాల వృత్తి...  
శతాబ్దాలు దొర్లిన తర్వాత కూడా గుర్రాల ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. అయితే సొంతంగా ప్రతి ఇంటా గుర్రాల పెంపకం అంతరించినా... పెళ్లింట మాత్రం వాటి సందడి ఉండాలని కోరుకునే కుటుంబాలకు కొదవ లేదు. పెళ్లి రోజు మాత్రం గుర్రాలను తీసుకొచ్చి ఎదుర్కోళ్లు, ఊరేగింపు ఢనిర్వహిస్తున్నారు. ఇలాంటి అవసరాలను తీర్చేందుకు పాతనగరంలో కొన్ని కుటుంబాలు సిద్ధంగా ఉంటాయి. మేలు జాతి గుర్రాలు, అందమైన ్ఢబగ్గీలను వీరు సరఫరా చేస్తున్నారు. పురానాపూల్, జుమ్మేరాత్ బజార్‌లలో 30 వరకు ఇలాంటి కుటుంబాలున్నాయి. మూడునాలుగు తరాలుగా ఈ కుటుంబాలు గుర్రాల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుతుబ్‌షాహీల కాలంలో గుర్రాలను పెంచే వ్యాపకంలో ఉన్నవారు కాలక్రమంలో గుర్రాలు, బగ్గీలను అద్దెకిచ్చి అదే వృత్తిగా మలచుకున్నారు.

క్యాబ్ అద్దెకు తీసుకుంటే కిలోమీటర్ల వారీగా వసూలు చేసిన త రహాలోనే గుర్రాలకు, బగ్గీలకూ ధర ఉంది. నగరంలోని 15 కి.మీ. పరిధిలో గుర్రపు బగ్గీలను తిప్పితే రూ.6 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎదుర్కోళ్లలో భాగంగా పెళ్లి కుమారుడిని వివాహవేదిక వద్దకు తీసుకురావటానికి గుర్రాన్ని పంపితే రూ.3 వేల వరకు వసూలు చేస్తారు. ఇక గుర్రాలకు తోడుగా అదనపు ఆకర్షణగా కొందరు ఒంటెలనూ బారాత్‌లలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం కొన్ని కుటుంబాలు ఒంటెలనూ పెంచుతున్నాయి.

మరిన్ని వార్తలు