యానిమేషన్ ఆలోచన ఎలా వచ్చింది?

1 Jul, 2013 05:18 IST|Sakshi
యానిమేషన్ ఆలోచన ఎలా వచ్చింది?
తెలుగు భాషకు ఎనలేని సేవలు చేసిన ఉత్తరాంధ్ర పరంపరను కొనసాగిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర్లోని లొద్దభద్రకు చెందిన కొత్తపల్లి సీతారాము. ఇటీవల తాను రూపొందించిన ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే కార్టూన్ యానిమేషన్ మూవీ డి.వి.డితో కలసి పుస్తకరూపంలో విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ...
 
 యానిమేషన్ ఆలోచన ఎలా వచ్చింది?
 మా పెదనాన్న లక్ష్మీనారాయణాచార్యులు పాటలు, పద్యాలు, తత్వాలు బాగా పాడేవారు. నీతి కథలూ చెప్పేవారు. ఈ తరంలో అట్లాంటి పెద్దలు తగ్గిపోవడంతో పిల్లలు కార్టూన్ ఛానెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అందులో అన్నీ ఇంగ్లిష్ లేదా హిందీ కథలే. తెలుగులో మంచి యానిమేషన్ సినిమాలు ఎందుకు లేవా? అని ఆలోచించాను. పద్నాలుగేళ్ల క్రితం ఒకసారి హైద్రాబాద్ వచ్చాను. ఇది చాలా పెద్ద వ్యవహారం. వేల బొమ్మలేయాలి. లక్షలు  ఖర్చుపెట్టాలన్నారు. కొన్నేళ్ల కృషి ఫలితంగా స్వంతంగా చేసుకున్న సామగ్రితో యానిమేషన్ ఖర్చును 99 శాతం తగ్గించాను.
 
 యానిమేషన్ సినిమాలు ఏమేమి తీశారు? ఎటువంటి గుర్తింపు వచ్చింది?
 అంధ్ విశ్వాస్ (అంధవిశ్వాసం), కర్ బురా హో బురా (చెడు చేస్తే చెడే కలుగుతుంది) రూపొందించాను. 16వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో నందితాదాస్ గోల్డెన్ ఎలిఫెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - బెంగళూరు, షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫెస్టివల్-హైదరాబాద్‌లలో నిరుడు, అంతకు ముందు సంవత్సరం బహుమతులొచ్చాయి. ప్రపంచంలోని అన్నిభాషల్లోకి అనువాదమైన పంచతంత్రాన్ని 108 ఎపిసోడ్స్‌గా రూపొందించాలని సన్నాహాలు చేసుకున్నాను. రెండు ఎపిసోడ్స్ తయారు చేశాను. ఒక ప్రవాసభారతీయుడు ఆర్ధికసహాయానికి ముందుకు వచ్చి ఆగిపోయారు. ఎప్పటికైనా అన్ని ఎపిసోడ్లు చేయాలని సంకల్పం. 
 
 మీ యానిమేషన్ ప్రత్యేకత ఏమిటి?
 2డి యానిమేషన్ చిత్రాల్లో సెకనుకి 12 ఫ్రేములుంటాయి. టీవీ యానిమేషన్‌లో 6 ఫ్రేములే ఉంటాయి. నేను చేసే యానిమేషన్‌లో సినిమాలో వలె 24 ఫ్రేములుంటాయి. ఇప్పటివరకూ ఉన్న 3డి యానిమేషన్‌లో మల్టీ కలర్స్ రావు. సహజమైన రంగులూ రావు. నా పద్ధతిలో మల్టీకలర్స్, నేచురల్ కలర్స్ వస్తాయి. బొమ్మల కాళ్లు చేతుల కదలికలను, ముఖకవళికలను కంప్యూటర్ సహాయంతో రాబట్టే టెక్నిక్‌ను పరికరాలను నేను రూపొందించాను.
 
 ‘విశ్వదాభిరామ వినురవేమ’ గురించి చెప్పండి?
 నీతిశతకాల పద్యాలు పాడి అర్థం చెప్పే తరం తగ్గిపోతోంది. ఈ తరం పెద్దలు పద్యాలు చదవగలుగుతున్నారే గాని కొన్ని పదాల అర్థాలు వారికీ తెలీదు. ‘అంటే ఏంటి నాన్నా’ అని అడిగినప్పుడు బిక్కమొగం వేస్తున్నారు. సినిమా భాషలో ఒక గొప్ప సామెత ఉంది. ‘డోంట్ టెల్-షో’ అని! కాబట్టి, వేమన పద్యాలను యానిమేషన్ పద్ధతిలో చూపిస్తే బావుంటుందని కొందరు పెద్దల ముందు ఆలోచనను పెట్టాను. కొన్ని పద్యాలను యానిమేట్ చేసి చూపించాను. ఐపీఎస్ విశ్రాంత అధికారి ఆంజనేయరెడ్డిగారు తదితర పెద్దలు సహకరించారు. ఫలితంగా 108 పద్యాలను చూపించే యానిమేషన్ చిత్రం పుస్తకంతో సహా తయారైంది. పద్యాలను సెల్‌ఫోన్‌లో కాలర్‌ట్యూన్ ద్వారా యాక్టివేట్ చేసుకునే సదుపాయాన్ని పొందవచ్చు.
 
 పద్యాలను పాడించడంలో సమస్యలు వచ్చాయా?
 వచ్చాయి. పద్యాలకు రిథమ్ ఉండదు. మ్యూజిక్ కంపోజిషన్ ఏమిటి అని కొందరన్నారు. కంప్యూటర్‌లో కంపోజ్ చేసిన ట్యూన్స్‌కి అక్కడక్కడా వీణ తదితర సంప్రదాయవాద్యాలను వాడి సంగీతం సమకూర్చాను. రికార్డింగ్ అయిన తర్వాత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గొప్ప కితాబు ఇచ్చారు. ‘సినిమాలకు పాడాను. టీవీలకు పాడాను. యానిమేషన్ చిత్రాలకూ పాడిన సంతోషాన్నిచ్చారండీ’ అన్నారు. 
 
 ‘దృశ్యానువాదం’లో ప్రత్యేకతలేమిటి?
 కొన్ని పద్యాలకు ప్రశంసలు వచ్చాయి. ఉదాహరణకు ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ పద్యానికి ఒక మహిళపై రాళ్లు రువ్వుతున్న ప్రజలను వారిస్తూ మీలో తప్పు చేయని వాడెవడు అన్న సందర్భాన్ని చూపాను. అలాగే ‘చంపదగినట్టి శత్రువు తన చేత చిక్కెనేని’ పద్యంలో రుక్సానాకు ఇచ్చిన వాగ్దానంమేరకు తనకు చిక్కిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు విడిచిపెట్టడం చూపాను. ‘వేమన పద్యాలకు స్థల, కాలాదులను దాటి దృశ్యరూపం ఇచ్చావు’ అన్న కాంప్లిమెంట్స్ వచ్చాయి. 
 
 ప్రోత్సాహం ఎలా ఉంది?
 ఒక ఆంగ్లపత్రికలో యానిమేషన్ చిత్రాల గురించి ఆర్టికల్ వస్తే వేర్వేరు దేశాల నుంచి ఫోన్లు వచ్చాయి. హైద్రాబాద్ నుంచి మాత్రం ఒక్కటీ రాలేదు. 
 
 - పున్నా కృష్ణమూర్తి
>
మరిన్ని వార్తలు