డిఎల్ రాజకీయ వైరాగ్యం!

20 Jan, 2014 14:53 IST|Sakshi
డిఎల్ రవీంద్రా రెడ్డి

ఆరుసార్లు శాసనసభ్యుడుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించిన సీనియర్ నేత.  రెవెన్యూ, నీటిపారుదల, వైద్యఆరోగ్య వంటి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహారించారు డిఎల్ రవీంద్రా రెడ్డి. ఆయన నోరు విప్పితే ఎవరిని విమర్శిస్తారోనని సొంత పార్టీ నేతలే భయపడేవారు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసుకుంటారో తెలియదు.  కాంగ్రెస్‌ పార్టీలో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. చివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా హడలెత్తించారు.  రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన డిఎల్ ఇప్పుడు చాలా మెత్తబడిపోయారు. ప్రస్తుతం ఆయన రాజకీయ వైరాగ్యంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితో తలపడ్డారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ముఖ్యమంత్రి కిరణ్తో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. ఆయనను బహిరంగంగా విమర్శించారు.  కొంత కాలం ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సీమాంధ్రలో  కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులుండవని అంచనాకు వచ్చారు.  ఇప్పుడు ఏ పార్టీలోకి పోలేక, కాంగ్రెస్లో ఉండలేక ఇంటికే పరిమితమయ్యారు. అంతా వైరాగ్యం. రాజకీయ సన్యాసం చేసి సాధారణ జీవితం గడుపుతానన్నట్లుగా మాట్లడాతారు.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డిఎల్ వచ్చే ఎన్నికల్లో పోటీ  చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎంతో రాజకీయ అనుభవం గల డిఎల్కు రాజకీయాలపై విరక్తి కలగడానికి కారణాలు ఏమిటి?  సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. తెలుగు దేశం పార్టీ  దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లే  సాహసం చేయలేరు. అందువలనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని  నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  అయితే ఆయన మాత్రం రాజకీయాల్లో విలువలు నశించడం వలనే దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం డిఎల్ సీఎం కిరణ్ వ్యతిరేక వర్గంలో ఉన్నందున ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కటే రాదని, అందువల్లే ఆయన అస్ర్ర సన్యాసం స్వీకరించనున్నట్లు చెబుతున్నారని అంటున్నారు.  కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు డీఎల్ సిద్ధంగా ఉన్నప్పటికీ, టిడిపిలో చేరే అవకాశం లేదు. వైఎస్ఆర్ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మైదుకూరు శాసనసభ నియోజవర్గం నుంచి  సుధాకర్‌ యాదవ్‌ను పోటీ చేయించే ఆలోచనలో టిడిపి ఉంది. ఈ పరిస్థితులలో ఆ పార్టీ తలుపులు మూసుకుపోయినట్లే భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఆహ్వానించే అవకాశం లేదు. ఇక  కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా డీఎల్‌ను పట్టించుకునే అవకాశం లేదు. ఏ విధంగా చూసినా రాజకీయంగా ఆయనకు పరిస్థితులు అనూలంగా లేవు. ఈ నేపధ్యంలో  రాజకీయ సన్యాసమే బెటరని డీఎల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు