ఆన్లైన్ అబార్షన్.. ఇదో వ్యాపారం!

30 Sep, 2014 12:02 IST|Sakshi
ఆన్లైన్ అబార్షన్.. ఇదో వ్యాపారం!

అప్పుడే తమకు పిల్లలు వద్దనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే, అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం అన్ని చోట్లా అంత సులభం కాదు. కొన్ని దేశాల్లో దీనికి సంబంధించి అత్యంత కఠినమైన చట్టాలున్నాయి. అలాంటి చోట్ల అసలు అబార్షన్ చట్టవిరుద్ధం అవుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల్ని కనాల్సిందే. వైద్యులు కూడా ఈ చట్టాన్ని చూసి భయపడి అబార్షన్లు చేయరు. సరిగ్గా ఇదే అంశాన్ని నాగ్పూర్కు చెందిన మోహన్ కాలే అనే వ్యాపారవేత్త అందిపుచ్చుకున్నారు. అబార్షన్ అవ్వడానికి ఉపయోగపడే టాబ్లెట్లను నేరుగా వారికి కొరియర్ చేస్తున్నారు. ఇలా పంపినందుకు ఆయనకు ఆయా మహిళలు కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు. ''మా దేశంలో మహిళలకు ప్రాథమిక హక్కులు కూడా లేవు. నేను గర్భవతినని తెలియగానే చాలా భయపడ్డాను. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి'' అని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ ఈమెయిల్ చేశారు. ''ఇక ఇప్పుడు నేను గర్భవతిని కాను.. చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ.. ఐ లవ్యూ'' అని థాయ్లాండ్కు చెందిన మరో మహిళ రాసింది.

ప్రతినెలా మోహన్ కాలే దాదాపు 2వేల కిట్లు కొరియర్ చేస్తుంటారు. అబార్షన్లు చట్టవిరుద్ధం అయిన దేశాల్లో మాత్రమే ఈయన వ్యాపారం జరుగుతుంది. ఆన్లైన్లో ఆర్డర్లు వస్తాయి. అలా వచ్చినచోట్లకు ఆయన ఈ టాబ్లెట్లు పంపుతారు. గర్భం దాల్చిన తర్వాత తొలి తొమ్మిది వారాల్లో ఈ మందులు తీసుకుంటే గర్భస్రావం అయిపోతుంది. భారతదేశంలో అయితే వైద్యుడి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్తే టాబ్లెట్లు ఇచ్చేస్తారు. కానీ ప్రపంచంలోని దాదాపు 72 దేశాల్లో ఇవి చట్టబద్ధం కావు.

2001లో రెబెక్కా గాంపెర్ట్స్ అనే ఓ డచ్ ఫిజిషియన్ మొబైల్ అబార్షన్ క్లినిక్ ఏర్పాటుచేసుకుని డబ్లిన్ వెళ్లారు. తన నౌకలోకి మహిళలను తీసుకొచ్చి, వారికి అక్కడే.. అంతర్జాతీయ జలాల్లో పిల్స్ ఇచ్చి అబార్షన్లు చేయాలని, దానివల్ల చట్టపరంగా సమస్యలు రావని ఆమె భావించారు. ఇది చదివిన తర్వాతే మోహన్ కాలేకు కూడా ఈ ఆలోచన వచ్చింది. దాంతో పలు రకాలుగా ప్రయత్నాలు చేసి, చివరకు కొరియర్ ద్వారా మందులు పంపడం మొదలుపెట్టారు.

>
మరిన్ని వార్తలు