ఇంక్‌స్పిరేషన్స్

15 Nov, 2014 23:45 IST|Sakshi
ఇంక్‌స్పిరేషన్స్

జైల్లో ఉన్న గాంధీకి ఇందిరాగాంధీ ఉత్తరాలు రాస్తే.. ‘అందులో విషయాలు సరే ముందు దస్తూరి మార్చుకో. సరిగ్గాలేదని’ తిరిగి జాబు రాశారట గాంధీ! చేతిరాతకున్న ప్రాధాన్యం అలాంటిది. ఆ రాత రాసే వాళ్ల ఆసక్తిమీదే కాదు కాగజ్.. కలం.. దవాత్‌కున్న అనుబంధం మీదా ఆధారపడి ఉంటుంది అంటాడు కాలిగ్రఫీ ఎక్స్‌పర్ట్, నేషనల్ హ్యాండ్‌రైటింగ్ అకాడమీ డెరైక్టర్ వై.మల్లికార్జునరావు. అందులో పెన్ను పాత్ర అంతా ఇంతా కాదుట. ఆ విశిష్టతను చాటడానికి ‘ఇంక్‌స్పిరేషన్స్’ పేరిట బిర్లా ప్లానెటోరియంలో ప్రదర్శన ప్రారంభించాడు. దేశంలోనే ఇది తొలి ప్రదర్శన.

ఆ విశేషాలు ఆయన మాటల్లోనే....
 
చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్‌పై ప్రత్యేక ఆసక్తి. ఎంతంటే... హ్యాండ్‌రైటింగ్‌లో రీసెర్చ్‌చేసేంత. ఆ క్రమంలోనే దస్తూరికి, పెన్నుకి మధ్య ఉన్న అనుబంధమూ అర్థమైంది. పెన్సిల్, ఫౌంటెన్ పెన్, బాల్‌పాయింట్ పెన్.. ఫైబర్ పెన్ ఇట్లా వీటన్నిటిలో కెల్లా పెన్సిల్‌తో రాసిన దస్తూరి అందంగా ఉంటుంది. మొదటి స్థానం ఫౌంటెన్ పెన్నుదే. కానీ పెరిగిన వేగం ఫౌంటెన్ పెన్నుని పక్కన పెట్టాయి. బాల్‌పాయింట్ పెన్నయితే చకాచకా రాయడానికి వీలుంటుందని అందరూ వాటినే ఇష్టపడతున్నారు. కానీ ప్రపంచంలో గొప్పవాళ్లందరూ ఇప్పటికీ ఇష్టపడేది, ఉపయోగించేది ఫౌంటెన్ పెన్నునే.
 
పెన్నుల సేకరణ...
ఎలక్ట్రానిక్ లెటర్ ఎవరి రాతనైనా ఒకే రకంగా చూపిస్తుంది. కానీ చేతిరాత ఏ ఇద్దరిదీ ఒకే రకంగా ఉండదు. అలాగే ఒక్కో పెన్ను ఒక్కో రకంగా అక్షరాలు పేరుస్తుంది. ఈ విషయం గమనించాక.. అసలు ప్రపంచంలో ఎన్ని పెన్నులున్నాయో వాటిన్నటినీ సేకరించడం మొదలుపెట్టాను. అలా ఇప్పటి వరకు దాదాపు రెండు వేల రకాల పెన్నుల్ని సేకరించా. ఇందులో అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాక్ (మోబ్లా) పెన్నులూ ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని వెయ్యిమంది ప్రముఖుల స్వదస్తూరీ ప్రతులనూ సేకరించా. ఇందులో అరిస్టాటిల్ మొదలు మహాత్మాగాంధీ, మదర్‌థెరిస్సా, లాంటి 350 మంది అత్యంత ప్రముఖులవీ ఉన్నాయి.

ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం... పెన్నుల ద్వారా చేతిరాత విశిష్టతను తెలపడమే. కంప్యూటర్లు వచ్చాక పెద్దవాళ్లెవరూ పెన్నుల్ని ఉపయోగించడంలేదు. రాసే అలవాటునూ మర్చిపోతున్నారు. పిల్లలు కూడా దస్తూరీపై శ్రద్ధ పెట్టడం లేదు. ఎప్పుడో సివిల్స్ రాయాల్సివచ్చినప్పుడు మాలాంటి వాళ్ల దగ్గరకొచ్చి ట్రైనింగ్‌తీసుకుంటున్నారు. అదేదో చిన్నప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవచ్చు కదా. అందుకే ఇలాంటి వారి కోసం చేతి రాతను చక్కదిద్దుకునే శిక్షణనిస్తున్నా. పదిహేడేళ్ల కిందట మొదలుపెట్టిన ఈ పని  నేషనల్ హ్యాండ్‌రైటింగ్ అకాడమీ పేరుతో కొనసాగిస్తున్నాను.

ఈ ఎగ్జిబిషన్‌లో..
ఓల్డ్ మోడల్ ఫౌంటెన్‌పెన్ నుంచి రాకెట్ పెన్, గన్ పెన్, స్క్రూడ్రైవర్‌పెన్, కార్‌పెన్, కర్రపెన్ను, కీ పెన్ను,  కత్తెర పెన్నులాంటి రకరకాల పెన్నులున్నాయి. అలాగే లగ్జర్ కంపెనీ కొత్త ప్రొడక్ట్  (ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాని) ఫౌంటెన్ పెన్ను కూడా ఉంది. మొత్తమ్మీద స్కూల్ పిల్లలను ఈ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటోంది.

సరస్వతి రమ

మరిన్ని వార్తలు