చాన్సొస్తే తెలుగులోనూ..

23 Dec, 2014 00:00 IST|Sakshi

చూడటానికి కాస్త బొద్దుగా ఉన్న.. ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. షాట్‌గన్ నుంచి పేలిన ఈ తూటా.. వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ అన్న క్రెడిట్ కొట్టేసింది. పంజాబీ లుక్స్‌లో అదరగొట్టే బీహారీ అమ్మాయి సోనాక్షి సిన్హా డెరైక్ట్ తెలుగు మూవీ చేయాలని ఉందంటోంది. హీరో అర్జున్ కపూర్‌తో కలసి నటించిన తేవర్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనాక్షితో సిటీప్లస్ మాటామంతీ..
 ..:: శిరీష చల్లపల్లి
 
నా పేరెంట్స్ యాక్టర్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నాన్న శతృఘ్న్ సిన్హా, అమ్మ పూనమ్. అన్నయ్యలిద్దరూ కవలలు. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో గారాబంగా పెంచారు. అలాగని అల్లరి పిల్లను కాదు. నేను పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండేది. ముంబైలోని ఎస్‌ఎన్‌డీటీ విమెన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ‘మేరే దిల్ లేకే దేఖో’ సినిమా ద్వారా ఫ్యాషన్ డిజైనర్‌గా పరిచయం అయ్యాను.
 
బబ్లీ సిన్హా అనేవారు..

నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి సినిమా సల్మాన్‌ఖాన్ పక్కనే నటించే అవకాశం రావడంతో ‘దబాంగ్’కు ఓకే చెప్పాను. సినిమాల్లోకి రాకముందు చాలా బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఆ క్యారెక్టర్ కోసం 30 కిలోలు తగ్గాను. మెడిటేషన్, డైట్, యోగా ఇలా ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలు ప్రయత్నించాను. అప్పుడున్నట్టు ఇప్పుడుంటే నన్ను బబ్లీ సిన్హా అనేవారు (నవ్వుతూ). సినిమాల్లోకి వచ్చాకే అసలు లైఫ్ స్టార్ట్ చేశాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మొదట్లో నాకు డ్యాన్స్ అసలే రాదని బాలీవుడ్ కోడై కూసింది. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. పట్టుదలగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను. హీరోయిన్‌గా నా జర్నీ హాయిగా ఉంది. మా పేరెంట్స్ కూడా హ్యాపీ. మా నాన్నే నాకు గ్రేట్ ఫ్యాన్.
 
రాజమౌళి డెరైక్షన్ ఇష్టం..

ఇప్పటి వరకు 3 తెలుగు రీమేక్ చిత్రాల్లో నటించాను. తాజాగా ‘ఒక్కడు’ సినిమాను హిందీ రీమేక్ ‘తేవర్’లో నటించాను. తెలుగు రీమేక్స్‌లో నటించానని కాబోలు.. తెలుగు ప్రజలు కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తారు. అందుకు థ్యాంక్స్. డెరైక్ట్ తెలుగు మూవీలో కూడా నటించాలని ఉంది. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్ చేయాలని ఉంది. రాజమౌళి డెరైక్షన్ అంటే ఇష్టం.
 
వావ్ హైదరాబాద్..

షూటింగ్స్ కోసం హైదరాబాద్‌కు ఎన్నోసార్లు వచ్చాను. ప్రతిసారి ఇక్కడి వారు నన్ను సొంతింటి మనిషిలా పలకరించడం సంతోషంగా ఉంది. ఈ ప్లేస్‌లోనే ఏదో మేజిక్కో, మాగ్నెటో ఉన్నట్టుంది. ఆ పవర్ మనుషులనే కాదు, మనసులనూ ఆకర్షిస్తున్నట్టుంది. ఇక్కడ చార్మినార్, దాని దగ్గర దొరికే లస్సీ, గరం సమోసా టేస్ట్ చేస్తే ఎవరైనా వావ్ హైదరాబాద్ అనాల్సిందే. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ మై సూపర్ బెస్ట్ ప్లేస్.
 

మరిన్ని వార్తలు