ఏం చేయాలి అక్కా..!

22 Feb, 2015 00:53 IST|Sakshi
ఏం చేయాలి అక్కా..!

అమ్మాయిలు అన్నిట్లో ముందుండాలి.. సగం అవకాశాలను అందుకుంటూ ఆకాశంలో సగమై కనిపించాలి! ఆశ బాగుంది.. సాధించాలనే ఆరాటమూ ఉంది.. ప్రయత్నమూ కనిపిస్తోంది.. ఇదే తీరులో ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే శక్తులూ వీలున్న చోటల్లా తమ వికారాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాయి!. అందుకు ఓ ఉదాహరణ..
 - సరస్వతి రమ
 
 ప్రశాంతి (పేరు మార్చాం) స్పోర్ట్స్ గర్ల్. ఎనిమిదో తరగతి చదువుతోంది. తను ఆడే గేమ్‌లో మెరుపు కదలికలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఊళ్లో వ్యవసాయం చేసుకుంటారు. తను పట్టణంలోని హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం. బిడ్డ ఆసక్తికి అడ్డుకట్ట వేయకుండా.. ఆడపిల్ల అయినా అన్నిట్లో ఉండాలనే కోరికతో పట్నంలో ఉంచారు. ప్రతి టోర్నీలో ప్రశాంతి గెలుపు ఆ తల్లిదండ్రుల్ని మురిపిస్తూనే ఉంది.
 
 ఈ మధ్య..
 పిల్ల బాగా భయపడుతోంది. ఇదివరకటి ఉత్సాహం కనిపించట్లేదు. ప్రాక్టీస్‌కి వెళ్లాలంటే భయంతో చెమటలు పడుతున్నాయి. తన క్లాస్‌మేట్స్, ఆటలోని బ్యాచ్‌మేట్స్ గమనించారు. కారణం అడిగితే చెప్పట్లేదు. సెల్‌ఫోన్ రింగవుతుంటే చాలు నిలువెల్లా వణికిపోతోంది. ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లేయర్ (జూనియర్). అదే ఆటకు చెందిన తెలంగాణ స్టేట్ ప్లేయర్స్‌తో మంచి స్నేహం ఉంది. సీనియర్స్‌ని అక్కా.. అంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంది. వాళ్లూ ఈ పిల్లను అంతే ఇదిగా చూస్తారు. ఆ చనువుతోనే ఓ అక్కకు తన ప్రాబ్లం చెప్పాలనుకుంది.
 
 ఫోన్ చేసింది..
 ‘అక్కా.. సర్ (ఆ అమ్మాయి ఆడే ఆటకు సంబంధించిన ఆ స్టేట్ అథారిటీలోని ఒక అధికారి) నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడక్కా.. ముద్దు పెట్టుకొమ్మని కూడా అడుగుతున్నాడు. ఊరికే ఫోన్ చేయమని సతాయిస్తున్నాడు. నేను చేయకపోతే తనే చేస్తున్నాడు. అక్కా.. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం అమ్మావాళ్లకు చెబితే.. అన్నీ మానిపించి ఊరికి తీసికెళ్లిపోతారు. నేను చదువుకోవాలి.. ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా మంచి పేరు సంపాదించుకోవాలి.. ఎలా అక్కా?’ అంటూ బాధను, భయాన్నీ పంచుకుంది. ‘మీ పేరెంట్స్‌కే చెప్పు’అని చెప్పాలనిపించింది ఆ అక్కకు. కానీ తనూ భయపడింది. ఇలాంటివుంటాయని తెలిస్తే తనింట్లో పేరెంట్స్ తనని ఇంటికే పరిమితం చేస్తారు. ‘ఇలా అయితే మళ్లీ పాతరోజులకి వెళ్లడం ఖాయం. ఎవరూ ఆడపిల్లల్ని చదివించరు, తమ లక్ష్యాలను నెరవేర్చుకునే ఛాన్స్ ఇవ్వరు. కానీ ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయాలి.. ఎలా?’ ఆలోచనల్లో పడింది ఆ సీనియర్!
 
 ఇది తాజా సంఘటన. నిన్నమొన్న జరిగిందే! పరిష్కారం ఇంకా దొరకలేదు. ఈ అంశాన్ని మీరు చదివేటప్పటికి కూడా ఆ అధికారి నిర్వాకం బయటపడి ఉండకపోవచ్చు!. ఓ వైపు అంగారక గ్రహం మీద జీవి జాడలు తెలుసుకునేంత విజ్ఞానం.. ఇంకోవైపు భూగ్రహం మీదఆడబిడ్డలను కాపాడుకోవడంలో ప్రాథమిక దశలో కూడా లేని జ్ఞానం! ఈ అసమతుల్యం ఎప్పుడు పోయేను.. బిడ్డలు ఆకాశంలో సగమై ఎప్పుడు నిలిచేను?.

>
మరిన్ని వార్తలు