టెడ్డీ టేల్

9 Sep, 2014 02:28 IST|Sakshi
టెడ్డీ టేల్

బేర్‌మంటూ మారాం చేసే పిల్లలను ఊరుకోపెట్టాలంటే కావాలొక టెడ్డీబేర్. ముచ్చటైన అమ్మాయిలు ఎత్తుకుని ఆడించేందుకు వారికీ కావాలొక టెడ్డీబేర్. చిన్నారులైనా, ఆరిందాలైనా.. నిద్రపోయేటప్పుడు వెచ్చగా  హత్తుకోవడానికి వారికీ కావాలొక నిలువెత్తు టెడ్డీబేర్. ఇంపైన ఇళ్లలో తీర్చిదిద్దిన డ్రాయింగ్ రూముల్లోని షోకేసుల్లో ఒక టెడ్డీబేర్ అయినా కనిపించి తీరుతుంది. అది లేకుంటే ఆ అలంకరణలోనే ఏదో లోటు కనిపిస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బొవ్మును సిటీవాసులు ఏనాడో రెడ్‌కార్పెట్ పరచి ఆహ్వానించారు. తవు ఇళ్లలో చోటిచ్చి ఆనందిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే అందరి బంధువుగా మారిన టెడ్డీబేర్ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ప్రత్యేక కథనం.
 
 అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్‌వెల్ట్ కొనసాగుతున్న కాలం. మిసిసిపీలో భల్లూకాల బెడద ఎక్కువగా ఉండేది. వాటిని అరికట్టేందుకు వేటకు రావాలంటూ గవర్నర్ ఆండ్రూ హెచ్ లాంగినో 1902 నవంబర్‌లో రూజ్‌వెల్ట్‌ను ఆహ్వానించాడు. వేటగాళ్ల బృందంతో కలసి రూజ్‌వెల్ట్ అడవికి వెళ్లాడు. బృందంలోని చాలామంది వేటగాళ్లు దొరికిన జంతువునల్లా వేటాడుతూ ముందుకు సాగుతుండగా వారికొక ఎలుగు పిల్ల చిక్కింది. దానిని ఉచ్చువేసి బంధించారు.
 
 దానిని కాల్చి చంపాల్సిందిగా రూజ్‌వెల్ట్‌ను కోరితే, పసితనం వీడని జంతువును వేటాడటం వేటగాడి లక్షణం కాదంటూ ఆయన కాల్పులు జరిపేందుకు నిరాకరించాడు. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఈ ఉదంతాన్ని 1902 నవంబర్ 16 సంచికలో ప్రముఖంగా ప్రచురించింది. కథనానికి అనుబంధంగా కార్టూన్‌ను వేసింది. ఇది ఆకట్టుకోవడంతో టాయ్స్ కంపెనీ మోరిస్ అండ్ రోజ్ మిక్టమ్ ఎలుగు పిల్ల బొమ్మను రూపొందించింది. దానికి ‘టెడ్డీబేర్’గా నామకరణం చేసేందుకు రూజ్‌వెల్ట్ అనుమతి కోరడంతో, ఆయన అంగీకరించారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. హైదరాబాద్ సహా భారత్‌లోని నగరాల్లోనూ టెడ్డీబేర్ బొమ్మలకు దశాబ్దాలుగా విపరీతమైన క్రేజ్ ఉంది. టెడ్డీబేర్ తర్వాత మార్కెట్‌లోకి చాలారకాల సాఫ్ట్‌టాయ్స్ వచ్చినా, వాటి స్థానం టెడ్డీబేర్ తర్వాతే.
 
 టెడ్డీబేర్ డే...
 అమెరికాలో కొందరు సెప్టెంబర్ 9న టెడ్డీబేర్ డే జరుపుకుంటూ వస్తున్నారు. మిగిలిన దేశాల్లోనూ చాలామంది ఇదేరోజును అనుసరిస్తున్నారు. వాలెంటైన్స్ డే తర్వాత తొమ్మిదోరోజు.. ఫిబ్రవరి 22న కూడా కొందరు టెడ్డీబేర్ డే జరుపుకుంటున్నారు. అమెరికాలోని టెడ్డీబేర్ బొమ్మలు తయారు చేసే వెర్మంట్ టెడ్డీబేర్ కంపెనీ నవంబర్ 13వ తేదీని జాతీయ టెడ్డీబేర్ డేగా ప్రకటించింది. టెడ్డీబేర్ డేను జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, ఇలాంటి రోజులు చిన్నారులు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా, గడపడానికి దోహదపడతాయి.
 
  మరిన్ని..
 టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా లాభసాటి వ్యాపారాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2006 నాటికి ఈ వ్యాపారం టర్నోవర్ 1,300 కోట్ల డాలర్లకు పైమాటే. 1980ల తర్వాత టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం విపరీతంగా పుంజుకుంది. టెడ్డీబేర్‌ల కోసం తొలిసారిగా 1984లో ఇంగ్లండ్‌లో హాంప్‌షైర్ ప్రాంతంలోని పీటర్స్‌ఫీల్డ్‌లో మ్యూజియం వెలిసింది. ఇది 2006లో మూతబడింది. అయితే, ఈలోగా ప్రపంచంలో చాలాచోట్ల టెడ్డీబేర్ మ్యూజియంలు మొదలయ్యాయి. విపత్తులు, ప్రమాదాలు తలెత్తినప్పుడు విధులు నిర్వర్తించే పోలీసులకు అమెరికా ప్రభుత్వం టెడ్డీబేర్ బొమ్మలను ఇస్తుంది. విపత్తుల్లో చిక్కుకున్న చిన్నారులకు ఈ బొమ్మలు ఇస్తే, వారు తేలికగా ఊరట చెందుతారనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది.
 -  పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు