క్లైమాక్స్కు చేరిన తెలంగాణ బిల్లు

12 Feb, 2014 09:16 IST|Sakshi
క్లైమాక్స్కు చేరిన తెలంగాణ బిల్లు

రాష్ట్ర విభజన అంకం క్లైమాక్స్‌కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం -  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం అన్నీ చకచకా జరిగిపోయాయి.  రేపు  లోక్సభలో కూడా అడుగుపెట్టబోతోంది.  విభజన ద్వారా ఆర్థికంగా పలు నష్టాలను ఎదుర్కోబోతున్న సీమాంధ్ర ప్రాంతాన్ని ఆదుకునేందుకు నిర్దిష్ట హామీలేవీ బిల్లులో లేవు. అడ్డగోలుగా కేంద్రం విభజనకు సిద్దమైంది. రాజధాని ఏర్పాటు, దానికి కావలసిన వనరుల అంశం కూడా ప్రస్తావించలేదు. ఈ విషయమై ఆర్థికవేత్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల విభజనతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విభజనకు కొన్ని ప్రత్యేకమైన చిక్కులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువగా కేంద్రీకృతమైన రాజధానిని, అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉండటం దీనికి ప్రధాన కారణం. ఈ నష్టాన్ని పూడ్చేందుకు వివిధ వర్గాల నుంచి సూచనలు వచ్చినప్పటికీ, కేంద్ర మంత్రి మండలి ఆ  అంశాలను పూర్తిగా పెడచెవిన పెట్టింది.

రాష్ట్ర విభజన అనివార్యమైతే కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక ఇక్కట్లు చుట్టుముట్టనున్నాయి. చివరకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు, రోజువారీ ప్రభుత్వ ఖర్చులకూ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఈ సమస్యలన్నీ ప్రస్తావిస్తూ, సీమాంధ్ర భవిష్యత్తు కష్టాలు తీర్చటానికి ఉద్దేశించి సీమాంధ్ర ప్రతినిధులు విభజన బిల్లుకు పలు సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఫలితంలేదు. వారి సూచనలను కేంద్ర మంత్రి మండలి  బేఖాతరు చేసింది. మొండిగా తన పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది.

సీమాంధ్ర ఆదాయం పెరిగేందుకు వీలుగా ప్రత్యేక సాయాన్ని అందించాలనే కోరికలనూ, కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలనే విజ్ఞప్తులనూ కేంద్రం తోసిపుచ్చింది. అభివృద్ధి కేంద్రీకృతమైన  హైదరాబాద్ ఆదాయంలో వాటా ఇవ్వాలనే విన్నపాలనూ, చివరకు కొత్త రాజధాని నిర్మాణానికి నిర్దుష్టమైన ప్యాకేజీని ముందే ప్రకటించాలనే డిమాండ్‌నూ పట్టించుకోలేదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆదాయం నుంచి వాటా, గ్రాంట్లు సమకూరుతుంటాయి.

2012-13 సంవత్సరాన్ని పరిశీలిస్తే వ్యాట్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, గనులు తదితర రంగాల ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం 68 వేల 411 కోట్ల రూపాయలు. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి 40వేల 919 కోట్లు రాగా, సీమాంధ్ర ప్రాంతం నుంచి  27,492 కోట్లు వచ్చాయి. అంటే సీమాంధ్ర నుంచి సమకూరిన ఆదాయుం కేవలం 44 శాతమే. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది.
 
కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా, కేంద్ర గ్రాంట్లు కలిపి 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం 34వేల 064 కోట్లు వస్తున్నాయి. జనాభా నిష్పత్తి, విస్తీర్ణం, పథకాల అమలు, మానవ వనరుల సూచిక, ప్రగతి అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఏ ప్రాంతానికి ఎంత వాటా ఇవ్వాలో లెక్కిస్తారు. ప్రాంతాల వారీగా లెక్క తీస్తే తెలంగాణ ప్రాంతానికి 16వేల 384 కోట్లు రూపాయలు, సీమాంధ్ర ప్రాంతానికి 17వేల680 కోట్ల మేరకు కేంద్రం నుంచి వస్తున్నట్లు ఆర్థిక నిపుణులు లెక్కలేశారు.
 
రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి అందే గ్రాంట్లు, వాటాలు కలిపి మొత్తం లక్షా 2వేల 475 కోట్ల రూపాయలఆదాయం వచ్చింది. ఇందులో సీమాంధ్రకు 45వేల 172 కోట్లు అంటే 44 శాతం,  తెలంగాణకు 57వేల 303 కోట్లు అంటే 56 శాతం ఆదాయం సమకూరింది. మొత్తం మీద స్థూలంగా చూస్తే విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంత ఆదాయం 44 శాతం మాత్రమే.
 
ప్రస్తుతం జిల్లాల వారీగా జరుగుతున్న వ్యయాన్ని లెక్కిస్తే 56.1 శాతం రెవెన్యూ వ్యయం సీమాంధ్ర జిల్లాలో ఉంది. దీంట్లోనే జీతాలు, పెన్షన్లు, సంక్షేవు పథకాలు, అభివృద్ధి పనులకు పెట్టే ఖర్చు కలిసి ఉంటుంది. ఈ వ్యయానికి అదనంగా రుణాలపై వడ్డీలను కూడా కలిపితే 60 శాతానికి సీమాంధ్ర ప్రభుత్వ వ్యయం చేరుతుంది. అంటే 44 శాతం ఆదాయానికి 60 శాతం వ్యయం ఉండబోతోంది. 16 శాతం మేర లోటు రాబోయే కాలంలో సీమాంధ్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆర్థిక కష్టాల్లో ముంచెత్తనుంది.

తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగుల సంఖ్య 44.2 శాతం ఉంటే,  సీమాంధ్రలో 55.8 శాతం ఉంది. అలాగే తెలంగాణ ప్రాంత పెన్షనర్ల సంఖ్య 41.3 శాతం ఉండగా, సీమాంధ్రలో 58.7 శాతం మంది పెన్షనర్లు ఉన్నారు. అంటే సీమాంధ్ర కొత్త ప్రభుత్వం ఈమేరకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లపై భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
ఐటీ సేవలు, పరిశ్ర మలు, ఎక్సైజు, ఫార్మా, ప్రైవేటు వైద్యం, ఇతర సేవారంగాలు, కార్పొరేటు కంపెనీల కార్యాలయాలు కేంద్రీకృతమైన రాజధాని నగరం హైదరాబాద్ నుంచే రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ఆదాయం హైదరాబాద్‌లోనే 76 శాతం - 31వేల 943 కోట్ల రూపాయలు రాగా, సీమాంధ్రలో 16 శాతం అంటే 6వేల 684 కోట్ల రూపాయలు, తెలంగాణ జిల్లాల్లో 8 శాతం అంటే 3వేల 433 కోట్లు వచ్చింది. ఇలా రాష్ట్ర సొంత ఆదాయం ప్రధానంగా హైదరాబాద్‌పై కేంద్రీకృతమై ఉంది. రాజధాని ఆదాయంలో సీమాంధ్ర రాష్ట్రానికి సమంజసమైన వాటా పంపిణీ చేయాలనే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఆర్థిక నిపుణుల సూచనలను కేంద్ర కేబినెట్ తిరస్కరించింది. కీలకమైన రాజధాని ఆదాయంలో వాటా కోల్పోవడం వల్ల సీమాంధ్ర ఆదాయానికి భారీగా గండిపడనుంది. ఫలితంగా కొత్త రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి ప్రణాళికా వ్యయానికి సైతం తీవ్రంగా నిధుల కొరత ఏర్పడుతుంది.

s.nagarjuna@sakshi.com

మరిన్ని వార్తలు