పుత్తూరు ఘటనలో కరుడుగట్టిన ఉగ్రవాదులు

5 Oct, 2013 23:29 IST|Sakshi
పుత్తూరు ఘటనలో కరుడుగట్టిన ఉగ్రవాదులు

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్)  చేపట్టిన మొట్ట మొదటి ఆపరేషన్ విజయవంతమైంది. ఆక్టోపస్ కమాండోలు చాకచక్యంగా వ్యవహరించి కరుడుగట్టిన ఇద్దరు తీవ్రవాదులను పట్టుకున్నారు.  గేటుపుత్తూరు మేదరవీధిలోని ఒక ఇంట్లో దాక్కున్నవారిలో ఒకరు ఇస్లామిక్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ అలియాస్ మున్నా కాగా, రెండవ వాడు అల్‌-ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందిన  బిలాల్ మాలిక్‌. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని చెన్నై తరలించారు. ఈ ఆపరేషన్లో తమిళనాడు, స్థానిక పోలీసులతోపాటు ఆక్టోపస్ కమాండోలు,  ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) సిబ్బంది పాల్గొన్నారు.

అల్-ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన తీవ్రవాది పోలీస్ ఫక్రుద్దీన్ను తమిళనాడు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు.  చెన్నైలో దాడులు చేయాలన్న లక్ష్యంగా అతను చెన్నై పెరియార్ మేడలోని ఒక లాడ్జిలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా  పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. శనివారం తెల్లవారు జామునుంచి పోలీసులను ఉగ్రవాదులు నానా తిప్పలు పెట్టారు.   తమిళనాడుకు చెందిన సిఐ  లక్ష్మణన్‌ను కత్తితో అయిదారు చోట్ల పొడిచారు.  అతను తీవ్రంగా గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  తీవ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఆక్టోపస్ కమాండోలను 50 మందిని తిరుమల నుంచి పుత్తూరుకు రప్పించారు.  పోలీసులు బెదిరించడంతో బిలాల్ తన భార్య, ముగ్గురు పిల్లలను మధ్యాహ్నం   బయటకు పంపించాడు. లొంగిపోయిన వారిని పోలీసులు పుత్తూరు ఆస్పత్రికి పంపారు.  సుమారు 11 గంటల సేపు పోరాడి   బిలాల్, ఇస్మాయిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో తీవ్రవాది అలీం తప్పించుకున్నాడు.

తప్పించుకుపోయిన ఉగ్రవాది జాడ కనుక్కునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  వీరు అనేక పేలుడు సంఘటనలలో నిందితులని తెలుస్తోంది.  ఆ ఇంట్లో పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   ఆల్‌-ఉమా తీవ్రవాదుల లక్ష్యం తిరుమలేనని  ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.  బిలాల్, ఇస్మాయిల్‌ మరో ఇద్దరు కలిసి తిరుమలలో రెక్కీ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది.

దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు  ఫక్రుద్దీన్ కోసం ఏళ్ల తరబడి గాలిస్తున్నారు. ఇమాం అలీ అనే తీవ్రవాదిని 2002లో మదురై కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతుండగా ఫక్రుద్దీన్ పోలీసులపై బాంబులు విసిరి అతడిని విడిపించుకుపోయాడు.  బీజేపీ అగ్రనేత అద్వానీపై 2011లో హత్యాయత్నం, హిందూమున్నని తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, ఆడిటర్ రమేష్ హత్యకేసుల్లో  ఫక్రుద్దీన్ నిందితుడు. మదురై జిల్లా సుంగంపల్లివాసల్ వీధికి చెందిన పోలీస్ ఫక్రుద్దీన్ (48), ఇతని అనుచరులైన తిరునల్వేలి మేల్‌పాలయూనికి చెందిన ఇస్మాయిల్ (35),  బిలాల్‌మాలిక్ (25), అబూబకర్ సిద్ధిక్ (48) కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వీరిని పట్టిస్తే 20 లక్షల రూపాయలు,  సమాచారమిచ్చినా ఒక్కోక్కరికి 5 లక్షలు రూపాయల బహుమతి  ప్రకటించారు.  బాంబులు తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడం వంటి విషయాల్లో కాశ్మీర్‌లోని తీవ్రవాదుల వద్ద పోలీస్ ఫక్రుద్దీన్ శిక్షణ పొందాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం ముమ్మరంగా వేట సాగించారు.

 ఇస్లామిక్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడైన  ఇస్మాయిల్‌ మధురై కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఇస్మాయిల్, మాలిక్, ఫక్రుద్దీన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు