గిరిజనుల మనసులో ఏముంది!

29 Jun, 2014 03:31 IST|Sakshi
గిరిజనుల మనసులో ఏముంది!

అండమాన్-నికోబార్ దీవుల్లోని ఆదిమ ప్రజలైన జరావా గిరిజనులు దశాబ్దం కిందట వచ్చిన సునామీ ముప్పును ముందే గుర్తించారు. వారిలో ఏ ఒక్కరూ సునామీ బారిన పడలేదు. వారంతా ఎత్తై ప్రాంతాలకు ముందుగానే వెళ్లిపోవడం ‘నాసా’ శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరచింది. అయితే, జరావా గిరిజనులను పరిహసిస్తున్న ‘ఆధునిక సునామీ’ని కళ్లకు కడుతూ పంకజ్ షెఖ్‌సరియా తన తొలి ఇంగ్లిష్ నవల ‘ద లాస్ట్ వేవ్- ఏన్ ఐలాండ్ నావెల్’లో స్పృశించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయనతో ‘సిటీప్లస్’ ఇంటర్వ్యూ..
 
 జరావా గిరిజనుల గురించి ఎందుకు తెలుసుకోవాలి?

 జరావా గిరిజనులు ఏకాంత జీవితాన్ని కోరుకుంటారు. నగ్నంగా, స్వేచ్ఛగా జీవిస్తారు. అండమాన్ దీవులన్నింటినీ కలుపుతూ నిర్మించిన గ్రేట్ అండమాన్ ట్రంక్‌రోడ్ వారి పాలిట శాపమైంది. ‘సభ్య’సమాజపు యాత్రికులు ఈ రోడ్డుపై పర్యటనలు చేస్తూ గిరిజనుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. ఈ దీవుల్లో రోడ్డు అవసరం లేదని, పడవల ద్వారా ఏ ప్రాంతమైనా చేరుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సైతం అపహాస్యమవుతోంది. జరావాల జీవితాలు.. పర్యావరణం, ప్రకృతిపై ఈ పర్యటనలు ఒక రకంగా దాడే. మన ప్రవర్తన గిరిజనులపాలిటి సాంస్కృతిక సునామీగా పరిణమిస్తోంది!
 
 వ్యాసాల నుంచి నవలకు మారడానికి కారణం?
 రచన, సమాజంతో వ్యక్తి జరిపే సంభాషణ. నాన్ ఫిక్షన్ ఒక టూల్. ఫిక్షన్ మరొక టూల్. పాతికేళ్లుగా  వివిధ ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాస్తున్నాను. ‘ట్రబుల్డ్ ఐలాండ్స్’, ‘ద స్టేట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ నార్త్-ఈస్ట్ ఇండియా’, ‘ద జరావా ట్రైబల్ రిజర్వ్ డోసియర్’ వంటి వ్యాస సంకలనాలు వచ్చాయి. ఫిక్షన్ ద్వారా మనుషుల ఉద్వేగాలను ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు. ‘ద లాస్ట్ వేవ్’ ద్వారా జరావా గిరిజనుల జీవితాలను మైదానప్రాంత పాఠకులకు చేర్చే ప్రయత్నం చేశాను.
 
 నవలలో పాత్రల గురించి చెప్పండి?
 మొత్తం పాత్రలు పదిలోపే. ప్రధానపాత్రలు నాలుగు. హరీష్ అనే జర్నలిస్ట్, సీమ అనే స్థానిక యువతి, మొసళ్ల పరిశోధకుడు డేవిడ్, స్థానిక వృద్ధ గైడ్ అంకుల్ పామె. వీరి ద్వారా పడవలో- రోడ్డుపై - అడవిలో - నడక మార్గంలో అండమాన్ జీవన సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని చూపే ప్రయత్నం చేశాను. ఒక తెలుగు సినిమా పాటలో ‘పిట్ట మనసులో ఏముందీ’ అనే చరణం ఉంది. వేధించడం ద్వారా కాదు, ప్రేమించడం ద్వారా గిరిజనుడి మనసులో ఏముందో నాగరికులు తెలుసుకోవాలని ‘ద లాస్ట్ వేవ్’ సూచిస్తుంది!
 
 మీ గురించి చెప్పండి?

 నాన్న ఉద్యోగరీత్యా రాజస్థాన్ నుంచి పుణే వచ్చారు. మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. కొన్నేళ్లుగా హైద్రాబాద్‌లో ఉంటున్నాను. తెలుగమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కుమారుడు కబీర్‌కు ఐదేళ్లు. నెదర్లాండ్స్ యూనివర్సిటీలో   ‘సమాజంపై సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం’ గురించి పరిశోధన చేస్తున్నాను. స్థానిక-జాతీయ-అంతర్జాతీయ స్థాయిల్లో పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ (kalpavriksh.org)సభ్యుడిగా ఇరవయ్యేళ్లుగా అండమాన్-నికోబార్‌లను సందర్శిస్తున్నాను.
  . . : : పున్నా కృష్ణమూర్తి
   పంకజ్ షఖ్‌సరియా
 ‘ద లాస్ట్ వేవ్’ నవలా రచయిత

మరిన్ని వార్తలు