సమస్యలు పరిష్కరించండి | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Published Sun, Jun 29 2014 4:27 AM

Solve problems

చిత్తూరు(ఎడ్యుకేషన్): సమస్యలు సకాలంలో పరిష్కరించండి అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ సెల్‌లో అధికారులకు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్‌లో శనివారం సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ధనుంజయరావు అర్జీలు స్వీకరించారు.

గత ఆరు నెలలుగా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు డివిజన్ స్థాయిలో నిర్వహించడంలేదని దళిత ప్రజా వేదిక జిల్లా అధ్యక్షులు కె.ధనుంజయరావు తెలిపారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందని, దీనిని నివారించాలన్నారు.  
 
చిత్తూరులో ఉన్న బీఆర్ అంబేద్కర్ భవన్‌లో దళితులు చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటుంటారని, ఇక్కడ వధూవరులకు ప్రత్యేకంగా గదులు లేవని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునుస్వామి తెలిపారు. ప్రభుత్వం ఈ గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
5.06 సెంట్ల భూమిలో ఉన్న తమ గుడిసెలను ఈ నెల 15వ తేదీన తిరుపతి రూరల్ ఆర్‌ఐ, వీఆర్‌వో పోలీసులతో వచ్చి ధ్వంసం చేశారని దామినేడు, కోట్రమంగళం గ్రామస్తులు తెలిపారు. తాతముత్తాతల కాలం నుంచి ఆ భూములు తమ స్వాధీనంలో ఉన్నాయని అంబ్కేదర్ యువజన సంఘం, రమాబాబు అంబేద్కర్ మహిళా సంఘంగా ఏర్పడి 0.3 సెంట్లు చొప్పున పంచుకొని గుడిసెలు వేసుకున్నామన్నారు. తమకు ఇంటి పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
 
వచ్చే నెల నుంచి ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌కు జిల్లా కలెక్టర్, జేసీ తప్పనిసరిగా రావాలని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి.జయరామ్, దళిత సంఘాల నేతలు కృష్ణయ్య, విజయ్‌భాస్కర్, భూపాల్, సిద్ధయ్యమూర్తి డిమాండ్ చేశారు. గ్రీవెన్స్‌ను అధికారులు చిత్తశుద్ధితో నిర్వహించడంలేదని వాపోయారు. వచ్చే నెల నుంచి వారు రాకపోతే గ్రీవెన్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు.
 

Advertisement
Advertisement