శార్వరి నామ సంవత్సర (ధనస్సు రాశి ) రాశిఫలాలు

22 Mar, 2020 08:46 IST|Sakshi

(ఆదాయం  8, వ్యయం  11,  రాజపూజ్యం 6, అవమానం 3)

ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ ద్వారా సహాయసహకారాలు పొంది, మీ పలుకుబడితో ఉన్నతస్థానాలలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీపట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు. పరోక్షంగా వారిని కూడా భాగస్వాములను చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి. మీ కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు తోస్తుంది. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మీ కోరికలను వారి ఆమోదిస్తారు. అంతేకాక ప్రతి విషయంలోను స్త్రీల సహాయసహకారాలు మీకు లభిస్తాయి. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధిచేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు.

సమాజంలో మీరంటే ఏమిటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.  ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు. కానీ చివరిక్షణంలో ఆ స్థానచలనం ఆగిపోతుంది. అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అనాథలు వారికి సంబంధించిన సేవాసంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు. మీకు దొంగ లెక్కలు చెప్పేవారు అధికమవుతారు. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా, స్వయంగా పరిశీలించుకోవడం మంచిది. సౌకర్యం కోసం కార్యాలయం మారుస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు.

మీ పాండిత్యం అందరిచేత ప్రశంసించబడుతుంది. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. శత్రువర్గం అంటే చిన్న శత్రువర్గం కాదు. ఉన్నతస్థానంలో ఉన్న అధికారుల అండదండలు కలిగిన వారితో పోరాటం చేయవలసి వస్తుంది. మీ మిత్రవర్గం, మీకు సన్నిహితంగా చెప్పుకునే వారు మీరు పోరాటంలో ఓడిపోవాలని కోరుకుంటారు. శల్యసారథ్యం చేస్తారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికికి, స్థానానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాముల నిరాశా వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వారిని కార్యోన్ముఖులను చేయగలుగుతారు. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌., ఐ.ఐ.టి ఉద్యోగాలకుఎంపికవుతారు. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వపరంగా, ప్రైవేటు సంస్థలపరంగా రావలసిన పెద్ద మొత్తంలోని ధనం మీ చేతికి అందుతుంది. మీ స్వంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు సన్నిహితులతో, మిత్రులతో చర్చించడం మరువవద్దు.

కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పూజించడం చెప్పదగినది. సంస్కారహీనులు, వ్యసనాలకు బానిసలైన చిన్ననాటి మిత్రులను దూరంగా ఉంచుతారు. వారి ప్రవర్తన కారణంగా మీ చేతిలో ఉన్న సహాయం కూడా చేయరు. దూరప్రాంత విద్య, ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి అనుకూల సంవత్సరమిది. యూనియన్‌ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. తోటివారికి న్యాయం జరగాలని మీరు జరిపే పోరాటం ఫలిస్తుంది. సాంకేతిక కారణాల వలన పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని నమ్ముతారు. ఇందువల్ల ప్రయోజనాలకు నష్టం ఏర్పడకపోయినా అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలవైపు దృష్టి మళ్ళించడం మంచిది.

మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. కుటుంబసభ్యులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసిరావు. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఇమెయిల్స్‌ లేదా ఫోన్‌ సంభాషణల ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందుకుంటారు. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నిదానమే ప్రధానమన్న సూక్తిని పాటించడం మంచిది. రాజకీయ పదవి లభిస్తుంది. అంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారికి చోటు కల్పించకండి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చులు, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా? అనే భావన కలుగుతుంది. ఇసుక నుండి తైలం తీయవచ్చు కానీ ఇష్టంలేని వ్యక్తుల నుంఢి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యంకాని పని అని గ్రహిస్తారు. కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైట్‌ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వివాదాలకు, తగువులకు దూరంగా ఉండాలని మీరు భావించినా కాలం అందుకు సహకరించదు.

మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి ఋజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేకమందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే ‘‘పాముపడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేతకాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు. భగవంతుడిని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో ఋజువవుతుంది. రియల్‌ ఎస్టేట్‌ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు వ్రాసిన డాక్యుమెంట్స్‌లో లోపాలు బయటపడతాయి.

కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయినవారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదేపనిగా గుర్తుకురావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తిసామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు.  ప్రింట్‌మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి.

కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇన్‌కవ్‌ుట్యాక్స్‌ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్‌ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి, చోరభయం పొంచి వుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్‌ మార్కెట్లు కలిసిరావు.
 

మరిన్ని వార్తలు