తాబేలు తలకాయ

22 Dec, 2013 02:12 IST|Sakshi
తాబేలు తలకాయ

 సృజనం

 .‘విపంచి’
 ఫోన్ మాట్లాడుతూ, కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టాను. అప్పటికే మిగిలినవాళ్లంతా వచ్చి ఉన్నారు. ఇంకా సమావేశం ప్రారంభం కాలేదు కాబట్టి, ఎవరి దారినవాళ్లు నోట్‌బుక్‌తో, లాప్‌టాప్‌తో, కొంతమంది మొబైల్ ఫోన్లతో హడావుడి పడుతున్నారు.
 వెంటనే నేను నా వై-ఫై ఆన్ చేశాను. ఒకతను నావైపు తిరిగి- ‘‘పాస్‌వర్డ్ చెప్పరా?’’ అనడిగాడు. నేను చెప్పాను.
 
 చాలామంది తమ పర్సనల్ నెట్ నుంచి డిస్ కనెక్ట్ అయి, వై-ఫై మీద పడ్డారు.
 నిజం చెప్పాలంటే మేమెవరమూ సాఫ్ట్‌వేర్ కాదు. ఓ చాక్లెట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాం. మూడు నెలలకోసారి జరిగే సమీక్షా సమావేశం అది. ఒకోసారి ఒకో టూరిస్ట్ ప్లేస్‌లో పెడుతుంటారు. మూడు నెలల అమ్మకాలు, అందులో ఎగుడుదిగుడుల గురించి చాలామటుకు తలంటి, అడపాదడపా మెచ్చుకుని ఓ రెండు రోజులు జరిపిస్తారు. మూడో రోజు ఆటవిడుపు - మందు పార్టీ, దగ్గర్లో ఏదన్నా చూడదగ్గ ప్రదేశం ఉంటే చిన్న ట్రిప్.
 
 మూడు నెలలకోసారి కలుసుకునే అందరికీ ముఖపరిచయమే. అంతకుమించి ఎక్కువ మాట్లాడుకోం. బాగున్నారా? మీ  ఏరియాలో ఎలా ఉన్నాయి సేల్స్?... ఇలాంటి పొడి పలకరింపులు, మధ్యమధ్యలో ‘ఎండ దంచేస్తుంది బాసు- మధ్యాహ్నం లంచ్‌తో పాటు బీర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా- బీరు దాతా సుఖీభవ’ - లాంటి కామెంట్స్.
 
 అంతకుమించి మాటలేవీ ఉండవు. నెట్‌లో మాత్రం రెగ్యులర్ టచ్‌లోనే ఉంటాం. చాలామంది ఫేస్‌బుక్‌లో నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఆసక్తికరమైన సూక్తులు, ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయడం, షేర్ చేసుకోవడం చేస్తుంటాం.
 
 సాధారణంగా ఏది అప్‌లోడ్ చేసినా సెకన్లలో లైక్ చేస్తుంటాం. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి శుభాకాంక్షలు- ఎవరైనా చనిపోతే రిప్ (రెస్ట్ ఇన్ పీస్) చెబుతుంటాం.
 
 ఇక్కడికొచ్చేంతవరకూ- ఇంకా చెప్పాలంటే, ప్రయాణంలోని అడుగడుగు సంఘటనలు- (రైలులో వెజ్ బిర్యానీ ఛండాలంగా ఉంది- ఎదురు సీట్లో అమ్మాయి బాగుంది- అర్ధరాత్రి రైలాగినప్పుడు యాక్సిడెంట్ కాదుగా అని భయంతో కూడిన కామెంట్స్) అప్‌డేట్ చేస్తూనే ఉన్నాం.
 
 నేనిప్పుడు సరదాగా ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ చేసి చూశాను.
 
 నా కొలీగ్ ఒకతను, ‘మేము అమ్మే చాక్లెట్స్ తియ్యగా ఉంటాయి. కానీ మేము హాజరైన మీటింగ్ మాత్రం చేదుగా ఉంటుంది’ అని కామెంట్ పోస్ట్ చేశాడు.
 
 అప్రయత్నంగానే పెదవుల మీద చిరునవ్వు ముంచుకొచ్చింది. వెంటనే లైక్ క్లిక్ చేశాను. చూస్తుండగానే ఆ కామెంట్‌కి చాలా లైక్స్ వచ్చాయి. అందరమూ తలలు దించుకుని, నెట్ చూసుకుంటూ- ఎవరి దారినవాళ్లు చిరునవ్వులు చిందిస్తున్నాం.
 
 ఈలోగా సౌతిండియా రీజనల్ మేనేజర్ కరియప్ప వచ్చాడు. ‘‘మన మార్కెటింగ్ టీమ్ ఒక్కచోట చేరామంటే- గలగలా నవ్వులు... సరదా కబుర్లు ఉంటాయనుకున్నాను. అందరూ ఏంటి ఇంత సీరియస్‌గా ఉన్నారు?’’ అన్నాడు కరియప్ప.
 
 ‘‘మాటలన్నీ మార్కెట్‌లో అమ్మేశాం సార్. మా దగ్గర ఏమీ లేవు’’ అన్నాను.
 ‘‘అదా సంగతి? చాక్లెట్ల బదులు మాటలు అమ్మిన సంగతి సేల్స్ తగ్గడంలోనే తెలుస్తుంది’’ అని సమావేశం ప్రారంభించాడు కరియప్ప.
 
 ఏరియా వారీగా ఒక్కొక్కరికి క్లాసులు, సమాధానాలు నడుస్తున్నాయి. ఈ మీటింగ్స్ రొటీన్ అయిపోవడం వల్ల ఏమో - కరియప్ప తిట్టినా, మనసు మందం అయిపోయి, ఒంటికి పట్టదు.
 ఎట్టకేలకు అతి భారంగా రెండురోజుల మీటింగ్ ముగిసింది. మూడో రోజు దగ్గర్లో ఉన్న కాఫీ తోటలకి వెళ్లాం. కాఫీ గింజలు అమ్ముతుంటుంటే కొన్నాం. ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాత శివాలయం దర్శించుకున్నాం. యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతాల్లో స్నానం చేశాం. ఫొటోలు దిగాం. వెంటనే అవి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాం.
 
 కాఫీ గింజల ఫొటో చూసి- ‘మీ ఇంటికి రేప్పొద్దున కాఫీకి వస్తున్నాం’ అని వాల్ మీద రాసేవాళ్లు కొంతమంది -జలపాతం చూసి, ‘లవ్‌లీ స్పాట్’, ‘యూ ఆర్ లక్కీ’, ‘నెక్స్‌ట్ టైమ్ గాళ్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లడం మిస్ కాకు’ అని కామెంట్స్ - రెండు రోజుల టెన్షన్ ఆ కామెంట్స్‌తో పోయింది. మనసుకి తెలీని రిలాక్సేషన్ అనిపించింది.
 
 నా కొలీగ్ శేఖర్ మాత్రం, ‘‘కరియప్పగాణ్ని బండబూతులు తిట్టాలని ఉంది. కాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయలేం’’ అన్నాడు.
 జలపాతం దగ్గరకి వెళ్లి, ‘‘కరియప్పా! నీయబ్బా’’ అని గట్టిగా అరిచాడు. ఆ కొండ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. నా కొలీగ్స్ చాలామంది నవ్వారు. ఒకరిద్దరు మాత్రం ‘కరియప్ప కూడా ఈ స్పాట్ వచ్చి ఉంటే?’ అని భయపడ్డారు. ఆ ఆలోచన... వచ్చిన కొద్దిపాటి ఆనందాన్ని ఆవిరి చేసింది.
 అక్కడి నుంచి బయల్దేరాం. మళ్లీ ఎవరి ఊళ్లు వాళ్లు, ఎవరి మార్కెట్‌లోకి వాళ్లు, ఎవరి టార్గెట్ మీద వాళ్లు.
 ఎవరెవరి చిన్ని ప్రపంచాల్లోకి వాళ్లం వెళ్లిపోయాం.
 
 గాలి పేజీల మీద ఉబుసుపోని కబుర్లు పంచుకుంటున్నాం. ఎప్పుడన్నా, ఎవరన్నా డీలర్ గురించో, స్టాక్ గురించో మాట్లాడుకోవాల్సి వస్తే, ఫోన్లు చేయడం తప్ప మిగిలిన కుశల సమాచారాలన్నీ నెట్‌లోనే. మళ్లీ మూడు నెలలు అయితే గానీ ముఖాముఖీ కలుసుకోం.
 
 అయితే అనుకోకుండానే అందరమూ కలుసుకోవలసి వచ్చింది. విజయవాడలోని ఓ స్టాకిస్ట్ చనిపోయాడు. దాదాపు మా కంపెనీలోని రిప్రజెంటేటివ్‌లందరికీ ఆయన బాగా తెలిసిన వ్యక్తి. అందువల్ల పెద కర్మకి వెళ్లాల్సి వచ్చింది.
 
 విజయవాడ బస్టాండ్‌లో బస్ దిగగానే ఆయన ఇంటి అడ్రెస్ కోసం ఎవరికి ఫోన్ చేయాలా అనుకుంటే బస్టాండ్ ఎదురుగానే ఓ వినైల్ కనపడింది. స్టాకిస్ట్ సత్యనారాయణ ఫొటో - అటూ ఇటూ రెండు దీపాలు. ‘మీరు లేని మా జీవితం చంద్రుడు లేని నల్లటి ఆకాశం - మీ జ్ఞాపకాలు మాకు దారి చూపించే మణి దీపాలు- ఇట్లు ’ అని కింద కుటుంబ సభ్యుల పేర్లు. పెద కర్మ ఫలానా తేదీ ఫలానా గంటలకు ఫలానా చిరునామాలో అనే వివరాలున్నాయి.
 
 ఆయన ఇంటికి చేరుకోవడం చాలా సులువయ్యింది. కృష్ణలంకలోని ఆయన ఇంటికి వెళ్తుంటే- రకరకాల వినైల్స్, ఫ్లెక్సీలు కనపడ్డాయి. వాడెవడో అశుతోష్ బాబట (ఆ పేరేంటో) అతని పుట్టినరోజు సందర్భంగా అశుతోష్ యూత్ సర్కిల్ శుభాకాంక్షలు-ఇంకెవరో అమ్మాయి - పుష్పవతి అయ్యిందట. ఆ వేడుక గురించి ఆ అమ్మాయి ఫొటోతో వినైల్స్ -మరెవరిదో పెళ్లి - ఆ జంట ఎంగేజ్‌మెంట్ ఫొటోతో ఫ్లెక్సీలు -
 సందు సందుకి అర డజను వినైల్స్ అలాంటివి ఉన్నాయి.
 
 శేఖర్ వాటిని ఆశ్చర్యంగా చూశాడు. ‘‘చాలా టూమచ్ కదా - పుట్టినరోజుకీ చావుకీ పెద్దమనిషి అయినందుకూ పెళ్లి కుదిరినందుకు - ప్రతిదానికీ పబ్లిసిటీయేనా?’’
 అయినా వాళ్ల స్నేహితులకి, చుట్టాలకి ఉత్తరాలు రాసో, ఫోన్లు చేసో చెప్పుకోవచ్చు కదా! ఈ డప్పేంటో? అసహ్యంగా లేదూ?’’ అన్నాడు. నాకూ విచిత్రంగానే ఉంది అదంతా. ఎందుకు ఇలా అన్నీ బయటపెట్టుకుంటారు?
 
 దినం భోజనాలైపోయాక- సత్యనారాయణ కొడుకు ఆ వినైల్స్ అతనికి డబ్బులిస్తున్నాడు.
 ‘‘అన్ని సెంటర్లలో పెట్టాం. బాగానే రెస్పాన్స్ వచ్చిందా అండీ?’’ అనడుగుతున్నాడు ఆ వినైల్ అతను.
 నేను డైనింగ్ హాల్‌ని ఒకసారి చూశాను. కనీసం వందమంది కూడా లేరు. సత్యనారాయణ దగ్గరి బంధువులు. మాలాంటి వ్యాపార సంబంధీకులు తప్పితే, అక్కడ ఎవరూ లేరు. ఎవరి కళ్లల్లో పెద్దగా నీళ్లు కూడా లేవు. కొంతమంది అయితే భోజనాల్లో తగ్గిన ఉప్పు కారాల గురించి మాట్లాడుతున్నారు.
 రెస్పాన్సా? అని నవ్వొచ్చింది.
 
 సత్యనారాయణ కొడుకు చెబుతున్నాడు - ‘‘జనం రెస్పాన్స్ గురించి పెట్టలేదు. నాన్న చనిపోయాడనగానే గుండెలు బరువెక్కిపోయాయి. ఆ దిగులు, బాధ ఎలా దించుకోవాలో, ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. అందుకే ఈ వినైల్స్. ఎక్కడో ఏ మూలనో ఏ దూరపు చుట్టమో, మాకు తెలీని మా నాన్న స్నేహితుడో, ఈ బాధని పంచుకుంటాడని’’ అన్నాడు.
 
 ఒక్కసారిగా నాకు మా అందరి జీవితాల మీద స్పష్టత వచ్చింది. తాబేలు తన డిప్పలోకి తలదూర్చి బతికేసినట్లు, మేమందరమూ ఎవరి ఇళ్లల్లో వాళ్లు, ఎవరి ఇరుకు బతుకుల్లో వాళ్లున్నాం. మాకు బాధ, కోపం, సంతోషం అన్నీ వస్తుంటాయి. పంచుకోవడానికి ఎవరూ లేరు. అందుకే సోషల్ నెట్‌వర్కింగ్ పేజీల్లో ప్రతి చిన్నా పెద్దా ముచ్చట్లు షేరింగులు, లైకింగులు, కామెంట్స్... ఇలా బయటి ప్రపంచంలో వినైల్స్, ఫ్లెక్సీలు, హోర్డింగులు...
 మనిషి తన ఒంటరి జీవితంలో నుంచి బయటి ప్రపంచానికి ఓ వంతెన ఎప్పటికప్పుడు వేద్దామని చూస్తున్నాడు. కాని ఎప్పటికైనా అవతలి వైపుకి చేరుకుంటాడో- లేదో?
 
 సత్యనారాయణ దగ్గరి బంధువులు. మాలాంటి వ్యాపార సంబంధీకులు తప్పితే, అక్కడ ఎవరూ లేరు.
 ఎవరి కళ్లల్లో పెద్దగా నీళ్లు కూడా లేవు. కొంతమంది అయితే భోజనాల్లో తగ్గిన ఉప్పు కారాల గురించి మాట్లాడుతున్నారు.
 
 
 

మరిన్ని వార్తలు