రాష్ట్రంలో పెప్సీ భారీ యూనిట్

22 Dec, 2013 02:09 IST|Sakshi
రాష్ట్రంలో పెప్సీ భారీ యూనిట్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద బాట్లింగ్ యూనిట్‌ను మన రాష్ట్రంలో పెప్సికో ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లోని 80 ఎకరాల్లో రూ. 1,200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌కు శనివారం ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో లాంఛనంగా భూమి పూజ చేశారు. భారత్‌లో 2020 నాటికి రూ. 33,000 కోట్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంలో భాగంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, పెప్సీకి ఉన్న 38 ప్లాంట్లలో ఇదే పెద్దదని పెప్సికో ఇండియా చైర్మన్ అండ్ సీఈవో శివ్ శివకుమార్ చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం 3.6 లక్షల లీటర్లు. మొదటి దశలో రూ. 450 కోట్ల పెట్టుబడి అంచనాతో 1.2 లక్షల లీటర్ల ఉత్పత్తిని 2014 చివరికల్లా అందుబాటులోకి తెస్తామని, రెండో దశ 2015కి, మూడో దశ 2017కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శివకుమార్ తెలియజేశారు.
 
 ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి లభిస్తుందని, ఈ యూనిట్‌కు అవసరమైన నీటిని తెలుగుగంగ నుంచి తీసుకోనున్నామని తెలిపారు. దేశంలో అతి ఎక్కువ మామిడి గుజ్జు (పల్ప్) ఉత్పత్తి అయ్యేది ఆంధ్రప్రదేశ్‌లోనేనని, ఇక్కడ తమ వాటాను పెంచుకోవాలనుకుంటున్నామని, మూడు దశలూ పూర్తయితే సుమారు 50,000 నుంచి 60,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. పెప్సికోకి ఇప్పటికే సంగారెడ్డిలో ఒక యూనిట్ ఉంది.
 
 కరెంటు కోతలుండవు...
 ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి... రాజకీయ ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం వెనుకబడలేదని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతేడాది విద్యుత్ కోత ఉన్నప్పటికీ ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదని, వచ్చే వేసవిలో కూడా కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఇప్పటికే రూ. 40,000 కోట్లతో 7,000 మెగావాట్ల విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసినప్పటికీ గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. ఒక్కసారి గ్యాస్ సరఫరా జరిగితే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. పెప్సీ దేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ. 33,000 కోట్లలో అత్యధిక భాగం రాష్ట్రానికి కేటాయించాలని, ఇందుకు కావల్సిన మౌలిక వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి  హామీ ఇచ్చారు.
 

>
మరిన్ని వార్తలు