కైలాస గమనం

12 Apr, 2020 10:07 IST|Sakshi

శంకర విజయం 40

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర 

సృష్టి కుండలినిలోని కనకధారలా స్వర్ణముఖీ నది ఉత్తరాభిముఖంగా పరుగులు తీస్తోంది. బుసబుసమని పొంగుతున్న ఆ నదిలో నుంచి జాలువారుతున్న భ్రామరీనాదం ఆదిశంకరుని స్నానానికి అనువుగా మారింది. ఆనాడు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి.
సృష్టికి విరామాన్ని ప్రకటిస్తూ లయయోగాన్ని వివరించి చెప్పేందుకే ఏర్పడిన దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి. సకల జీవులకూ శివసాయుజ్యాన్ని దర్శించిన వెంటనే అనుగ్రహించే ఆ దివ్యధామం. వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకునే సమయానికి యతిబృందం ఉత్తరద్వారం నుంచి మొదటి ప్రాకారంలో ప్రవేశించింది. 
ఎదురుగా పాతాళ వినాయకుడు. మూలాధారంలో మూడున్నర చుట్లు చుట్టుకుని కుండలినీ సర్పం నిద్రపోతూ ఉంటుందని సంప్రదాయం. దానిని అనుసరించే పాతాళ వినాయకుని వద్దకు దిగే మెట్లు అన్ని వంపులతోనూ ఉంటాయి. అక్కడి నుంచి పైకి వచ్చి ఊర్ధ్వదిశగా ప్రయాణిస్తున్నట్లుగా ఆలయ ప్రవేశం చేస్తారు సాధకులు.
సత్యమహాభాస్కర క్షేత్రంగా పురాణాలు వర్ణించిన శ్రీకాళహస్తి క్షేత్రంలో పాతాళ వినాయకుని తరువాత స్వాధిష్ఠాన చక్రస్థానంలో నందీశ్వరుడు మహావతారుడై కొలువుదీరి ఉన్నాడు. మరికొంచెం ముందుకు వెళితే బిల్వవృక్షపు నీడలో అష్టోత్తరశత లింగేశ్వరుడు మణిపూరాన్ని ప్రతిష్ఠించి ఉంటాడు.

ముందుకు సాగితే ధ్వజస్తంభం. అటువైపుగా నడుస్తూ శంకరుడో కథ చెప్పాడు. ‘‘సృష్టి నాతోనే మొదలైంది కనుక నేనే మొదటివాడిని అని ఒకసారి బ్రహ్మ వాదించాడట. నారాయణుడు అతడిని వెంటబెట్టుకుని వెళ్లి కొందరు చిరంజీవులను చూపించాడు. ఒకానొక మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఆయన పక్కన రోమాలు గుట్టలు గుట్టలుగా పడివుండడం కనిపించింది. ఏమిటవి అని అడిగితే, ‘ఇప్పటికి అంతమంది సృష్టికర్తలు గతించారు. నీవు కొత్తగా వచ్చిన వాడివి’ అని మహర్షి బ్రహ్మకు సమాధానమిచ్చాడు. ఆ రోమశ మహర్షి మహాకల్పాలకు ముందు ఇక్కడ జ్ఞానప్రసూనాంబను ప్రత్యక్షం చేసుకున్నాడట. అదిగో అదే ఆనాడు ఆయన తపస్సు చేసిన చోటు’’ అన్నాడు. 

అనాహత నాదానికి ప్రతీకయైన స్థానంలో దక్షిణామూర్తి దర్శనమిచ్చాడు. ఆయన సన్నిధి నుంచి ఎడమకు మళ్లితే మళ్లీ గణపతి సన్నిధి. విశుద్ధిని పాడుతున్న మూర్తి అది. మృగశరీరం, మానవముఖంతో ఇడపింగళ నాడులకు సంకేతమైన పురుషామృగమనే రాతిబండ ఆయన అధీనంలో ఉన్నది. పక్కనే బావిలోని పాతాళగంగ యతిపురుషుల శిరస్సులను తడిపి, కమండలాలలోకి జారింది. సుషుమ్న నాడితో ఇడపింగళలు సంయోగం చెందే ఆజ్ఞాచక్ర స్థానంలో చెంగల్వరాయనిగా కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చించి వారంతా ముందుకు కదిలారు. అక్కడినుంచి నేరుగా సహస్రారమందు నెలకొనివున్న శివదర్శనానికి శంకర శిష్యులందరూ సాగిపోయారు. గొంతెత్తి పెద్దగా శివుణ్ణి కీర్తిస్తూ ఒక్కొక్కరూ లోనికి వెళుతున్నారు. 
 

సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 
భవే భవే నాతిభవే భవస్వ మాం భవోద్భవాయ నమః

...అనే శివనమస్కారం తరువాత ఆలయంలో ఎటువంటి సడీ లేదు. ఎవరి గొంతూ వినిపించడం లేదు. లోనికి వెళ్లిన శిష్యులంతా ఏమైపోయి వుంటారనే శంకలు పెట్టుకోకుండా శంకరుడు ముందడుగు వేస్తున్నాడు. ఆయన వేస్తున్న ఒక్కొక్క అడుగుకూ కొంతచొప్పున మొత్తంగా దక్షిణకైలాస దృశ్యం నిజకైలాసంగా మారిపోతోంది. ప్రాకారం ముత్యాలతో, మణులతో ప్రకాశిస్తోంది. ఎనిమిది దిక్కులలోనూ దిక్పాలక భవనాలు దర్శనమిస్తున్నాయి. సూర్యుడు స్వయంగా దారి దివిటీ పట్టుకున్నాడు. మునివాకిట కాలభైరవుడు స్వామికి స్వాగతమంటూ వినయం ప్రదర్శించాడు. ఈ శిఖరమందు శివద్వంద్వపు లాస్యం కొనసాగుతోంది అని నటరాజు, శివకామసుందరి సాక్ష్యమిచ్చారు. 

కేళీ సమూహమనే కైలానికి ఆశ్రయమిచ్చే కైలాసంలో వీధిగడపలో అయ్యవారుంటే, పెరటి గడపలో అమ్మ నెలకొంది. అయ్య పశ్చిమాభిముఖుడై సద్యోజాతమూర్తిగా దర్శనమిస్తుంటే, అమ్మ తూర్పువైపున ఉంటుంది. ఒకరు కుడి, ఒకరు ఎడమ అనే భేదం లేకుండా ఒకరికి కుడిదిక్కున మరొకరు ఉండడమే శివశక్తులు సమస్కంధమందు నెలకొనడం. అందుకే దక్షిణ కైలాసమై శ్రీకాళహస్తి జగత్తుకు విశ్రాంతి స్థానమైంది. ఇక్కడ సృష్టి లేదు. దేశ కాలాతీతమైన శుద్ధచైతన్యమే తప్ప ప్రళయం రాదు. ఈ భద్రతాస్థానం శివుని జీవునిగా, జీవుని శివునిగా చేస్తుంది. 
కొందరు ముందు అయ్య వద్దకే వెళతారు. చనువున్నవారు ముందస్తుగా అమ్మనే పలకరిస్తారు. జ్ఞాన ప్రసూనాంబ గడపకు పైన ద్వాదశ రాశులతో కూడిన భచక్రంలోని గ్రహాలు మాలికాయోగాన్ని సూచిస్తోంది. లగ్నబలం శ్రీనాథయోగాన్ని తనకు తానుగా నిర్ణయించుకుంది.

స్నానవేళ మొగిలేరులో వినిపించిన పాముబుస పెరిగింది. అది గజాననుని కపోలం నుంచి జాలువారుతున్న మదజల ధారలపై మోజుకొద్దీ వచ్చిన తుమ్మెదల ఝంకారంతో కలగలిసిపోతోంది. కుమారస్వామి వాహనమైన నెమలి క్రేంకారాలు వినవస్తున్నాయి. మెడలోని గంటలు మోగుతుండగా శిఖరాన్ని మించిపోయేలా మూపురాన్ని పొంగిస్తూ వృషభేశ్వరుడు రంకెలు వేస్తున్నాడు.  
శంకరుడు లోనికి అడుగుపెడుతుండగా ప్రసూనాంబ ధరించిన వడ్డాణంలోని పాము తన పడగ ఊపుతూ స్వాగతించింది.  చూపరులకు మరకత శిలారూపమై కానవచ్చే తల్లి పాదాలచెంత అప్పటికప్పుడో అర్థమేరువు బయల్పడింది. శంకరుని అర్చన సాగుతుండగా సర్వబీజాక్షరాల చివర ఉండే బిందునాదం నుంచి పుడుతున్న అవ్యక్త స్పందన కాంతిపరివేషాన్ని ధరించి శ్రీచక్రమందు లీనమవుతోంది. 
శివశక్తులు రెండూ తమను తామే కుండలీకరించు కుంటున్న ఆ స్థానంలో... పశ్చిమాన స్వామి సృష్టిని ఉద్ధరించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. కాగా జగత్తుకు జ్ఞానాన్ని సకలైశ్వర్య ఫలాలుగా, పుష్పాలుగా అందించడానికి తల్లి సమకడుతోంది. తెలివిని పువ్వుగా వికసింపచేసే తల్లికి జ్ఞానప్రసూనాంబ అని పేరు. ఆమెను....
వేణీసౌభాగ్య విస్మాపిత తపనసుతా చారువేణీ విలాసాన్‌
వాణీ నిర్ధూత వాణీకరతల విధృతోదార వీణావిరావాన్‌
ఏణీనేత్రాంత భంగీ నిరసన నిపుణాపాంగ కోణానుపాసే
కోణాన్‌ ప్రాణానుదూఢ ప్రతినవసుషమా కందలానిందుమౌలేః

యమునా నదీప్రవాహ సౌందర్యాన్ని విస్మరింప చేసే కేశసౌభాగ్యంతో, వాణిచేతిలోని కచ్ఛపీ వీణా నాదాన్ని తిరస్కరించే వాక్కులతో, ఆడులేడి కంటితుదల అందాన్ని నిరసించే కడగంటి చూపులతో, నిత్య అయిన కాంతికందలములతో ఒప్పే పరమశివుని ప్రాణమా ఉమా! నిన్ను నేను ఉపాసిస్తున్నాను అన్నాడు శంకరుడు.
ఆయన అర్చన అందుకున్న తల్లి, ‘‘వచ్చావా నాయనా! తనివి తీరిందా?’’ అని పలకరించింది.

‘‘ఏదీ ఇంకా అసలు ప్రకాశాన్ని చూడలేదమ్మా! నువ్వు తోడుంటే కానీ ఆయనను పూర్తిగా చూడలేననే అపనమ్మకంతో ముందుగా ఇటు వచ్చాను’’ అన్నాడు శంకరుడు.
చిరునవ్వు నవ్వి, ‘‘పద అయితే’’ అంటూ చేయిపట్టుకుని పుట్టింటి వైపు బంధువును భర్త ముందుకు తీసుకువెళ్లే ఇల్లాలి వలె శంకరుని నడిపించుకుంటూ వెళ్లింది అమ్మ.
అక్కడ తాను చూసిన శివస్వరూపంలోని ప్రత్యణువునూ శంకరుడు వివిధ రీతులుగా వర్ణించసాగాడు. అదే శివకేశాది పాదాంత స్తోత్రమై శంకరసాహిత్యంలో ఇలా పరిమళించింది. ఆ గంగ ఒడ్డున బయలుదేరిన పొడవైన చెట్ల మానుల్లాంటి శివ జటాజూటం చేవదేరి మిగుల పండినట్లు ఎరుపు రంగుకు తిరిగి కనిపిస్తోంది. ఆపదలనే గోతుల్లో పడ్డవాళ్లను లాగేందుకు ఉపకరించే తాళ్లలా ఆయన జటలు కనిపిస్తున్నాయి. ఘోరపాపాలను కాల్చివేసే అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 

మోక్షమార్గంలో పైకి చేరుకునేవాడికి ఏర్పాటుచేసిన మెట్ల వరుసలా నుదుట విబూది రేఖలు మెరుస్తున్నాయి. ప్రణయకోప వేళ పార్వతీ పాదాలను తన శిరస్సుకు తాటించుకున్నాడేమో మహాదేవుడు... ఆమె కాలి బొటన వేలికి ఉన్న ఎర్రని లత్తుక కాస్తా ఆయన నుదుటన తెల్లని స్ఫటికంలో పొదిగిన కెంపులా మారి మూడోనేత్రంగా భాసిస్తోంది. కెరటాల తాకిడికి ఎగసిపడే చేపలా, నిప్పులు చిమ్ముతున్న శివుని ఫాలనేత్రం మా ఆపదలను కాల్చివేయుగాక! బంగారు పద్మాలై పచ్చగా మెరిసే శంభుని కన్నులు సాధకుని ఇంద్రియాలనే అశ్వాలను పట్టి ఉంచే పగ్గాలు. సూర్య చంద్రబింబాలే ఆయన కన్నులు. ఆ రెండుబింబాల కాంతి పరివేషమే కనుబొమ్మలయ్యాయి. మహాదేవుని పక్షాన  సృష్టి స్థితి లయాలు తామే నిర్వహిస్తున్నామని కొద్దిగా గర్వం వహించి కాబోలు కనుబొమ్మలు సవిలాసంగా చలిస్తూ జీవులకు మహదైశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాయి. 

భక్తుల అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేలా సూర్యమండల సమానతేజంతో వెలుగుతున్న శివుని కుండలాలు జీవులకు అఖండ ఐశ్వర్యాన్ని అనుగ్రహించు గాక! శుక్లపక్ష దశమినాటి చంద్రునివలె అతినిర్మలమైన శివుని చెక్కిళ్లను చూసి పార్వతి మాటిమాటికీ అలుగుతూ ఉంటుంది. ఆ అద్దాల చెక్కిళ్లలో తన రూపాన్నే చూస్తూ వేరెవరో భామిని అనుకుంటున్నది. ఆ గంగాభర్త చక్కని చెక్కిళ్లు మమ్మల్ని ఎల్లప్పుడూ పాలించును గాక!

పడగవిప్పి బుసలు కొడుతున్న తెల్లని సర్పరాజంలా, పద్మమధ్యంలోని కర్ణికలా మనోహరమైన ఖట్వాంగాయుధుని నాసిక మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించును గాక!
క్షీరసాగర మథనవేళ తనకు తోడబుట్టిన హాలాహలాన్ని పలకరించి పోవడానికి కౌస్తుభ మణి వచ్చినట్లున్నది. శివుని ఎర్రని పెదవిలా మారువేషం కట్టింది. దాని ఎర్రదనం చేత లోకాలు సైతం ఎర్రనవుతున్నాయి. ఆ పెదవి జీవులకు సమస్త సంపదలనూ అనుగ్రహించు గాక!

శివుని ముఖమండలం నుంచి వాక్కులనే అమృతం వెలువడుతున్నప్పుడు కలిగిన మహాప్రవాహ వేగంలో తేలుతున్న నురుగు బుగ్గల్లా పలువరుస కనిపిస్తోంది. తొలికారు మేఘాలు కొండలను తాకినప్పుడు పుట్టే ఉరుము చప్పుడులా కంఠధ్వని ఉంది. పొంగుతున్న సముద్రపు హోరును అణచివేస్తూ అత్యంత గంభీరమై నోటియందు ఆయా ధ్వనులు పుట్టే స్థానాల యోగ్యస్థితిని తెలుపుతోంది. ఆ నాదబ్రహ్మము వాత్సల్యంతో మాకు సమస్త సత్ఫలములనూ ఒసగు గాక! అష్టమూర్తి శివుని దివ్యాట్టహాసంతో మూడులోకాల్లో తెల్లని కాంతి వ్యాపించింది. మనోహరము, భయంకరము కూడా అయిన ఆ అట్టహాసం మాకు ఎల్లప్పుడూ ఇష్టము, స్పష్టమైన తుష్టిని కలిగించుగాక! శివునికి ముఖములు అయిదు. పడమటి ముఖానికి సద్యోజాతమని పేరు. ఉదకవర్ణంలో ఉంటుంది. వామదేవమనే ఉత్తర ముఖం బంగారు రంగులో ఉంటుంది. అఘోరమనే దక్షిణ ముఖం మేఘవర్ణంలో ఉంటుంది. తత్పురుషమనే తూర్పు మొగం బాలసూర్యునిలా ప్రకాశిస్తుంది. ఇక ఊర్ధ్వదిక్కున ఉండే ఈశానము దివ్యము. ఆ అయిదు ముఖాలూ మా అభీష్టాలనూ తీర్చుగాక!

శివుని కంఠంపై మూడు రేఖలుంటాయి. నల్లని కాటుక వంటి విషాన్ని కంఠంలో దాచుకున్నందు వల్ల ఆ రేఖలు ఏర్పడ్డాయేమో అనుకోవచ్చు. కానీ కేవలం అదొక్కటే కారణం కాకపోవచ్చు. బహుశా ఒకప్పుడెప్పుడో పార్వతి స్వయంగా వశ్యకారి అనే నల్లని మసిని పూసినందువల్ల ఆ కంఠరేఖలు ఏర్పడి ఉంటాయి. ఆమె ఎందుకలా చేసిందంటే.... శివుని ముఖమనే చంద్రుడు, దంతకాంతి అనే లక్ష్మి, పెదవి అనే కౌస్తుభం ఈ మూడూ కూడా నీలకంఠుని కంఠంలోని కాలకూటంతో కలిసి పుట్టాయి. తన తోబుట్టువును కలుసుకోవాలని కాలకూటం కోరుకుంటుంటే పార్వతీ మాత అడ్డుకుంటోంది. ఆమె చేతి స్పర్శ వల్ల విరుద్ధార్థాన్ని ఇచ్చే విషము, అమృతము అనే పదాలు సమానార్థకాలు కూడా అయ్యాయి. ఆ అమృత హృదయుని శంఖసదృశ కంఠం మా హృదయాలలో ఎల్లప్పుడూ ప్రకాశించు గాక! పార్వతీమాత బిగి కౌగిళ్ల వల్ల ఆమె బంగారు గాజునొక్కులు శివుని బాహుమూలాల్లో ఏర్పడ్డాయి. పడగలు విప్పిన పాములతో అలంకరించబడిన ధూర్జటి బాహుమూలము విధివిహితము కాని మా కర్మలను నశింప చేయుగాక! సంసార సముద్రాన్ని దాటేందుకు స్ఫటికాలతో చేసిన పొడవైన దొన్నెల వంటివి శివుని బాహువులు. మూడులోకాలు అనే ఇంటి తలుపుకు అడ్డంగా వేసిన పొడవైన గడియలవి. ఆ బాహువులను స్మరించినంతనే మా పాపసమూహాలు నశించి పోవు గాక!

శివుని వక్షస్థలంపైని విభూతి రేఖలకు పార్వతి మేనిపై అద్దుకున్న మంచి గంధపు తావి ఉంటుంది. శివుని ఉదరమనే పాలసముద్రం ముత్యాలతో అలంకృతమై ఉంది. దానిపైని ముడతలు తరంగాలుగా కానవస్తున్నాయి. ఎడమ వైపుకు తిరిగివున్న బొడ్డు అనే సుడి ఆ సముద్రంలో ఏర్పడింది. కాంతిలక్ష్మికి నివాసమై చంద్రుని వలె శ్వేతశోభతో నిండివున్న శివుని ఉదరమనే క్షీరసముద్రంలో మా  మనస్సనే గంగానది చిరకాలం శయనించు గాక! 

శివుని మొలకు కట్టివున్న పులిచర్మం దట్టమైన మంచుతో కూడిన మేఘమాలలా ఉన్నది. ఆపైన సర్పరాజాలతో పేటలుగా అల్లిన మొలత్రాడు చక్కగా బిగింపబడి ఉంది. ఆ బాలచంద్రమౌళి నితంబము మాకు శుభాలనిచ్చుగాక!

త్రిపురాసుర సంహారకుడైన మహాదేవుని తొడలు ఆయన జఘనానికే కాకుండా మూడులోకాలకూ కూడా ఆధార స్తంభాలుగా నిలిచాయి. ఇంద్రుని ఐరావత తొండంలా గొప్ప శోభతో ఉన్నాయి. విభూతితో తెల్లగా ప్రకాశించే ఆ తొడలు శత్రుగజ సముహాలను వేగంగా మ్రింగివేస్తాయి. సారవంతములైన మహాదేవుని ఊరువులు మాకు వాంఛితాలను ఒసగు గాక!
మునుల మనస్సులనే అద్దాలను ఉంచుకునేందుకు తగిన పీఠాలు మహాదేవుని మోకాళ్లు. అవి చంద్రకాంత మణుల్లా శోభిస్తున్నాయి. తాండవవేళ కాళ్లను పైకి ముడిచినప్పుడు నడుముకు చుట్టుకున్న పాముల పడగలు ఆయన మోకాళ్లకు తలదిళ్లుగా మారిపోతున్నాయి. శూలపాణి పిక్కలు స్ఫటిక మణికాంతులతో చేసిన దండము వలె ఉన్నవి. పాదాలకు అందెలుగా ఉన్న సర్పాలు పడగ విప్పినప్పుడు, ఇంకా మోకాలిపై నిలిచిన సర్పాలు క్రిందికి జారినప్పుడు....  చిగిర్చిన మొక్కల్లా, మెరుస్తున్న రత్నాల్లా కనిపిస్తున్న ఆ కాలిపిక్కలు మా మనసుల్లో ఎల్లప్పుడూ నిలుచును గాక!... శివకేశాది పాదపర్యంతమైన శంకరస్తోత్రం ఇంకా మిగిలే ఉంది. 
 – సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ 

మరిన్ని వార్తలు