కరకు చూపుల... కాదల్‌ దండపాణి

2 Jul, 2017 02:14 IST|Sakshi
కరకు చూపుల... కాదల్‌ దండపాణి

రాజేంద్రకు మూడు విషయాలు అంటే  మాచెడ్డ ఇష్టం. 1.జాతి 2.అంతస్తు 3. గౌరవం...ఈ మూడింటికి ఏ మాత్రం తేడా వచ్చినా,  భయపెట్టించేట్టు కనిపించే రాజేంద్ర మరింత భయానకంగా కనిపించగలడు. ఎంత దుర్మార్గానికైనా తెగించగలడు.
జాతి, అంతస్తు, గౌరవం... వీటికి  ఎవరైనా దూరంగా జరిగి పెళ్లి చేసుకుంటే... వరుడిని మర్యాదగా కిడ్నాప్‌ చేసుకొచ్చి..

‘‘ఆ పిల్ల తండ్రికి నువ్వు నచ్చలా. నీకు ఆ పిల్లకు ఏ సంబంధం లేదని రాసివ్వు’’ అని చాలా అమర్యాదగా  బెదిరించగలడు.
బయటి వాళ్ల సంగతి సరే...

సొంత కూతురే ప్రేమించి పెళ్లి చేసుకుంటే?అమ్మో! ఇంకేమైనా ఉందా!!
‘‘తెంచేయ్‌. ఆ తాళిని నీ మెడలో నుంచి తెంచేయ్‌.  తాళిని నీ మెడలో నుంచి తీస్తావా? చేయి విరిచేయనా?’’ అంటూ  కన్న కూతురు ముందు రంకెలు వేయగలడు.

 ఇక ‘లంక రాజు’ తక్కువోడా ఏమిటి?ఏడుస్తున్న కూతురిని చూస్తూ తన చుట్టూ ఉన్న గూండాలతో ఏమంటున్నాడో  చూడండి...‘‘అక్క ఏడుస్తుంది. ఈ విషయం జనాలకు తెలిస్తే ఏమవుతుందిరా?’’‘‘పరువు పోతుందన్నా’’ అంటారు గూండాలు. అప్పుడు ‘లంక రాజు’  ఎంత క్రూరంగా మాట్లాడతాడంటే...
‘‘నేను, నా పరువు ప్రతిష్ఠ బెజవాడలో ఉండాలంటే దీన్నైనా చంపాలి. వాడినైనా చంపాలి’’
‘ప్రేమిస్తే’ సినిమాలో రాజేంద్ర కావచ్చు, ‘కృష్ణ’ సినిమాలో ‘లంక రాజు’ కావచ్చు... డైలాగుల కంటే పర్సనాలిటీ, హావభావాలతోనే తెగ భయపెట్టించాడు కాదల్‌ దండపాణి.సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు దిండిగల్‌ (తమిళనాడు) నగరంలో దండపాణి రకరకాల వ్యాపారాలు చేసేవాడు. తన వ్యాపారమేదో తాను చేసుకుంటున్న దండపాణి డైరెక్టర్‌ బాలాజీ శక్తివేల్‌ దృష్టిలో పడ్డాడు.

 శక్తివేల్‌ స్నేహితుల్లో ఒకరు దండపాణి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో చూపించాడు. ఇది సినిమాల్లో అవకాశం కోసం దిగిన ఫొటో కాదు. ఏదో పని కోసం దిగింది. ఫొటో చూసీ చూడగానే ‘నా సినిమాలో ఇతనే హీరోయిన్‌ తండ్రి’ అనే నిర్ణయానికి వచ్చాడు శక్తివేల్‌. ‘‘నువ్వు పెద్దగా నటించనక్కర్లేదు. నీ సహజశైలిలో డైలాగులు చెప్పు చాలు’’ అని చెప్పాడు శక్తివేల్‌. అలా  ‘కాదల్‌’ (తెలుగులో ప్రేమిస్తే) సినిమాలో హీరోయిన్‌ తండ్రి వేషం ఇచ్చాడు. ఈ పాత్ర దండపాణిని ‘కాదల్‌ దండపాణి’ని చేసింది. తమిళ్‌తో పాటు తెలుగు,

 కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించేలా చేసింది. వృత్తిరీత్యా దండపాణి వ్యాపారి. ప్రవృత్తిరీత్యా నటుడు. అయితే తాను ప్రేమించిన నటనే అతడిని నాలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితుడిని చేసింది.‘ప్రేమిస్తే’ ‘రాజుభాయ్‌’ ‘ముని’ ‘కృష్ణ’ ‘ఆంజనేయులు’ ‘రేసుగుర్రం’...సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కాదల్‌ దండపాణి 2014లో  ఈలోకాన్ని వీడి వెళ్లారు. కరకు చూపులతో, కఠినమైన గొంతుతో తనదైన విలనిజాన్ని వెండితెరపై ప్రదర్శించాడు కాదల్‌ దండపాణి.

మరిన్ని వార్తలు