క్యాన్సర్ ని వండకండి

28 Jan, 2017 23:36 IST|Sakshi
క్యాన్సర్ ని వండకండి

ఫిబ్రవరి 4 వరల్డ్‌ క్యాన్సర్‌ డే

గ్యాస్‌ స్టౌ మీదున్న బాండీలో క్యాన్సర్‌ డీప్‌ ఫ్రై అవుతోందంటే
ఎవరైనా దాన్నలాగే వండుకుంటారా?
రుచిగా ఉందని చెప్పి వేడి వేడిగా
దాన్ని ప్లేట్‌లోకి ఒంచుకుంటారా?
నోరూరుతోందంటూ లొట్టలేసుకుంటూ
మరోమారు మారు వడ్డించుకోగలరా?
మీకు తెలిసో తెలియకో కొన్ని సార్లు
క్యాన్సర్‌ మీ స్టౌ మీద ఉడుకుతుంటుంది.
కొన్నిసార్లు మీకు తెలియక మీ ఫ్రిజ్‌లోనూ నక్కి ఉంటుంది.
అప్పుడప్పుడూ మీరు బయట తినే పదార్థాల్లో దాగి ఉంటుంది.
పంటికింది రాయిలాగో...
కూరలోని నిమ్మగింజలాగో తెలియక వచ్చినప్పుడు
ముద్దను ఊసేసినట్లుగానే దాన్ని ఊసేయండి.
తెలిసి తీసుకునే పదార్థాల్లో దాని ఊసే లేకుండా చేసుకోండి.
అదెలాగో తెలుసుకోండి. తెలుసుకొని జాగ్రత్త పడండి.


క్యాన్సర్‌ నిర్దిష్టంగా ఫలానా కారణంగానే వస్తుందని తెలియకపోయినా కొన్నిసార్లు మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాల ద్వారా వస్తుందని కచ్చితంగా తెలుసు. అదెలాగంటారా? ఒకసారి వాడిన నూనెను మళ్లీ మరోసారి వేడి చేయడం అంటే... పొయ్యి మీద ‘క్యాన్సర్‌ వేపుడు’ను వేడివేడిగా వండుతున్నట్టే! ప్రాసెస్‌ చేసే వంటకాలు... అందునా రెడ్‌మీట్‌ (వేటమాంసం)తో వండేవి తయారు చేస్తున్నారంటే మీరు కూర తాలింపు గాక క్యాన్సర్‌ కోసం తిరగమోత పెడుతున్నట్టే. కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని వండుతుంటే... ఉప్పు, కారం, మసాలాలు కలిపినట్టుగానే... ఆ కూరను క్యాన్సర్‌పొడులతో గార్నిష్‌ చేస్తున్నట్టే. తెలిసో, తెలియకో మీరు క్యాన్సర్‌ను వండకండి... వడ్డించకండి... తినకండి. ఈ మూడు చేయకూడదనుకుంటే కొన్ని ఆహారాల విషయంలో అవగాహన పెంచుకోండి.

బాగా ప్రాసెస్‌ చేసిన రెడ్‌మీట్‌ను మితిమీరి తింటున్నారంటే కోరి కోరి పెద్ద పేగుకు క్యాన్సర్‌ను అంటించుకుంటున్నారన్నమాట. ముడిసరుకును ఎంతగా ప్రాసెస్‌ చేస్తుంటే ఆ ఆహారానికి క్యాన్సర్‌ను అంతగా పట్టేలా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారి కంటే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్‌తో క్యాన్సర్‌ వచ్చే అవకాశం 17% చొప్పున పెరుగుతుంటుంది. అలా తినడం ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, పొట్ట క్యాన్సర్లను పెంచవచ్చు. మీకు మాంసమే తినాలని ఉందా...? మాంసాహారం మీద జిహ్వను చంపుకోలేకపోతున్నారా? అయితే చికెన్‌ లేదా చేపలు తినండి. వాటితో క్యాన్సర్‌ వచ్చిన దాఖలాలున్నట్లు పరిశోధనల్లో పెద్దగా తేలలేదు. కాబట్టి మీ జిహ్వచాపల్యాన్ని కాస్తంత ఆరోగ్యకరమైన పక్కదారి పట్టించండి. అదే రుచి దారిలో  మీ ప్రయాణం సాగుతుంది. కాకపోతే కాస్తంత మరో సమాంతర మార్గంలో. మాంసాహారం తినాలనే కోరికా తీరుతుంది. ఆ మార్గంలో పొంచిఉన్న క్యాన్సర్‌ యాక్సిడెంట్‌ ప్రమాదమూ తప్పుతుంది. నో.... నో... బతికి ఉన్నన్నాళ్లూ ఇష్టమైన మాంసాహారం తిందాం. ఎప్పుడో చచ్చిపోతామనే భయంతో ఇప్పుడు మాంసాహారం తినకపోవడం మహాపాపం కదా... అని గునుస్తూ ఉండే ఆహారప్రియులైన  ఎపిక్యూరియన్లకు మరో షార్ట్‌కట్‌ దారి కూడా ఉంది. రెడ్‌మీట్‌ వంటకాలను ఎంత తక్కువ వీలయితే అంత తక్కువకు పరిమితం  చేసుకోండి. పూర్తిగా కాకపోయినా... గుడ్డిలో మెల్ల అన్నట్లుగా... కొంతలో కొంత నయం.

ఏం వండామన్నది కాదు...
ఎలా వండామన్నదీ ముఖ్యం...

ఏదైనా పదార్థాన్ని వండుతున్నామంటే దాన్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద ఉడికేలా చేస్తున్నామన్నదీ క్యాన్సర్‌ నివారణలో ఒక కీలకమైన అంశం. మీరు ఒక వంటకాన్ని (రెసిపీని) మరింత ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండుతున్నారంటే... అందులోంచి క్యాన్సర్‌ కారకమైన రసాయనాలు వెలువడేలా చేస్తున్నారేమో అన్నది గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. మనం మాంసాన్ని మితిమీరిన ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నామంటే... అనగా గ్రిల్డ్‌ పదార్థంగానూ వేపుడుగానూ చేస్తున్నామంటే, ఆ మాంసాహారంలోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్‌ అరోమాటిక్‌ అమైన్స్‌ (హెచ్‌ఏఏ) అనే రసాయన రూపాలుగా మారుతున్నాయని అర్థం. అవి క్యాన్సర్‌ కారకాలు. ఇక ఆ ఆహార పదార్థాలను స్మోకింగ్‌ అనే వంటప్రక్రియకు గురిచేయడం గానీ, నేరుగా అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న మంట తగిలేలా చేశారనుకోండి... అప్పుడా తీరు వంట వల్ల పాలీ సైక్లిక్‌ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌ అనే (పీఏహెచ్‌స్‌)  రసాయనాలు ఏర్పడతాయి. అవి కూడా ప్రమాదకారకాలే.

క్యాన్సర్‌ను ఎందుకు నిల్వ పెట్టుకోవడం?
తినే పదార్థాలు పాడైపోతే మనసు ఉసూరుమంటుంది. ఉసూరంటుంది కదా అని ఉసురుతీసుకుంటామా? అందుకే ఆహార పదార్థాలను నిల్వ పెట్టుకోవడం అంటే క్యాన్సర్‌ను నిల్వ పెట్టుకోకుండా ఆ పని చేయాలన్నమాట. అది సరైన నిల్వ...  సబబైన నిల్వ. చాలామంది ఆహారపదార్థాలను పాడైపోకుండా ఉంచడానికి ‘ఉప్పు’లో చాలాకాలం ఊరబెడుతుంటారు. ఇలా చాలా కాలం ఉప్పులో ఊరిన పదార్థాల వల్ల పొట్ట లోపలి పొరలు (లైనింగ్‌) దెబ్బతిని అది ఇన్‌ఫ్లమేషన్‌కు (వాపు, నొప్పి, ఎర్రబారడం) గురయ్యే అవకాశం ఉంది. అలా పొట్ట లోపలి పొరలు (లైనింగ్‌) దీర్ఘకాలం ఒరుసుకుపోతూనే ఉండటం జరుగుతుంటే అక్కడ అలా ఒరుసుకుపోయిన లైనింగ్‌లలో నైట్రేట్ల వంటి క్యాన్సర్‌ కారక రసాయనాల పాలబడటానికి అవకాశం ఎక్కువ. ఇక అలాంటి చోట్ల హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే సూక్ష్మజీవి గనక నివసిస్తూ ఉంటే... మనం తినే ఉప్పు దాంతో కయ్యం పెట్టుకొని అక్కడ పుండ్లు పడేలా చేస్తుంది. వీటినే స్టమక్‌ అల్సర్స్‌ అంటారు. ఈ స్టమక్‌ అలర్స్‌ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే క్యాన్సర్‌ ముప్పునకు ఉప్పు కూడా ఓ పర్యాయపదం అని అర్థం చేసుకుని దానికి దూరంగా ఉండటం మంచిది. క్యాన్సర్‌ మాట అటుంచినా... పైగా ఉప్పు పరిమాణం పెరుగుతున్న కొద్దీ హైబీపీ కొలత కూడా పెరుగుతూ పోతుంది. అందుకే ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ 6 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదు.


పండు... క్యాన్సర్‌ పాలిట మందుగుండు
తాజాపండ్లు క్యాన్సర్‌కు నేరుగా గురిపెట్టిన మందుగుండు అని గుర్తించండి. కొన్ని పండ్లకు పైన ఉండే తొక్క క్యాన్సర్‌ను తొక్కిపెడుతుంది. పెకిలించివేస్తుంది. తొక్కతో తినగలిగే పండ్లను కాస్త కడిగి తొక్కతోనే తినడం మేలనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి.  ఒక ఆపిల్‌ను తొక్కతో తింటే... అందులో మొత్తం పండులో లభ్యమయ్యే దానికంటే... కేవలం ఆ తొక్కలోనే 75% క్వెర్సిటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడే ఒక జీవరసాయనం. జీవామృతరసాయనం. అంటే... మొత్తం పండుకంటే కేవలం పొరలా ఉండే తొక్కలో 75 శాతం ఎక్కువ సారం, విషాన్ని హరించే విషయం ఉందన్నమాట.

విటమిన్‌–సి, ఫోలేట్, నియాసిన్‌ వంటి విటమిన్లు నీళ్లలో కరుగుతాయి. అలా విటమిన్లు ఊరిన నీటితో వంట చేస్తున్నప్పుడు... ఆ నీటిని చాలాసేపు వేడిచేస్తుంటే... విటమిన్లు ఇగిరిపోతాయి. మనం ఆకుకూరలతో వంట చేసే సమయంలో ఎక్కువ సేపు వండుతూ ఉంటే మొక్కల నుంచి లభ్యమయ్యే పోషకాలు, ఫైటోకెమికల్స్‌ తరిగిపోతాయి. (మొక్కల నుంచి లభ్యమయ్యే పోషకాలు, జీవరసాయనాలను ఫైటోకెమికల్స్‌ అంటారు). ఇవి క్యాన్సర్లతో ఫైట్‌ చేస్తాయి. అందుకే వంట కార్యక్రమం అన్నది అవి  ఆవిరయ్యేలా ఉండకూడదు. అలాగే నీళ్లలో కరిగిఉండే వీటిని వార్చి పారబోయడం అంత మంచిది కాదు. కాబట్టి పోషకాలు కోల్పోకుండా... తగుమోతాదులో కూరలను ఉడికించాలి. ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే కూరగాయలను ఆలివ్‌ నూనెలో వండటం మేలు. దీనివల్ల నూనెలో కరిగే విటమిన్లు ఒంటికి సమర్థంగా అందుతాయి.

క్యాన్సర్ల పాలిటా ఘాటైనవి అవి...
ఉల్లి, వెల్లుల్లి ఘాటుగా ఉంటాయి. అవి మనకు మాత్రమే కాదు... క్యాన్సర్ల పాలిటా ఘాటుగా వ్యవహరిస్తాయి. వెల్లుల్లిని అలా నిండుగా వంటల్లో వేసేయడం కంటే కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా కొద్దిగా నలగ్గొట్టి వేస్తే... రుచికి రుచీ పెరుగుతుంది. క్యాన్సర్‌తో ఫైట్‌ చేసే పోషకం అయిన అలిసిన్‌ తయారయ్యేందుకు దోహదపడుతుంది. ఎర్రగా ఉండే టొమాటోలలో, ఎర్రటి రంగులో ఉండే ద్రాక్షల్లో... ఇలా ఎరుపు రంగులో ఉండే అనేక పండ్లలో లైకోపిన్‌ అనే క్యాన్సర్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్‌ పుష్కలంగా ఉంటుంది. నేరుగా టొమాటోను తినడం కంటే కాస్తంత ఉడికించాక దాన్ని తింటే... అలా ఉడికించడం ద్వారా వెలువడ్డ లైకోపిన్‌ను మన జీర్ణకణాలు చాలా తేలిగ్గా స్వీకరిస్తాయి. ఆరోగ్యకరంగా వండటానికీ, వడ్డించడానికి ఇది ఒక అద్భుత ఉదాహరణ. ఇలాంటి అనేక దృష్టాంతాలను గుర్తుంచుకొని క్యాన్సర్‌ను ఎలా వండుకోకూడదో తెలుసుకోవచ్చు. ఎలా వండితే క్యాన్సర్‌ను వడ్డించడం సాధ్యం కాదో కూడా గ్రహించవచ్చు. ఈ తెలుసుకోవడమూ, గ్రహింపూ ఎంత ఎక్కువగా ఉంటే... క్యాన్సర్‌ను కాల్చి బూడిద చేయడం అంత తేలిక!

ఆహారంలోని పీచుతో క్యాన్సర్‌ను కడిగేయవచ్చు...
పీచుతో గిన్నెల్లో మురికిని శుభ్రం చేయడమన్నది మన దేశవాసులకు తెలియని విద్య కాదు. ఎవరో వచ్చి దాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. ఆహారంలో పీచు ఉంటే అది పేగులలోపలి భాగాన్ని శుభ్రంగా చేసేస్తుంది. క్యాన్సర్‌ను అక్కడ కుదురుకోనివ్వకుండా చూస్తుంది. అయితే ఇటీవల మనం పీచు లేని పదార్థాలను ఎక్కువ తింటున్నాం. గతంలో అది పాశ్చాత్యుల అలవాటు. ఇప్పుడు మనం దాన్ని అలవాటు చేసుకున్నాం. అంటే... మనదైన పీచుతో శుభ్రం చేసే పేటెంటును మనం దూరం చేసుకొని క్యాన్సర్‌కు టెంటు వేస్తున్నామా అని ఆలోచించాలి. అందుకే క్యాన్సర్‌ పేగుల్లో నిలువ ఠికానా లేకుండా చేయాలంటే పీచు పుష్కలంగా ఉండేలా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, పొట్టు పుష్కలంగా ఉండే ముడిధాన్యాలు (హోల్‌ గ్రెయిన్స్‌) వాడాలి. దాంతో పెద్దపేగు క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చని పరిశోధనలు నమ్మకంగా చెబుతున్న మాట. ఒక్క పెద్ద పేగు క్యాన్సర్‌నే గాక... అనేక పెద్ద పెద్ద క్యాన్సర్లూ పీచుతో నివారితమవుతాయి. అందుకే వడ్డించే పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉందా లేదా అని చూసుకోవడం క్షేమదాయకం. ఈ పీచు పదార్థాలను తక్కువగా తినడంవల్లే అమెరికా, యూరప్‌ దేశాలను పెద్దపేగు క్యాన్సన్‌ పీల్చిపిప్పి చేస్తోంది. అందుకే  పీచు క్యాన్సర్‌ పీచమణుచుతుందని గుర్తుంచుకోవడం శుభప్రదం.
డాక్టర్‌ పి. విజయ్‌ ఆనంద్‌ రెడ్డి,
డైరెక్టర్, అపోలో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు