ఇదిగో  బామ్మ...  అదిగో వాన!

11 Nov, 2018 01:41 IST|Sakshi

బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. నేను మా అక్కయ్య దగ్గర ఉండి చదువుకునేవాడిని. మా ఓనర్‌ బామ్మగారు చాదస్తురాలు. మడి,మడి అంటూ ఆఖరికి పిడకలు, కట్టెలను కూడా తడిపేసి అవి ఆరిన తరువాతనే వంట చేసుకునేది.ఒకసారి ఎగ్జిబిషన్‌ పెట్టారు. బామ్మగారి మనవరాలు ‘‘అన్నయ్యా! ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్ళరా’’ అని అడిగింది. ఎగ్జిబిషన్‌కు మనవరాలితో పాటు బామ్మ కూడా వచ్చింది.అక్కడ రంగు రంగుల దీపాలను, రంగులరాట్నాలను చూసి ఎంతో సంబరపడిపోయారు బామ్మ.ఎవరైనా తాకుతారేమోనని దూరంగా నడుస్తున్న ఆమెను మెల్ల మెల్లగా జెయింట్‌వీల్‌ దగ్గరకు చేర్చాం.‘‘దీంట్లో తిరుగుతూ ఉంటే విమానంలో వెళుతున్నట్లే ఉంటుంది’’ అని చెప్పి జెయింట్‌వీల్‌ ఎక్కించాం.మొదట్లో ఎక్కడానికి తటపటాయించిన బామ్మ ఆ తరువాత ఎక్కింది.

జెయింట్‌వీల్‌ తిరగడం ప్రారంభమై వేగం పుంజుకుంది. ఇంతలో ఒక్కసారిగా...‘‘ఓరి త్రాష్టపు వెదవా! వాన కురుస్తోందిరా. ఆపి చావరా’’ అంటూ గావుకేక పెట్టారు బామ్మగారు.ఆ కేకకు జడుసుకొని అతి కష్టం మీద జెయింట్‌వీల్‌ను ఆపారు.‘‘వానా? ఎక్కడ బామ్మగారు?’’ అని నోరు తెరుస్తూ పైకి చూశాడు జాయింట్‌వీల్‌ తిప్పే వ్యక్తి.అసలు విషయం ఏమిటంటే బామ్మగారి సీటు పైన  సీట్లో కూర్చున్న పిల్లవాడు జాయింట్‌వీల్‌ వేగానికి భయపడి పాస్‌ పోశాడు. అవే వానతుంపరలు!అప్పటి నుంచి ఎగ్జిబిషన్‌ అనే మాట వినబడితే చాలు బామ్మ గుర్తుకు వస్తుంది. రాని వాన గుర్తొస్తుంది. తెగ నవ్వొస్తుంది!
– పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట, గుంటూరు జిల్లా 

మరిన్ని వార్తలు