వాన పట్టుకోండి

29 Jul, 2018 00:11 IST|Sakshi

కవర్‌ స్టోరీ

నగరాలు, పట్టణాల్లో నానాటికీ జనసాంద్రత పెరుగుతున్నది. జనసాంద్రత పెరుగుతున్న కొద్దీ నీటి కొరత సమస్య ఉధృతమవుతున్నది. వందలాది కిలోమీటర్ల దూరంలోని నదుల్లో నుంచి భారీ ఖర్చుతో నగరాలకు తాగు నీటిని తరలించాల్సి వస్తున్నది. అయినా, నగర ప్రజల నీటి అవసరాలు తీర్చడానికి భూమిలో నుంచి భారీగానే నీటిని తోడేస్తున్నాం. నగరంలో ప్రతి ఇంటి ఆవరణలో భూమిలోకి ఇంకే వర్షపు నీటి కన్నా.. బోర్ల ద్వారా భూమిలో నుంచి తోడే నీరు చాలా రెట్లు ఎక్కువగా ఉంటున్నది. నగరం కింది భూమిలో నీటి వనరులు నానాటికీ అట్టడుగుకు దిగిపోవడానికి ఇదే మూల కారణం.  గడ్డి భూమిలో కురిసే వానలో 95% భూమిలోకి ఇంకుతుంది. 5% మాత్రమే వృథా అవుతుంది. కాంక్రీటు పరచుకున్న నగరంలో కురిసే వర్షంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కురిసిన వానలో 5% భూమిలోకి ఇంకితే గొప్ప. 95% వాననీరు మురుగు కాలువల ద్వారా నగరం వెలుపలకు వృథాగా వెళ్లిపోతుంది. కాబట్టి, చినుకు పడిన చోటే భూమిలోపలికి ఇంకింపజేయడంలోనే నగరాల్లో నీటికొరత సమస్యకు పరిష్కారం దాగి ఉంది. మోస్తరు వర్షం కురిసినప్పుడు ఎక్కువ వాన నీరు భూమిలోకి ఇంకుతుంది. కుండపోత వర్షంలో చాలా తక్కువ శాతమే ఇంకుతుంది. పైగా భూమి కోతకు గురవుతుంది. 

వాన నీటి సంరక్షణ ప్రభుత్వం పని మాత్రమే కాదు హైదరాబాద్‌ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో అంత వేగంగా భూమిని కాంక్రీటు కప్పేస్తున్నది. జనసాంద్రత పెరుగుతున్నకొద్దీ ఇంటి స్థలం విలువ పెరుగుతున్నది. విలువ∙పెరుగుతున్నకొద్దీ బహుళ అంతస్థుల ఇళ్ల శాతం పెరుగుతూ వచ్చింది. ఇళ్ల ఆవరణలో గచ్చు చేయని చోటు కుంచించుకుపోతూ వచ్చింది. మట్టి పరచుకున్న విస్తీర్ణం తగ్గిపోతున్న కొద్దీ భూమిలోకి ఇంకే వర్షపు నీటి శాతం తగ్గిపోతూ వచ్చింది. నగరంలో సగటున ఏడాదికి 800 మిల్లీ మీటర్ల లేదా 80 సెంటీ మీటర్ల వర్షం పడుతుంటుంది. ఇందులో 95% వర్షపు నీరు వృథాగా మురుగు కాలువల్లోకి పోతున్నది. నగరం కాలి కింద భూమిలోకి 500 మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల లోతుకు వెళ్తే తప్ప బోర్లకు నీరందని దుస్థితి నెలకొంది. వాతావరణ మార్పుల తీవ్రత మూలంగా వర్షం కురిసే రోజులు తగ్గిపోతూ, కుండపోత వర్షాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో నగరాల్లో వాన నీటి సంరక్షణకు బహుముఖ వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం కనిపిస్తున్నదని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో వాన నీటి సంరక్షణ
ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ఆవరణలో వాన నీటి సంరక్షణకు ఇటీవల కాలంలో ఇంకుడుగుంతల తవ్వడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గుంత తవ్వి.. గుంతలో నాలుగు వైపులా సిమెంటు చేసి.. వివిధ సైజుల రాళ్లు, ఇసుకను నిండుగా నింపి ఇంకుడుగుంతను నిర్మిస్తున్నారు. అయితే, నిర్మించిన ఇంకుడుగుంతలు ఎన్ని సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇంకుడు గుంతలపైన బురద మట్టి ఒక పొరగా పేరుకుపోయిందంటే.. ఆ తర్వాత నీరు లోపలికి ఇంకలేని పరిస్థితి తలెత్తుతుంది. నగరంలో ఎన్ని ఇంకుడుగుంతలు తవ్వామని లెక్కలు రాసుకుంటున్నారే గాని, ఎన్ని ఇంకుడుగుంతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు? ఎన్నిటిలో సమర్థవంతంగా వాన నీరు ఇంకుతున్నది? అన్న ఆరా తీసే పరిస్థితి లేదు.  ఈ సమస్యను పరిష్కరించాలంటే.. భూగర్భంలో వాన నీటి సంరక్షణ వ్యవస్థను నిర్మించడం ఎన్నో విధాలుగా ఉత్తమ ఫలితాలనిస్తుందని డా. సాయిభాస్కరరెడ్డి సూచిస్తున్నారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల చుట్టూ ఖాళీ జాగాలు బాగా తగ్గిపోతున్న నేపథ్యంలో పిల్లలు ఆడుకోవడానికే చోటు దొరకడం లేదు. అటువంటప్పుడు ఇంకుడుగుంత కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడం కష్టతరంగా మారుతున్నది. కొందరు నగరవాసులు ఇంకుడుగుంతలపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి ఒక ముఖ్య కారణం ఇది. 

రోడ్లపై వాన నీటి వరద కోసం ప్రత్యేక పైపులైన్‌..
తెలంగాణలో మొత్తం వర్షం ఏడాదిలో 20 రోజుల్లోనే కురుస్తున్నది. చాలాసార్లు అకాల వర్షాలు, కుంభవృష్టి కురవడం ఆనవాయితీగా మారుతున్నది. రోడ్డు మీద కురిసే ప్రతి చినుకూ వరదై ఆకస్మిక సమస్య తలెత్తుతున్నది. రోడ్ల మీద కురిసే వర్షం ఇంకడానికి దారిలేదు. వేగంగా బయటకు పోయే దారీ లేదు. ఇళ్ల నుంచి మురుగు నీటిని తరలించే డ్రైనేజీలోకే రోడ్లపై వరద నీటినీ మళ్లిస్తున్నందు వల్ల కుండపోత వర్షాలు కురిసినప్పుడు నగరాల్లో నీటి ముంపు సమస్య తీవ్రమవుతున్నదని హైదరాబాద్‌ వాసి అయిన స్వతంత్ర శాస్త్రవేత్త, పర్యావరణ నిపుణుడు డా. నక్కా సాయిభాస్కర్‌రెడ్డి సూచిస్తున్నారు. రోడ్లపై నుంచి వర్షపు నీటిని నగరం బయటకు పంపేందుకు ప్రత్యేక పైప్‌లైన్‌ నిర్మించడం అర్బన్‌ ప్లానింగ్‌లో ముఖ్య అంశంగా చేపడితే నగరాల్లో వాన నీటి ముంపు సమస్య తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

ఎత్తయిన రోడ్లే ఆనకట్టలు!
భవిష్యత్తు నగరాల భవిష్యత్తు.. పాలకులు, ఆయా నగరవాసులు జల చైతన్యంతో వాన నీటి సంరక్షణ సామర్థ్యం పెంచుకోవడంపైనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌ చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఉంది. దీని పొడవు 158 కిలో మీటర్లు. నగరానికి చుట్టూ ఎత్తయిన కోట మాదిరిగా ఈ రోడ్డు ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని వాన నీటిని భూమిలోకి ఇంకింపజేసుకునే పద్ధతులు అనుసరించడం ద్వారా భవిష్యత్తులో నగరం నీటి సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడుకోవచ్చని డా.సాయిభాస్కర్‌రెడ్డి సూచిస్తున్నారు. ఇందుకు ఆయన అనేక పద్ధతులను సూచిస్తున్నారు. ఎలెవేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలనే అడ్డుకట్టగా మలచుకుంటే నీటిని నిల్వగట్టి భూమిలోకి ఇంకింప జేయవచ్చన్నది ఆయన సూచన. ఇటువంటివి హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు పొడవునా కనీసం వంద చోట్ల రోడ్డునే కట్టగా ఉపయోగించుకొని నీటి కొలనులను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెంబడి ఉన్న కల్వర్టులను ‘నగరపు ఆనకట్టలు’గా మలచుకునే అవకాశం కూడా ఉంది. సాధారణంగా కల్వర్టు కింది సిమెంటు తూముల్లో నుంచి వాన నీటి వరద నగరం నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అయితే, ఈ కల్వర్టులను వాన నీటిని నిల్వ చేసే ఆనకట్టలుగా మార్చుకోవచ్చు. కల్వర్టు కింది సిమెంటు తూములకు వాల్వులు అమర్చడం ద్వారా నీటిని నిల్వ చేయవచ్చు. నీటి మట్టం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వాల్వు ద్వారా నీటిని కొంతమేరకు వదిలివేయవచ్చు. తద్వారా అధిక నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చన్నది డా. సాయిభాస్కర్‌రెడ్డి సూచన. రాతి కొండలు ఉన్న చోట వాటి చుట్టూ పెద్ద కందకాలు తవ్వి.. మధ్యలో అక్కడక్కడా అడ్డుకట్టలు నిర్మిస్తే ఆ కొండలపై కురిసిన వాన నీరంతా అక్కడే భూమి లోపలికి ఇంకే అవకాశం ఉంటుంది. 

రెండేళ్లలో భూగర్భం ఖాళీ..!
కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా–ఎన్‌.ఐ.టి.ఐ.) ఆయోగ్‌ దేశంలో నీటి సంక్షోభం తీవ్రతపై ఇటీవల అధ్యయనం చేసింది. కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ను తొలిసారి విడుదల చేసింది. ముంచుకొస్తున్న నీటి కొరత సంక్షోభం తీవ్రత ఎంతగా ఉందని ఈ నివేదిక ప్రకటించిందంటే.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 నగరాల కింది భూమిలో నీరు కేవలం రెండేళ్లలో(2020 నాటికి) పూర్తిగా అడుగంటబోతున్నది! దీని అర్థం ఏమిటంటే.. ఈ నగరాల్లో నివాసం ఉంటున్న 10 కోట్ల మంది ప్రజలు వందల కిలోమీటర్ల నుంచి పైపులైన్లతో తరలించే నీటితోనే తాగునీటితోపాటు ఇతర అవసరాలు కూడా తీర్చుకోవాల్సి ఉంటుంది. చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత ఘోరమైన నీటి సంక్షోభం ముంచుకొస్తున్నదని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. 60 కోట్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. శుభ్రమైన తాగునీరు లేక ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే,2050 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో 6% నీటి సంక్షోభం వల్ల కోల్పోవలసిన పరిస్థితి దాపురిస్తుందని ఈ నివేదిక హెచ్చరిస్తున్నది. భూగర్భ జలాలు అంతరించిపోకుండా కాపాడుకోవాలంటే.. నీటి పొదుపును పాటించడంతోపాటు.. మీరు నగరవాసులైనా, పల్లెవాసులైనా.. మీ ఇంట్లో, ఊర్లో, పొలాల్లో కురిసే ప్రతి వాన చినుకునూ ఒడిసి పట్టుకొని.. ఎక్కడికక్కడే భూమి లోపలికి ఇంకింపజేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. కాంక్రీటు అరణ్యాలుగా మారిన హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఎన్ని విధాలుగా వీలుంటే అన్ని విధాలుగా వాన నీటి సంరక్షణకు పాలకులు, ప్రజలు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉద్యమించాలి.  
 – పంతంగి రాంబాబు

జియో ఫిల్టర్‌ ద్వారా బోరు రీచార్జ్‌ 
ఇల్లు/అపార్ట్‌మెంట్‌ రూఫ్‌టాప్‌ పైన పడిన వర్షపు నీటిని పీవీసీ పైపులోనే అమర్చిన బయో ఫిల్టర్‌ ద్వారా సులువుగా శుద్ధి చేసుకోవచ్చు. ఆ నీటిని జాగ్రత్త చేసుకొని ఇంట్లో వాడుకోవడానికి లేదా తాగడానికి వాడుకోవచ్చు. లేదా బోరు రీచార్జ్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. వాల్వును అమర్చుకోవడం ద్వారా అవసరాన్ని బట్టి ఈ రెండు విధాలలో ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. పీవీసీ పైపులో అడుగు పొడవు ఉండే రెండు ఫిల్టర్లను అమర్చుకోవాలి. మొదటిది ఇసుక ఫిల్టర్‌. రెండోది బయోచార్‌ లేదా బొగ్గు ఫిల్టర్‌. ఇసుకకు, బొగ్గుకు ముందు– వెనుక ఒక సన్నని మెష్‌ ఏర్పాటు చేస్తే చాలు. ఈ రెండు ఫిల్టర్ల ద్వారా ప్రవహించే వర్షపు నీరు మట్టి, మలినాలు లేకుండా శుద్ధి అవుతుంది. స్వల్ప ఖర్చుతోనే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 

వాన నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
మన దేశంలో వాన నీటి సంరక్షణ మొక్కుబడిగానే జరుగుతోంది. ఇంకుడుగుంతలు నిర్మించి వదిలేస్తున్నారు. నీరు బాగానే ఇంకుతున్నదని అనుకుంటున్నారు. కానీ, నిజానికి సన్నమట్టి అంగుళం మందాన పేరుకుందంటే.. ఇక ఏ మాత్రం వాన నీరు ఇంకదు. ఇంకుడుగుంత పై నుంచి బయటకు వెళ్లిపోతుంది. కంకర, ఇసుక నింపేముందే ఇంకుడుగుంతలో హైపవర్‌ రివర్స్‌ పంపులు అమర్చాలి. ఆ పంపుల ద్వారా అప్పుడప్పుడూ బలంగా నీటిని ఇంకుడుగుంత అడుగునుంచి పైకి పంప్‌ చేస్తే.. పైన పేరుకున్న మట్టి పొర చెదిరిపోయి.. ఇంకుడుగుంత సజావుగా పనిచేస్తుంది. మన వాళ్లు ఇంకుడుగుంత వరకే ఆలోచిస్తున్నారు. దాన్ని పూర్తిగా పనిచేయించేలా ఆలోచించడం లేదు. వాన నీటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యతేనని జనం అనుకుంటున్నారు. కానీ, ఇది ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా గుర్తెరగాలి. ఈ ఎరుకను కలిగించేలా ప్రచారోద్యమం చేపట్టాలి. వాననీటి సంరక్షణ పనులు ఆ ఇల్లు, అపార్ట్‌మెంట్, రోడ్డు, పార్కు.. ప్రత్యేక అవసరాలు, ప్రత్యేక స్థితిగతులను బట్టి అనుసరించాల్సి ఉంటుంది. 

భూగర్భంలో రెండు చాంబర్లు...
ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ఆవరణల్లో భూమిని ప్రత్యేకంగా ఇంకుడుగుంతలకు స్థలం కేటాయించాల్సిన అవసరం లేకుండా.. భూగర్భంలో ప్రత్యేక ఛాంబర్‌ నిర్మించుకొని వర్షపు నీటిని ఒడిసిపట్టవచ్చు. ఇది పూర్తిగా భూమి లోపలికి సంపు మాదిరిగా నిర్మించి, పైన అవసరాన్ని బట్టి పక్కకు తీసే విధంగా సిమెంటు స్లాబులను అమర్చుతారు. కాబట్టి, స్థలం వృథా కాదు. ఈ ఛాంబర్‌కు చుట్టూ మూడు, నాలుగు వైపులా గోడలకు రెండంగుళాల వ్యాసార్థంలో రంధ్రాలుంటాయి. ఛాంబర్‌ను భూమిలో అమర్చిన తర్వాత.. దాని చుట్టూ అర అడుగు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఆ ఖాళీలో పెద్దసైజు కంకర రాళ్లు అర అడుగు మందాన నింపుతారు. ఛాంబర్‌లో నుంచి నీరు ఈ రాళ్ల నుంచి మట్టి ద్వారా భూగర్భంలోకి ఇంకుతాయి. భూగర్భంలో ఇలాంటి వాన నీటి సంరక్షణ ఛాంబర్లను రెండు విధాలుగా నిర్మించుకోవచ్చు. వీటిని సిమెంటుతో నిర్మించుకోవచ్చు. లేదా ఫైబర్‌తో తయారు చేసి భూగర్భంలో అమర్చుకోవచ్చు. ఛాంబర్‌లో రెండు గదులుంటాయి. వర్షపు నీరు గొట్టం ద్వారా ఒక గదిలోకి వస్తాయి. నీటితోపాటు వచ్చి చేరిన దుమ్ము ధూళి ఛాంబర్‌ అడుగుకు చేరుకుంటుంది. ఆ గది నిండిన తర్వాత పక్క గదిలోకి నీరు చేరుతుంది. ఛాంబర్‌ చుట్టూ ఉన్న రంధ్రాల ద్వారా నీరు భూమి లోపలికి సులువుగా ఇంకుతుంది. రెండో గదిలోకి చేరిన నీటిని ఇంట్లో వాడకానికి ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ నీటిని మోటారుతో తోడుకొని తాగునీరుగా కూడా ఉపయోగించుకోవచ్చు. తాగునీరుగా వాడుకోవాలనుకుంటే.. రెండో గదిలో  బయోచార్‌ లేదా బొగ్గు, ఇసుక, గ్రావెల్‌లను పొరలుగా వేసుకోవాలి. ఈ నీటిని మోటారు ద్వారా ఓవర్‌హెడ్‌ ట్యాంకులోకి తోడుకొని.. ఆర్‌.ఒ. సిస్టం ద్వారా శుద్ధిచేసుకొని తాగునీరుగా ఉపయోగించుకోవచ్చు. 

ఇళ్లు.. రోడ్లు.. వాన నీటి సంరక్షణ
నగరంలో వాన నీటి సంరక్షణ అనగానే ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ఆవరణల్లో ఏం చేయవచ్చన్న దగ్గరే ఆలోచన, ఆచరణ ఆగిపోతున్నాయి. రోడ్ల మీద కురిసే వర్షాన్ని ఎలా ఒడిసిపట్టాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్ల పక్కన పేవ్‌మెంట్లపై సిమెంటుతో కాంక్రీటు గచ్చు చేయడం మన వాళ్లకు అలవాటు. సిమెంటు ఇటుకల(పర్క్యులేటెడ్‌ టైల్స్‌)ను పరిచినట్లయితే వాటి సందుల్లో నుంచి నీరు కొంతమేరకైనా భూమిలోకి ఇంకుతుంది. ఫుట్‌ పాత్‌ మొత్తంలోనూ సిమెంటు ఇటుకలు అమర్చకుండా.. మధ్య మధ్యలో తక్కువ ఎత్తు పెరిగే మొక్కలు, గడ్డిని పెంచాలి. ఇది చూడటానికి ఎంతో అందంగానూ ఉంటుంది. ఎక్కువగా వాన నీటిని భూమి లోపలికి ఇంకింపజేస్తుంది. గడ్డి, మొక్కలున్న చోట కురిసే వాన నీరు 95% భూమి లోపలికి ఇంకుతుంది. రోడ్డు పక్కనే భూమిలోకి నీరు ఇంకితే అక్కడి చెట్లు, మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఆహ్లాదాన్ని, ఆక్సిజన్‌ను పంచుతాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల చుట్టూతా ఖాళీ ప్రదేశాలలో, పార్కుల్లో కూడా సిమెంటు చేసెయ్యకుండా ఈ విధంగా పెర్క్యులేటెడ్‌ టైల్స్‌ను వేసుకుంటే వాన నీటి సంరక్షణ మెరుగ్గా జరుగుతుంది.  

ఆరేళ్లుగా రూఫ్‌టాప్‌ వర్షపు నీరే తాగునీరు!
మూడింట రెండొంతుల వ్యాధులు పరిశుద్ధమైన తాగునీరు అందకపోవడం వల్లనే సంక్రమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గడమే తాగునీటి సమస్యకు కారణం అని అనిపిస్తుంది. కానీ, నిజానికి అది వాస్తవం కాదు. ఈ సమస్య ఉన్న ఇంట్లోనే పరిష్కారం కూడా  ఉందంటున్నారు కరువు ప్రాంతమైన మదనపల్లివాసి ఎం.సి.వి. ప్రసాద్‌. తమ ఇంటి రూఫ్‌టాప్‌ పైన కురిసే వర్షాన్నే శాస్త్రీయ పద్ధతిలో ఒడిసిపట్టుకొని, శుద్ధి చేసుకొని ప్రసాద్‌ కుటుంబం గత ఆరేళ్లుగా తాగుతున్నారు. రాయలసీమలో 400–600 ఎం.ఎం. వర్షం కురుస్తుంది. అంటే ప్రతి ఇంటిపైనా ఏడాదికి చ. మీ.కి కనీసం 50 లీటర్ల వర్షం కురుస్తుంది. ఇతర ప్రాంతాల్లో చ.మీ.కి కనీసం 60–100 లీటర్ల వర్షం కురుస్తుంది. ఈ నీటిని వృథాగా పోనీయకుండా.. భద్రపరుచుకుంటే.. ఏడాదంతా తాగడానికి సరిపోతాయి. ఆరుగురు కుటుంబానికి రోజుకు 20 లీటర్ల తాగునీరు సరిపోతుంది. ఇందిరమ్మ ఇంటిపైన కూడా రాయలసీమలో ఏటా 15 వేల లీటర్ల వాన కురుస్తుందని, అందులో సగం పట్టుకోగలిగినా తాగునీటికి కరువుండదని ప్రసాద్‌ చెబుతున్నారు. ఇంటిపైన కురిసే వర్షాన్ని సంరక్షించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే.. మొదట్లో కొంత పెట్టుబడి అవసరం. భూగర్భంలో ఇటుకలతో సిమెంటు ట్యాంకు నిర్మించాలి. ఇంటిపైన కురిసిన నీటిని పీవీసీ పైపుల ద్వారా మినరలైజేషన్‌ ట్యాంకు నుంచి భూగర్భ ట్యాంకులోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. మేడపైన దుమ్ము ధూళి కొట్టుకుపోవడానికి వర్షం నీటిని మొదటి 5 నిమిషాలు బయటకుపోయేలా వాల్వు ఏర్పాటు చేసుకోవాలి.వర్షపు నీటిలో ఖనిజాలు ఉండవు. అందువల్ల ఈ నీటికి సహజ పద్ధతిలో ఖనిజాలు కలిసేలా చేస్తున్నారు. ఇందుకోసం 500–1000 లీటర్లు పట్టే మినరలైజేషన్‌ ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి. ఎం.సి.వి. ప్రసాద్‌ తన ఇంటి వద్ద స్టెయిన్‌లెస్‌ స్టీల్‌(304 ఫుడ్‌ గ్రేడ్‌) డ్రమ్ము(మినరలైజేషన్‌ ట్యాంకు)ను ఏర్పాటు చేసుకున్నారు. మేడ పై నుంచి పైపు నుంచి మినరలైజేషన్‌ ట్యాంకు ద్వారా భూగర్భంలో నిర్మించిన సిమెంటు ట్యాంకు లోపలికి చేరుకొని నిల్వ ఉంటాయి. మోటారుతో ఏరోజుకారోజు తోడుకొని గత ఆరేళ్లుగా ప్రసాద్‌ కుటుంబం తాగుతున్నారు. గాలి, వెలుతురు తగలకుండా జాగ్రత్తపడితే ఈ నీటిని ఎన్నేళ్లు నిల్వచేసినా పాడు కావు, నాచు పట్టదని ప్రసాద్‌ తెలిపారు.  
– డా. నక్కా సాయిభాస్కర్‌రెడ్డి, స్వతంత్ర శాస్త్రవేత్త, పర్యావరణ నిపుణులు, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు