దాని వల్ల మధుమేహమా?

10 Jun, 2018 02:07 IST|Sakshi

సందేహం

ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. అయితే మావారు, అత్తగారు.. చిన్న పని కూడా నన్ను చేయనీయడం లేదు. ఎంతగా విశ్రాంతి తీసుకుంటే, పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఇలా ఏ పనీ చేయకుండా ఉండటం వల్ల నాకు బోర్‌గా ఉంది. అయితే, ఇలా అధికంగా విశ్రాంతి తీసుకోవడం వల్ల మధుమేహం, కాళ్లలో రక్తం గడ్డలు వంటి సమస్యలు ఎదురవుతాయని ఒక ఫ్రెండ్‌ చెప్పింది. నాకు కాస్త కంగారుగా ఉంది. దయచేసి దీని గురించి తెలియజేయగలరు. – ఆర్‌.శైలజ, నర్సీపట్నం
గర్భం దాల్చడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఈ క్రమంలో గర్భం తొమ్మిది నెలల పాటు సజావుగా జరగడానికి, ఆడవారిలో ప్రకృతి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. దానికి తగ్గట్లు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతే కానీ, ప్రతి ఒక్కరు తప్పకుండా మొత్తానికే విశ్రాంతి తీసుకోవాలని ఏమీ లేదు. కాకపోతే కొందరిలో కొన్ని సమస్యలు అంటే, గర్భాశయ ద్వారం చిన్నదిగా, లూజ్‌గా ఉండటం, మాయ పూర్తిగా కింద భాగంలో ఉండటం, ముందు గర్భాశయంలోని సమస్యల వల్ల అబార్షన్లు అయినప్పుడు మాత్రమే పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. మిగతావారు డాక్టర్‌ సలహా మేరకు ఇతర ఇబ్బందులు ఏమీ లేనప్పుడు రోజూ చేసుకునే మామూలు పనులు చేసుకోవచ్చు. కొద్దిగా ఇబ్బందిగా, ఆయాసంగా అనిపించే పనులు చేయకపోవడం మంచిది. అవసరం లేకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం వల్లే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఏమీ లేదు. ఇంకా దీనివల్ల బిడ్డ అధిక బరువు పెరగటం, బీపీ, షుగర్, రక్తనాళాలలో రక్తం గూడుకట్టడం, ఆయాసం, కాన్పులో ఇబ్బంది, సిజేరియన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆపరేషన్‌ తర్వాత అధిక బరువు వల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు మీ ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నప్పుడు, మొదటి మూడు నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ, మిగతా నెలల్లో తేలికపాటి పనులు చేసుకోవచ్చు. అయిదో నెలలో టిఫా స్కానింగ్‌ అయిన తర్వాత గర్భాశయ ద్వారం సాధారణంగా ఉంటే, కొద్దిసేపు వాకింగ్, ప్రాణాయామం, తర్వాత మెల్లిగా చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవచ్చు. దీనివల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. కాళ్ల నొప్పులు, నడుము నొప్పులను తట్టుకునే శక్తి ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. కాన్పు సులువుగా అయ్యే అవకాశాలు ఉంటాయి.

ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు యాంటీ డిప్రెజంట్స్‌ వాడొచ్చా? అలా వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌  ఉంటాయా? అలాగే మందులు వాడకుండా ‘పోస్ట్‌–నేటల్‌ డిప్రెషన్‌’ తగ్గడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా?
– కె.కల్పన, పుల్లేటికూరు, తూర్పుగోదావరి జిల్లా

కొన్ని రకాల యాంటీ డిప్రెజంట్స్‌ ప్రెగ్నెన్సీలో వాడటం వల్ల శిశువులో కొన్ని అవయవ లోపాలు, గుండెలో లోపాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు డల్‌గా, చిరాకుగా ఉండటం, పాలు సరిగా తాగకపోవడం వంటి చిన్నచిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలూ ఉంటాయి. అలా అని డిప్రెషన్‌ ఎక్కువగా ఉన్నవాళ్లు... యాంటీ డిప్రెజంట్స్‌ వాడుతూ ఉండి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆపేస్తే కూడా తల్లిలో డిప్రెషన్‌ ఎక్కువగా ఉండటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి జరుగుతాయి. అలా చేస్తే బిడ్డ సరిగా ఎదగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించి తక్కువ మోతాదులో దుష్ఫలితాలు లేదా అసలు దుష్ఫలితాలే లేని యాంటీ డిప్రెజంట్స్‌ను వాడటం మంచిది. కాన్పు తర్వాత కొంతమంది తల్లులలో హార్మోన్లలో మార్పుల వల్ల, బిడ్డ పనులలో అలసిపోవడం, ఇంకా కొన్ని కారణాల వల్ల పోస్ట్‌ నేటల్‌ డిప్రెషన్‌ ఏర్పడుతుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీ డిప్రెజంట్స్‌ వాడవలసి వస్తుంది. కొద్దిగా కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు వారితో ప్రేమగా ఉండటం, బిడ్డ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం వల్ల చాలావరకు పోస్ట్‌ నేటల్‌ డిప్రెషన్‌ను మందులు లేకుండా అధిగమించొచ్చు.

నాకు థైరాయిడ్‌ ఉంది. దాంతో తల వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి. పూర్తిగా రాలిపోతాయేమోనని భయంగా ఉంది. మొదటిసారి గైనకాలజిస్ట్‌ను కలిసినప్పుడు మందులు రాశారు. అప్పటికి థైరాయిడ్‌ టెస్ట్‌ చేయించుకోలేదు. ఈ మందుల వల్ల యుటెరస్‌కి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని నా ఫ్రెండ్‌ చెబితే వాడలేదు. ట్యాబ్లెట్లు వాడమంటారా? వద్దా ? అనేది తెలియజేయగలరు.– ఎన్‌.అనూష, హైదరాబాద్‌
రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం, పీసీఓడీ సమస్య, ఇంకా ఇతర హార్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో కారణాల వల్ల తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. థైరాయిడ్‌ సమస్య ఉంటే దానికి తగ్గ మందులు తగిన మోతాదులో తప్పక వాడవలసి ఉంటుంది. థైరాయిడ్‌ ట్యాబ్లెట్లు వాడటం వల్ల యుటెరస్‌కి కానీ ఇంకా ఇతర అవయవాలకు కానీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. వాడకపోతేనే వెంట్రుకలు రాలిపోవడంతో పాటు పీరియడ్స్‌లో అసమతుల్యత, నీరసం, లావు పెరగటం, బద్ధకంగా ఉండటం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్‌ ట్యాబ్లెట్లతో పాటు అవసరమైతే బి–కాంప్లెక్స్, క్యాల్షియం ట్యాబ్లెట్లు డాక్టర్‌ సలహా మేరకు వాడటం మంచిది.
- డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బోహైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు