అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

21 Jul, 2019 09:24 IST|Sakshi

కొత్త కథలోళ్లు

‘‘నువ్వయినా చూడాలి కదమ్మా, చూడు ఆ మేకలు వచ్చి మల్లె మొక్కని ఎలా తినేసాయో?’’
కాలేజీ నుంచి వస్తూనే నాపై విరుచుకుపడింది నా కూతురు మృదుల. గబ గబా వంటింట్లో నుంచి  బయటకు వచ్చి చూశాను. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మల్లె మొక్క అది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పువ్వులు పూయడం ప్రారంభించింది. మేకలు చాలా వరకు తినేశాయి. ప్రాణం ఉసూరుమంది. బేలగా చూశాను కూతురు వంక.
మృదుల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. పాపం మొక్కలంటే తనకి ఎంతో ఇష్టం. రోజు పొద్దునే మొక్కలన్నిటికి నీళ్ళు పెట్టి, వాటితో కాసేపు కబుర్లు చెప్పి మరీ కాలేజీకి వెళ్తుంది.

మల్లెమొక్క అలా అయ్యేసరికి విలవిల లాడిపోతుంది.
‘‘పోనిలేవే, జరిగిపోయింది కదా. మనం ఏం చెయ్యగలమిప్పుడు? వూరుకోవే’’ అన్న మా అత్త గారి మాటలకు ఒక్కసారిగా రయ్యిన లేచింది నా కూతురు.
‘‘కష్టపడి మొక్కలను పెంచితే తెలిసేది నా బాధ ఏంటో? అయినా ఇంట్లో ఖాళీగా కూర్చునే వుంటున్నావు కదా. మేకలు మొక్కలని తినకుండా చూడలేకపోయావా ?’’ అని వాళ్ళ నాన్నమ్మ మీద ఒంటి కాలి మీద లేచింది మృదుల.
‘‘నడుము నొప్పిగా ఉంటే కాస్త అలా నడుము వాల్చానే, అంతలోనే ఇలా పాడు మేకలు వచ్చి తినేశాయే.’’ అన్న మా అత్తగారి మాటల్ని విననట్లు విస విసగా ఇంట్లోకి వెళ్ళిపోయిన మనవరాల్ని చూస్తూ నవ్వేశారు మా అత్తగారు.

ఇంతకు ముందు మేము పట్నం  లోపల అద్దెకు ఉండేవాళ్లం. అది ఇల్లు అనే కంటే కూడా క్లోజ్డ్‌ బాక్స్‌ అంటేనే కరెక్టేమో. అసలు గాలి ఆడని చిన్న గదుల ఇల్లు అది. ఆ మాత్రం దొరకడమే పట్నంలో ఎక్కువ. మా వారి చిన్నప్పుడే మా మామయ్య గారు కాల ధర్మం చెందితే మా అత్తగారు ఆపని, ఈ పని చేసి ఒక్కొగానొక్క కొడుకుని చదివించి ప్రయోజకుడిని చేశారు. మా వారు చేస్తున్నది గుమాస్తా ఉద్యోగం కాబట్టి పాపైనా, బాబైనా ఒక్కరే చాలు అని మా ఆలోచన. ఆవిడ మా ఆలోచనకు అంగీకరించడం మృదుల పుట్టిన వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టడం జరిగిపోయింది.  రూపాయి రూపాయి కూడ బెట్టి ,ఆఫీస్‌లో లోన్‌ తీసుకొని వూరు చివర కొత్తగా వచ్చిన కాలనీలో ఖాళీ జాగా కొని ముచ్చటైన చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఇంకా చిన్న చిన్న  ఇంటి పనులు పెండింగ్‌ ఉండిపోయాయి. డబ్బులు సర్దుబాటు అయ్యాక చేయిద్దామని వూరుకున్నాం.

మేము ఈ ఇంట్లో కొచ్చి ఓ ఆరు నెలలు అయ్యింది. ఈ ఇంటి కొచ్చాకే మృదుల ఇంటర్‌ ఫస్టియర్‌ లో జాయిన్‌ అయింది. మృదులకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు అద్దెకున్న ఇంట్లో మొక్కలు పెంచే వీలు లేక మని ప్లాంట్‌ని బాటిల్స్‌లో పెంచి మురిసిపోయేది. ఇక్కడ ఇంటి ముందు కొద్దిగా ఖాళీ స్టలాన్ని మొక్కల కోసమనే ప్రత్యేకంగా ఉంచాము. పూల మొక్కలు, ఆకుకూరల మొక్కలు, కొత్తిమీర, పెంచుతుంది మృదుల. నిజం చెప్పొద్దూ. నాక్కూడా ఏ రోజు కారోజు తాజా ఆకు కూరలు వంట కి ఉపయోగ పడుతున్నాయి. మా ఇంటికి ఎవరొచ్చినా వారు ముందు మాట్లాడేది మొక్కలు,వాటి పచ్చదనం వలన మా ఇంటికొచ్చిన అందం గురించి మాత్రమే.

రాత్రి మావారు రాగానే భోజానాలు చేసి మొక్కల మధ్యలో కుర్చిలేసి కూర్చుని నలుగురం కాసేపు మాట్లాడుకోవడం మాకలవాటు. ఈరోజు మృదుల వాళ్ళ నాన్నతో పోట్లాట ప్రారంభించింది.
‘‘నాన్నగారు! ఎన్నిసార్లు చెప్పాలి మీకు కాంపౌండ్‌ వాల్‌ కట్టించమని. చూడండి మరలా మేకలు వచ్చి మల్లె మెక్కని ఎలా తినేశాయో. మొన్న ఆవులు వచ్చి మొత్తం పాడు చేసి వెళ్ళాయి.’’
 మేము ఇల్లు పూర్తి చేశాం కానీ చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ కట్టించలేదు. సరిగ్గా సివిల్‌ వర్క్‌ అయి, ఫినిషింగ్‌ లు దగ్గర కొచ్చేసరికి చేతి లోని డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి. చీటీ ఒకటి వేస్తున్నాం. ఇంకో నాలుగు నెలలు పోయాక చీటీ పాడి, కాంపౌండ్‌ వాల్‌ కట్టించాలన్నదే మా ఆలోచన.
‘‘బంగారు తల్లి, నీకు తెలుసు కదరా.... చీటీ డబ్బులు రాగానే కట్టించేద్దాం..సరేనా’’ కూతురు తలపై చేయి వేసి మావారు చెప్పారు. 
‘‘ఆ... అప్పటికి ఒక్క మొక్క ఉండదు, తొక్క ఉండదు. అప్పుడు కట్టించడం దండగ ’’ కోపంగా అంది మృదుల.

గారాల కూతురు కదా మాపై అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది. కొడుకైనా, కూతురైనా తనే కదా. మా ఇంట్లో అందరికీ మృదుల అంటే చాలా ఇష్టం. స్వేచ్ఛగా తన భావాలను పంచుకోవాలని మా వారెప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే తనకి కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా వెంటనే చెప్పేస్తుంది.
‘‘అది కాదురా, అర్థం చేసుకో....ఈ నాలుగు నెలలు మన ఇంటి చుట్టూ ముళ్లతో కంచె వేయించనా? కాస్తా  అడ్డుగా ఉంటుంది పశువులు రాకుండా.’’
‘‘వద్దు నాన్నగారు, మన ఇంటి అందం పోతుంది. గాలి, వర్షం  వచ్చి నప్పుడు ముళ్లన్నీ మన ఇంటి ముందు చేరి మనకు గుచ్చుకుంటాయి. మనకే  ఇబ్బంది. ఏదోలా కాంపౌండ్‌ వాల్‌ కట్టించండి నాన్న గారూ.’’.... గారాలు పోతూ అడిగింది.
మృదులకి తెలుసు వాళ్ళ నాన్నను ఎలా కాక పట్టాలో.
‘‘చూద్దాంలేరా... సరేనా....వెళ్ళి చదువుకో బంగారం’’ అంటూ మా వారు తెలివిగా చర్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు.
 మా అత్తగారు  నవ్వుతూ తండ్రి కూతుళ్ల సంభాషణ విని ‘‘పడుకోండి.... మరల పొద్దునే నువ్వు ఆఫీస్‌ కి వెళ్లలాయే’’అంటూ కొడుకుకి చెప్పి నిద్ర పోవడానికి తన గదిలోనికి నడిచారు.

‘‘ సరే..బై .....’’ మృదుల గొంతు విని గబ గబ బయటకి వచ్చి చూశాను. 
ఎవరో కుర్రవాడు... మృదులతో పాటు మా ఇంటి దగ్గరకు వచ్చి, వెనక్కి తిరిగి వెళ్లిపోతూ కనిపించాడు.
వాకిట్లో కూర్చొని తడి బియ్యం ఆరపెడ్తున్న మా అత్తగారు 
‘‘ఎవరే... ఆ కుర్రాడు ?’’ అని అడిగారు మనవరాలిని.
‘‘మా కాలేజీలో సీనియర్‌ నాని ....’’ 
‘‘మన కాలనీలో ఎప్పుడు చూసినట్లు లేదు. వాళ్ళ ఇల్లు యెక్కడే ?’’
‘‘మన కాలనీ కాదు నాని. కాలేజీ అయిపోయాక దారిలో కలిసి మీ ఇంటి వైపు చిన్న పని ఉంది అంటూ మాట్లాడుతూ వచ్చాడు, భలే సరదాగా మాట్లాడుతాడు’’.
‘‘మరి ఇంట్లోకి పిలవకుండా అలా పంపించేశావేంటి?’’ నాన్నమ్మ ప్రశ్నకు– 
‘‘నిజమే కదా నాకా ఆలోచనే రాలేదు’’ అంటున్న మనవరాలిని పిలిచి తన పక్కనే కూర్చుపెట్టుకొని..
‘‘చూడు ముద్దు!’’
మా అత్తగారు మృదులను అలానే పిలుస్తారు.
‘‘చూడు ముద్దు.... నీది తెలిసి తెలియని వయసు. ఆ అబ్బాయిది కూడా. నీతో మాట్లాడాలనే ఉద్దేశ్యం తోనే ఏదో వంక చెప్పి మన ఇంటి వరకు నీతో పాటు వచ్చాడు. నువ్వు ఒక సారి ఆలోచించు మీ ఇద్దరికీ ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. మీరు మాట్లాడిన మాటలలో మీ చదువుకు సంబంధించి గాని, మీకు ఉపయోగ పడే మాటలేమైన ఉన్నాయేమో చూడు. ’’

‘‘స్నేహం చెయ్యడం ఎప్పుడూ తప్పు కాదు. కులం, మతం, పేద గొప్ప భేదాలు ఉండకూడదు. కావాల్సినది కల్మషం లేని స్నేహ హృదయం మాత్రమే స్నేహానికి అసలైన అర్హత ’’....
పెద్దావిడ మాటలు వింటూ... మృదుల వైపు చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.
ఒక్కసారిగా నా కూతురు ముఖం రంగులు మార సాగింది. కనుకొలనులలో జలపాతం దూకడానికి సిద్ధంగా ఉంది. పెదవులు ఉక్రోషంతో ఆక్రోశిస్తున్నాయి. 
మృదుల పరిస్థితి అర్థం చేసుకుని గబ గబా వెళ్ళి ‘‘నువ్వు వెళ్ళి, ఫ్రెష్‌ అయ్యి రా...స్నాక్స్‌ తిందువు గాని’’ అని లోపలకి పంపించేసాను. ఫ్రెష్‌ అయి వచ్చి  నా ఫోన్‌ తీసుకొని తన ఫేస్‌ బుక్‌ అక్కౌంట్‌ ఓపెన్‌ చేసి చూడసాగింది.
నేను తన కోసం వేడి వేడి పకోడీలు వేసి, పిలుస్తున్నాను. కానీ ఫేస్‌ బుక్‌లో మునిగిపోయి నా మాటలు వినబడటం లేదు మదులకు.
పక్కనే ఉన్న మా అత్తగారు వెళ్ళి మనవరాలి పక్కన కూర్చొని ఫేస్‌బుక్‌ చూడసాగారు. ఒక్క రెండు నిమిషాలు చూసి...‘‘ముద్దూ, నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు ఏం చేస్తున్నావో ?’’ అన్నారు.

‘‘నాని, నేను నా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేస్తున్నాను. నీకు ఇంగ్లిష్‌ రాదు కాబట్టి నీకు అర్థం కావడం లేదు.’’ 
‘‘ఫ్రెండ్స్‌ అంటే..?’’ మా అత్తగారి ప్రశ్నల పర్వం మరల మొదలయింది.
‘‘మౌనిక, లల్లి, దీపికా అందరునూ నాని’’
‘‘ఓ గంట క్రితం వరకు కాలేజీలో కలిసే ఉన్నారు కదా మీరందరూ. అంతలోనే మరలా కబుర్లా?’’
‘‘అదంతే...నాని,ఎంతసేపు మాట్లాడుకున్న ఇంకా బోలెడు మాటలు మిగిలిపోయే ఉంటాయి.’’
‘‘అలాగా....!’’  బుగ్గన అరచేయి పెట్టుకొని ఆశ్చర్య పోయారావిడ.
 ‘‘ఏం మాట్లాడుకున్నారో నాకూ కాస్త చెప్పమ్మా’’
 కుతూహలం అత్తగారి గొంతులో.
‘‘ఏం,మాట్లాడుకున్నాం అంటే చెప్పడానికి ఏం ఉండదు. జస్ట్‌ చిట్‌ చాట్‌ అంతే’’
‘‘అదేంటే, ఒక పక్క మీ అమ్మ పిలుస్తున్నా వినబడనంతగా ఫోన్‌లో మునిగిపోయావు. ఏం మాట్లాడుకున్నారో అంతే...చెప్పడానికి ఏం లేదు అంటున్నావు.’’
‘‘నాని, జస్ట్‌ టైమ్‌ పాస్‌ అంతే ’’
‘‘బంగారూ, జస్ట్‌ టైమ్‌పాస్‌ అన్నావు కదా. అసలు టైమ్‌ అంటే ఏమిటో నీకు తెలుసా ’’

మా అత్తగారి ప్రశ్న అర్థం అయి, అవక నా వైపు చూసింది మృదుల. మా అత్త గారు పుస్తకాలు బాగా చదువుతారు. పేపర్‌ ఒక్క అక్షరం వదలకుండా రోజూ చదువుతారు. ఇంగ్లిష్‌ పెద్దగా రాకపోవడం వలన తెలుగులో దొరికే ప్రతి పేపర్‌ చదువుతారు. ఆఖరికి కిరాణా పొట్లంతో వచ్చే కాగితం సహా. ఆ నాలెడ్జే ఆవిడను ధైర్యంగా బ్రతికేలా చేసిందని చెప్తారావిడ. 
‘‘టైమ్‌ అంటే టైమ్‌’’ అన్న మనవరాలి సమాధానానికి నవ్వి, ‘‘భగవంతుడు ప్రతి రోజూ ఉదయం మనకు ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయిలు ఇస్తాడు. మనం ఆ సంపదని మరుసటి రోజు ఉదయానికి పూర్తిగా ఖర్చు పెట్టాలి. బ్యాలన్స్‌ ఉంచుకోవాలన్న కుదరదు. మరుసటి రోజు  ఉదయం మరలా ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయిలు ఇస్తాడు. ఐతే ఆ సంపదని ఎంత చక్కగా, సద్వినియోగంగా ఖర్చు పెట్టామన్నదానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మంచిగా ఖర్చు చేస్తే మన బ్రతుకు బంగారం అవుతుంది. వృథాగా ఖర్చు చేస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.’’

‘‘నాని, ఆ ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలే ఎందుకు దేవుడు ఇస్తాడు. ఏం? రౌండ్‌ ఫిగర్‌ ఇవ్వొచ్చు కదా.’’
మా అత్త గారి సమాధానం కోసం నేను కూడా ఆసక్తిగా చూడసాగాను. 
‘‘పిచ్చి పిల్లా... ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయిలు అంటే ఒక రోజుకు ఉన్న సెకండ్లు. నిమిషానికి అరవై సెకండ్లు కదా... అంటే గంటకు మూడు వేల ఆరు వందల సెకండ్లు. రోజుకు ఇరవై నాలుగు గంటలు కనుక రోజు మొత్తంలో మనకు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు అన్న మాట. టైమ్‌ని  వృథాగా ఖర్చు చేయకుండా, చక్కగా వినియోగించుకుంటే మనకు ఎంతో లాభం’’  అని చక్కగా వివరించారావిడ. 
కానీ నా కూతురు ముఖం మాడిపోయింది. 
‘‘అయితే నేను ఇప్పుడు టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నానా?’’ ఒక్కసారిగా ఆవేశం వచ్చిసింది మా చిట్టి తల్లికి.

‘‘అలా అని నేను అనలేదు కదా. కేవలం విషయం చెప్పాను. అది కూడా ఈరోజే పేపర్‌లో చదివా..నీకు చెప్పా. నువ్వు టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నావని కాదు. సమయం విలువ తెలుసుకుంటావని చెప్పానమ్మా .’’ 
మా అత్త గారి ఉపశమనం మాటలు మృదుల తలకెక్కలేదు. 
‘‘వూ ..’’ అంటూ చివాల్న లేచి గది లోనికి వెళ్లిపోయింది.
మృదుల ప్రవర్తనకు మా అత్తగారి ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. కానీ అంతలోనే పెద్దరికంతో ఒక చిన్న నవ్వు నవ్వేశారు అలవాటుగా. నిజం చెప్పాలంటే మా అత్తగారిని చూస్తే చాలా ఆనందం వేసింది. అలాంటి తెలివైన అత్తగారు నాకు దొరకడం నా అదష్టం.
లోపల మృదుల ఏం చేస్తుందో అని గది లోనికి వెళ్ళేసరికి వెక్కి వెక్కి ఏడుస్తుంది తను. నాకు ఒక్క సారిగా గుండె చెరువయ్యింది. 
‘‘ఏమయిందిరా బంగారం? ఎందుకురా ఏడుస్తున్నావ్‌ ?’’  లాలనగా అడిగాను.
‘‘ఏం లేదులే ?’’

‘‘చెప్పు బంగారం ! చెపితేనే కదా నాకు తెలిసేది. చెప్పురా’’ అన్నాను కారణం తెలిసి కూడా.
‘‘నాని చూడు అమ్మా. ఎప్పుడు నన్నే తప్పు పడుతూ ఉంటుంది. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని.
ఫేస్‌ బుక్‌ చూస్తే తప్పు, ఫ్రెండ్స్‌ తో మాట్లాడితే తప్పు. ఆఖరికి టీవీలో సీరియల్‌ చూస్తే తప్పు. టీవీ ఆపేసి తనతో పాటు కూర్చుని పుస్తకాలు చదవమంటుంది. పక్కనే కూర్చుంటుంది ఒక పుస్తకం పట్టుకొని. నేను మరలా చదవనేమోనని కాపలా ఉంటుంది . ‘‘
‘‘అసలు నానికి నేనంటేనే ఇష్టం లేదనుకుంటా.  టెన్త్‌ లో టెన్‌ కి టెన్‌ జీపీఏ తెచ్చుకుంటే నాన్న గారు మంచి సెల్‌ గిఫ్ట్‌ గా ఇస్తానన్నారు కదా. నీకు గుర్తుంది కదా మొన్న నాన్న గారు ‘‘బంగారు , రేపు షాప్‌ కి వెళ్ళి నీకు మంచి స్మార్ట్‌ ఫోన్‌ కొని పెడతాను అన్నారు కదా. నాకయితే గాల్లో తేలినట్లయింది నాన్న గారి మాటలు వినగానే. ఏ కంపెనీ అయితే బాగుంటుందో, ఏ మోడల్‌ బాగుంటుందో అని ఊహించుకోసాగాను. కానీ ,,,అప్పుడు నాని ఏమందో గుర్తుందా నీకు.’’ ఆవేశం తో అడిగింది మదుల.

అవును. టెన్త్‌ లో టెన్‌ కి టెన్‌ పాయింట్స్‌ సాధించింది  మృదుల.  చేసిన ప్రామిస్‌ ప్రకారం మంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనడానికి రెడీ అయిపోయారు మా వారు. ఆయన రేపు షాప్‌ కి వెళ్దాం అని చెప్పా గానే మా అత్తగారు చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి.
‘‘ ఇప్పుడప్పుడే ఫోన్‌ కొని ఇవ్వొద్దు. చిన్న పిల్ల అపుడే ఫోన్‌ ఎందుకు. ఇంటర్‌ అయిపోయాక ఇద్దాము.’’
మా వారికి తల్లి మాట అంటే వేదవాక్కే మరి. మగదక్షత లేకపోయినా ఎన్నో కష్టాలు పడి తనని పెంచి, చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన తల్లి అంటే మా వారికి ప్రాణం. ఆవిడ తెలివితేటలు, జీవన నైపుణ్యాలపై అపారమైన నమ్మకం. 
‘‘బంగారం, సారి రా. నీకు ఇప్పుద్దు ఇద్దామనుకున్న ఫోన్‌ కంటే ఇంకా మంచి ఫోన్‌ నీ ఇంటర్‌ అయ్యాక కొనిస్తారా..ప్రామిస్‌..’’ అంటూ కూతురు చేయి పట్టుకొని ఇంటి ముందు మొక్కల దగ్గరకు తీసుకొని వెళ్లిపోయారు. బహుశా నచ్చ చెప్పడానికి గాబోలు.
‘‘అమ్మ, మాట్లాడు..అలా నిలబడిపోయావేంటీ’’ నన్ను కదుపుతూ మదుల అడుగుతూ ఉంటే గత జ్ఞాపకాలలోంచి బయటకు వచ్చాను. నా నడుము చుట్టూ చేతులు వేసి నా పొట్టలో దూరి వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురుని చూస్తే కడుపు తరుక్కు పోయింది.

‘‘అమ్మ! నానితో మరి మాట్లాడను అమ్మా. నాకు సెపరేట్‌గా మంచం వేయించు. లేదంటే కిందనే పడుకుంటా.’’
రెండు బెడ్‌ రూముల మా ఇంటిలో అత్తగారు, మృదుల ఒక గదిలో, మేమిద్దరం ఒక గదిలో పడుకుంటాం. మా అత్తగారు మృదులకి కొద్దిగా వయసు రాగానే తనతో పాటు తన మంచం  పైనే పడుకోబెట్టుకుంటున్నారు.
నా కర్తవ్యం నాకు భోధ పడింది. ఇదే సరైన సమయం. మనుషుల మధ్య అంతరాలు ఏర్పడకూడదు. పొరపాటున ఏర్పడితే వెంటనే సరి చేయ్యకపోతే అగా«థాలు ఏర్పడిపోతాయి. మదుల మనసులో మా అత్తగారి పట్ల పేరుకుపోతున్న ద్వేషాంకురాన్ని ఇప్పుడే పెకలించాలని అనుకున్నాను.
‘‘బంగారం! మా చిట్టి తల్లి కదు. అమ్మ మాట శ్రద్ధగా వింటావు కదు. ‘‘
‘‘చెప్పమ్మ, నీ మాట నేనెప్పుడూ వింటాను కదా.’’
‘‘పిచ్చి తల్లి, నువ్వు నాన్నా గారితో రోజు ఏం చెయ్యమని అడుగుతున్నావో చెప్పు ‘‘
‘‘కాంపౌండ్‌ వాల్‌ గురించి అమ్మ’’

‘‘ఎందుకని మనకు కాంపౌండ్‌ వాల్‌ అవసరం రా.. మనం శ్రద్ధ గా ప్రాణం పెట్టి, ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న మొక్కలను పశువులు తిని వెయ్యకుండా చుట్టూ రక్షణ గా కాంపౌండ్‌ వాల్‌ ఉంటుందని. కాంపౌండ్‌ ఉంటే మన ఇంటికి, మన మొక్కలకి రక్షణ గా ఉంటుందని కదా నువ్వు రోజూ మీ నాన్న గారిని కాంపౌండ్‌ వాల్‌ కోసం అడుగుతున్నావు. అంతే కదా.’’
‘‘అవునమ్మా,,’’ 
కాంపౌండ్‌ వాల్‌ గురించి మాట్లాడగానే మృదులలో హుషారు వచ్చింది.
‘‘బంగారం! మన ఇంటి కి కాంపౌండ్‌ వాల్‌ ఎలా రక్షణగా నిలబడుతుందో, మన కుటుంబానికి మీ నాన్నమ్మ కాంపౌండ్‌ వాల్‌ తల్లి.’’
అర్థం కానట్లు ముఖం పెట్టిన కూతురు నుదిటి పై చిన్న ముద్దు పెట్టాను. 
‘‘మీ నాన్నమ్మ  తనకున్న జీవితానుభవంతో మన అందరినీ చక్కగా సరైన దారిలో పెట్టాలని, మన కుటుంబం ఏ ఇబ్బందులూ లేకుండా ఉండాలని తాపత్రయ పడుతోంది. ఉదయం నీ సీనియర్‌ మన ఇంటి ముందు వరకు వచ్చి వెళ్లిపోయాడు కదా. ఎందుకో తెలుసా మీ నాన్నమ్మని చూసి. ఎవరైనా సరే మనసులో చెడు ఆలోచనలు కలిగి ఉంటే అకస్మాత్తుగా పెద్ద వారు కనిపిస్తే తత్తరపడతాం. ఆ అబ్బాయి అదే పడ్డాడు. ’’

‘‘ఫోన్‌లో ఫేస్‌బుక్‌ చూస్తుంటే క్లాస్‌ చెప్పారావిడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ రంగుల వలయం లో నువ్వెక్కడ చిక్కుకుంటావేమోనన్న భయం ఆవిడది. నీకు ఫోన్‌ ఎందుకు వద్దన్నారో తెలుసా?. నీ కింకా పదహారు వచ్చింది. నీ వయస్సులో పిల్లలకి మంచి ఏదో,చెడు ఏదో స్పష్టంగా తెలియదు. అన్నీ మీకు తెలుసని, పెద్ద వాళ్ళం అయిపోయామన్న భ్రమ లో మీరు ఉంటారు. మీ టీనేజ్‌లో వయసుకు తొందరెక్కువ. ఈ వయసులో ఫోన్‌ ఇస్తే నీకు మంచి కంటే చెడు అవుతుందని మీ నాని భయం.’’
చెపుతూ మదులని చూస్తున్నాను. ఎలా రియాక్ట్‌ అవుతుందా అని. శ్రద్ధగా వింటుంది అనిపించాక మరలా మాట్లాడటం ప్రారంభించాను.

‘‘చాలా మంది పిల్లలను చూడు. టెన్త్‌ వరకు ఫస్ట్‌ క్లాస్‌లో ఉంటారు. ఇంటర్‌కు రాగానే చదువులో వెనక బడిపోతారు. కారణమేమితో తెలుసా? ఇంటర్‌కు రాగానే రెక్కలు వచ్చేశాయన్న తెలియనితనం. పేరెంట్స్‌ అయిన మేము కూడా అందుకు కొంత కారణం. టెన్త్‌ వరకు ఇంటికి లేట్‌గా వస్తే ఎక్కడికి వెళ్ళారని ఆరా తీసే మేము, పిల్లలు  కాలేజీ కి రాగానే కొద్దిగా చూసీ చూడనట్లు ఉంటాం. మేము మీకు స్వేచ్ఛ ఇచ్చామను కొంటాము.  కానీ ఆ స్వేచ్ఛ సరైన దారిలో వెళుతుందా? లేదా? అని పరిశీలన చెయ్యలేకపోతున్నాము. ఇక  సెల్‌ ఫోన్, ఇంటర్‌ నెట్‌ , సరికొత్త స్నేహాలు మీ ప్రగతి ఉపయోగపడకుండా ఇపుడుడిప్పుడే వికసిస్తున్న మీ మెదడును పాడు చేస్తున్నాయి. సాంకేతికత మీకు వికృతంగా పరిచయం అవుతుంది. నువ్వెక్కడ నీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకుంటావేమోనని నీ నాని భయం.’’

‘‘ఎందుకంటే నువ్వు మా అందరి ప్రాణం. మా ఆశలన్నీ నీ పైనే కదా. అందుకే ఎటువంటి  చెడు ఆలోచనలు, చెడు స్నేహాలు నిన్ను , నీ ఆలోచనలను పాడు చేయకుండా  నీ చుట్టూ రక్షణగా కాంపౌండ్‌ వాల్‌గా నిలబడుతున్నారావిడ.  పిల్లల స్నేహాలకు, సరదాలకు మేము అడ్డు కాదు . మీ ఆనందమే మాకు ముఖ్యం. కానీ ఆ సరదాల వలన మీ బంగారు భవిష్యత్తు పాడవుతుంటే చూస్తూ ఉరుకోలేము కదా.’’
‘‘ప్రతి ఇంటికి కాంపౌండ్‌ వాల్‌  ఎలా ఉండాలో  అలాగే ప్రతి ఇంట్లో ఒక పెద్ద వాళ్ళు ఉండాలి. వాళ్ళ జీవితానుభవాలకు, వారి సలహాలకు విలువనివ్వాలి. ఆ పెద్ద వారే అసలైన కాంపౌండ్‌ వాల్‌ ఆ కుటుంబానికి.’’
నా మాటలు వింటున్న మృదుల కళ్ళలో పశ్చాతాపం కనబడింది. వెంటనే పరుగు పరుగున వెళ్ళి, బయట మొక్కల మధ్య వాలు కుర్చీలో కూర్చొని ఉన్న తన నాన్నమ్మ దగ్గర చేరి మెడ చుట్టూ చేతులు వేస్తూ ‘‘ఐ లవ్‌ యూ నాని’’ అంది.
లోపల ఏం జరిగి ఉంటుందో  ఊహించగలగిన మా అత్తగారు చిరునవ్వుతో మృదుల నుదుటిపై ముద్దు పెట్టి ‘‘మా బంగారు  తల్లి’’ అని దీవించారు. కిల కిల నవ్వింది మా గారాల తల్లి .
- జి.వి.శ్రీనివాస్‌

మరిన్ని వార్తలు