బులుగంటే బులుగా పలావెంకారెడ్డా!

10 Jun, 2018 01:57 IST|Sakshi

ఈవారం కథ

భారతీయ కథలలో రంజాన్‌ ప్రస్తావన రాగానే అందరికీ గుర్తొచ్చే కథ ప్రేమ్‌చంద్‌ రాసిన ‘ఈద్గా’. తెలుగులో జ్వాలాముఖి రాసిన ‘ఈద్‌ కా చాంద్‌’ కథలో కూడా రంజాన్‌ ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే 
‘దర్గామిట్ట కతల్లో’ మూడు వరుస రంజాన్‌ కథలు కూడా పాఠకులను విశేషంగా అలరించాయి. వాటి నుంచి  రెండు కథలు...

యిప్పుడంటే కావలి కోర్టెదురుగ్గా పలావు సెంటరు పెట్టి ప్లేటుకు యిరవై ఆరు రూపాయలు కళ్ల చూస్తా వున్నాడుకానీ మేము పిలకాయలుగా వున్నప్పుడు పలావెంకారెడ్డి కూడా బాగా యిబ్బందులు పడినోడే!
పలావెంకారెడ్డి (పలావు+వెంకారెడ్డి) మా నాయనకు ప్రాణ స్నేహితుడు. అంతే కాదు. మా నాయన పెళ్లికి పెద్ద కూడా.మా అమ్మను మా నాయనకిచ్చి చేయాలని మా తాత మస్తాన్‌సాయిబు నిచ్చయించుకున్నాక మా నాయన ‘కాండక్టు’ను యింకెవుర్నీ అడక్కుండా నేరుగా పలావెంకారెడ్డినే అడిగినాడంట.‘ఆ పిల్లోడికేమి సామీ. బంగారం. కళ్లు మూసుకొని యిచ్చెయ్యి’ అని పలావెంకారెడ్డి బరోసా యిచ్చినాకే మా తాత కుదుట పడినాడంట.పలావెంకారెడ్డి మా నాయిన కంటే ఏడెనిమిదేళ్ల పెద్దోడు. అయినాగానీ కసరత్తు చేసిన కండలతో (ఆయన ఒకప్పుడు పయిల్వానులే), మంచి ఒంటి చాయతో, తలకురంగేసుకొని తెల్లటి గుడ్డలు కట్టుకొని కుర్రపిల్లోడాల కనిపించేవాడు.‘నిఖా’నాటికి మా అమ్మ పద్నాలుగేళ్ల చిన్నపిల్ల కాబట్టి పలావెంకారెడ్డి మా అమ్మని ‘అమ్మాయ్‌’ అని పిలిచేవాడంట. ఆ తర్వాత్తర్వాత ఆయనకి ఆ పిలుపే అలవాటయిపోయింది. మా నాయినంటే ఏమోగానీ ఆయనకు మా అమ్మంటేనే బాగా అబిమానం.సంక్రాంతి వచ్చిందంటే చాలు మా అమ్మకు యిష్టమని చెప్పి పెద్ద స్టీలు టిపిను నిండుగా అరిసెలు, మనుబూలు, లడ్లు తీసుకొచ్చి ‘తీసుకో అమ్మాయా’ అంటా యిచ్చేవాడు పలావెంకారెడ్డి. ఆనేక మా నాయిన్ని మా అన్ననీ నన్నూ యింటికి పిలచకెళ్లి, యిస్తరాకు నిండుగా పాయిసం పోసి పండగ బోజనం పెట్టేవాడు. (ఇక్కణ్ణే యింకో సత్యం కూడా చెప్పుకోవాలి. మా అమ్మ ఏ పెళ్లికీ ఏ శుబకార్యానికీ వెళ్లాలన్నా నిన్న మొన్నటిదాకా కూడా పలావెంకారెడ్డి బార్య నగో, ఆయన కోడలి నగో తెచ్చుకునేది హక్కుగా).

మేం పిలకాయలుగా వున్నప్పుడు పలావెంకారెడ్డికి యవసాయం వుండేదో లేదో నాకు తెలియదుకానీ యింట్లో మాత్రం ఎప్పుడూ బరెగొడ్లుండేవి. ఆయన బార్య తెల్లారి లేచి బర్రెగొడ్డాల కష్టపడతా వుండేది.యీ కష్టాన్ని రొంతయినా దూరం చేయాలని పలావెంకారెడ్డి రకరకాల యాపారాలు చేసినాడంట. అయితే సత్తెకాలపు మనిషి కాబట్టి డబ్బులు సంపాదించడం ఆయనకి చేతకాల. (చివరాకరికి పలావు సెంటరు పెట్టినాక ఆయన దశ తిరిగింది. అదెప్పుడైతే పెట్టినాడో అప్పుణ్ణుంచి మా వూర్లో ఆయన పేరు రేమాల వెంకారెడ్డికి బదులు పలావెంకారెడ్డిగా మారిపోయింది).మా చిన్నప్పుడు ఆయనకి ఒంగోలు బస్టాండుకాడ గుడ్డల కొట్టు వుండేది. రోజుకు మీటరు గుడ్డకైనా ఆ కొట్టు నడిచేది కాదుగానీ పలావెంకారెడ్డి, ఆయన పెద్ద కొడుకు మాత్రం టంచనుగా అందులో బేరానికి కూచోనుండే వాళ్లు.పలావెంకారెడ్డి గురించి యింత కత ఎందుకు చెప్పినానంటే రంజాను నెల వచ్చినాక ఆయనతో మాకు పని పడింది – మా అమ్మ పోడు వల్ల.‘వీదిలోని ఆడోళ్లంతా గాదంశెట్టి సుబ్బారావు కొట్టుకాడికెళ్లి కోరిన గుడ్డలు తెచ్చుకుంటా వున్నారు. నాక్కూడా రెండొందలో మూడొందలో పారేయ రాదా? నేను కూడా పిలకాయలకు గుడ్డలు తెచ్చుకోనా’ అని రంజాను నెల మొదులైన కాణ్ణుంచి మా నాయన ప్రాణం తీస్తా వుంది మా అమ్మ.మా నాయినేమో ‘ఆ’ అనడూ, ‘ఊ’ అనడూ. మా అమ్మ చూసీ చూసీ మా నాయన వాటానికి యింకిది మందు కాదని చెప్పి, న్యాక్‌గా మా నాయినమ్మను ఉసిగొలిపొదిలింది.‘రే అబయా. ఏందిరా నువ్వూ నీ బేడంగీ పనులూ. మనకు లాకపోయినా పిలకాయలకన్నా నాలుగు గుడ్డముక్కలు తేకపోతే ఎట్టా. వీదిలో కొత్త గుడ్డలేసుకున్న పిలకాయలను చూసి మన పిలకాయలు మనసు కష్టపెట్టుకోరా’ అనింది మా నాయినమ్మ.యింక మా నాయిన ఏమనుకున్నాడో ఏమోకానీ ‘సాయింత్రం పెద్దోణ్ణి, రెండోవాణ్ణి కొట్టుకాడికి పంపించండి. డబ్బులు దొరికితే అట్నే తీసిస్తా’ అని చెప్పేసి పోయినాడు.సాయింత్రానికి మా అమ్మ – నన్నూ మా అన్ననే కాకుండా మా చెల్లెల్ని కూడా రెడీ చేసి రైల్వేరోడ్డులోని మా కరెంటుషాపు కాడికి పంపించింది ఆశగా.

కానీ మా నాయిన ఎట్టాంటోడా? మేము పోయేసరికి చేతులు నెత్తిన పెట్టుకొని సప్పంగా కూచోనున్నాడు టేబులు ముందర. మమ్మల్ని చూడ్డం తోటే లేచి ‘ఇయ్యాల కాదులే. యింటికి పాండి’ అన్నాడు – మా చెల్లెల్ని ఎత్తుకొని కొట్టుకి తాళం వేయబోతా.మా ప్రాణాలు వుసూరుమన్నాయి. మా అన్నకైతే ఏడుపొక్కటే తక్కవా.సరిగ్గా అప్పుడే దేవుడిలా వచ్చినాడు పలావెంకారెడ్డి. మమ్మల్ని చూడ్డంతోటే ‘ఏందయ్యో! చిన్న నవాబులంతా కలిసొచ్చినారో’ అన్నాడు నవ్వతా.మా నాయిన కూడా నవ్వి సంగతి చెప్పినాడు. అది విని ‘పండగ గుడ్డలకి పిలకాయలొస్తే ఉత్త చేతులతో వెనక్కి తీసకెళ్లిపోతావా కరీం సాయిబా? నా కొట్టులా. పాండి పాండి’ అన్నాడు పలావెంకారెడ్డి.‘యిప్పుడొద్దులే ఎంకారెడ్డా. డబ్బులొచ్చినాక చూద్దాం’ అన్నాడు మా నాయిన మొహమాటానికి పోతా.‘మా యింట్లో కరెంటు పని చేస్తే నువు డబ్బులడుగుతావా... నీ బిడ్డలకు గుడ్డలిస్తే నేను డబ్బులడిగేదానికి’ అని బయిల్దేరదీశాడాయన. అందరం కలిసి ఒంగోలు బస్టాండుకాడున్న పలావెంకారెడ్డి గుడ్డల కొట్టుకెళ్లాం.‘కరీంసాయిబా! ఎట్టా మళ్ల తీయబోయేది లేదుకానీ తీసేదేదో దిట్టంగా తీసి. నాలుగు రోజులు పడుంటాయి’ అని కొయ్య అల్మారాలో వున్న తానుల్లో నుంచి దిట్టంగా కనిపిస్తున్న బులుగురంగు తానునొకదాన్ని బయటికి లాగినాడు పలావెంకారెడ్డి.

‘గ్యారంటీ గుడ్డ. చిరిగే కొసినే లా’ అన్నాడు.మా నాయనకు ఏమున్నా లాకపోయినా ‘గ్యారంటీ’ అనే మాట వినపడితే చాలు ‘అదే యివ్వు’ అంటాడు కాబట్టి పలావెంకారెడ్డితో కూడా ‘అదే యివ్వు’ అన్నాడు.
అంతే. పలావెంకారెడ్డి ఆ తాన్ను కోయడమైతే ఏమి, కొట్టు దిమ్మె మీదున్న దర్జీ సాయిబుకి మేమంతా కొలతలు యివ్వడమైతే ఏమి, దర్జీసాయిబు ఆ గుడ్డని తీసకెళ్లి యినపబకెట్టులో నానబెట్టడమైతే ఏమీ అంతా అయిదు నిమిషాల్లో జరిగిపోయింది. ఎట్టా గుడ్డ మిగిలింది కదా అని మా తమ్ముడికి కూడా వురామారిగా కొలతలు చెప్పి కుట్టెయ్యమన్నాడు మా నాయిన. ఆ రాత్రి ఏదో గనకార్యం చేసినట్టుగా ‘ఎంకారెడ్డి గుడ్డలిచ్చినాడు. డబ్బుల్లా ఏమీ లా’ అని మా అమ్మ దగ్గిర గొప్పలు చెప్పుకున్నాడు.మరుసటి రోజు సాయంత్రం కుట్టిన గుడ్డలు తెస్తా వుంటే మా నాయినకు తోడుగా పలావెంకారెడ్డి కూడావచ్చినాడు మా యింటికి. గుడ్డలు యింట్లోకి రాంగానే మా అమ్మ గబగబా వచ్చి, గుడ్డలన్నీ తెరిచి చూసి, యింత పొడుగున గాలి వొదిలి, గమ్మున లోపలికెళ్లిపోయింది.మా నాయినమ్మ మాత్రం మురిసిపోతా మమ్మల్నందరినీ పిలిచి వాటిని ట్రయిలుకు తొడిగింది. అవి తొడుక్కున్నాక మా అన్నా నేనూ మా చెల్లెలూ మా తమ్ముడూ అందరం పై నుంచి కింద దాకా ఫుల్లుగా బులుగంటే బులుగు!పలావెంకారెడ్డి మమ్మల్నా గుడ్డల్లో చూసి, బుగ్గలు పొంగిస్తా, తృప్తిగా తల వూపినాడు. మా నాయిన కూడా బిర్రుగా మెడ ఎగరేసి ‘అదిరినాయిలే. యింకపా’ అన్నాడు.

పలావెంకారెడ్డి లేచినాడు. మా నాయిన బయటికొచ్చి సైకిల్‌ తీయబోతా వుంటే ‘అన్నో.. మాట’ అంటా పలావెంకారెడ్డిని ఆపేసింది మా అమ్మ.సైకిల్‌ పట్టుకొని మా నాయిన, ఆయన్ని చిల్లర డబ్బులు అడగతా నేనూ బయట్నే వుండిపోయాం. కాసేపటికి పలావెంకారెడ్డి తత్తరబిత్తరగా తల గోక్కుంటా బయటికొచ్చినాడు.‘య్యో! కరీం సాయిబా! అడిగినోడికి నీకూ బుద్దిలా. యిచ్చినోడికి నాకు బుద్దిలా. నలుగురికీ నాలుగు రకాల తాన్లు కోపిచ్చుంటే పోయుండేది కదా. యిప్పుడు నీ భార్య చూడు. యిస్తే యిచ్చినావుగాని ఎంకారెడ్డనా మరీ అన్యాలంగా బులుగంటే బులుగా అని అడగతా వుంది’ అన్నాడు నవ్వతా.మా అమ్మ అట్టా మాట్లాడద్దని ఊహించని మా నాయిన నోరెళ్ల పెట్టినాడు.‘‘అంతేకాదయ్యా. ‘మా యింటాయనకు పని తెలిసినా లాబంలా. నీకు యాపారం తెలియకపోయినా లాబంలా. యిద్దరూ యిద్దరే. రూపాయి జవురుకొని రారు. నెత్తిన చెయ్యి పెట్టడం నేర్చుకోరు. మీ యింట్లో యీ మనిషి పని చేస్తాడు. నువ్వేమో అందుకు బదులుగా గుడ్డలిస్తావు. యిట్టా చెల్లుకు చెల్లు బేరాలు చేసుకుంటా వుంటే మీరెప్పుటికి బాగుపడతారు నాయినలారా! యికనైనా న్యాక్‌ నేర్చుకొని మీ పెళ్లాం బిడ్డల్ని సుకపెట్టండి తండ్రులారా’ అని బుద్దులు చెప్పిందయ్యా ఆ బుజ్జమ్మా’’ అన్నాడు బక్తిగా. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా