ఇస్లాంలో యేసు

20 Dec, 2015 00:04 IST|Sakshi
ఇస్లాంలో యేసు

మానవజాతికి సన్మార్గం చూపడానికి దైవం అనేకమంది దైవప్రవక్తల్ని ప్రభవింపజేశారు. ఎన్నో దైవగ్రంథాలను అవతరింపజేశారు. ఉదాహరణకు పవిత్ర ఖురాన్ గ్రంథంలోని కొంతమంది ప్రవక్తల పేర్లు గమనించండి.
 1. ఆదం అలైహిస్సలాం (ఆదాము) 2. ఇబ్ర హీం (అ) అబ్రాహాము 3. ఇస్మాయీల్ (ఇస్మాయేలు) 4. ఇస్‌హాఖ్ (ఇస్సాకు) 5. నూహ్ (నోవా) 6. ఇద్రీస్ (హానోక్) 7. లూత్ (లోతు) 8. యాఖూబ్ (యాకోబు) 9. యూసుఫ్ (యోసేపు) 10. అయ్యూబ్ (యోబు) 11. యూనుస్ (యోనా) 12. ఇలియాస్ (ఏలియా) 13. దావూద్ (దావీదు) 14. జక్‌రియా (జకర్యా) 15. అల్ ఎసా (ఎలీషా) 16. మూసా (మోషె) 17. ఈసా (ఏసు) 18. ముహమ్మద్ (స)
 
వీరందరిపై దేవుని శాంతి, కారుణ్యం వర్షించుగాక: అలాగే తౌరాత్, జబూర్, ఇన్సీల్ (బైబిల్) ఖురాన్... దైవగ్రంథాలు... మరెన్నో సహీఫాలు. సృష్టికర్త ఈ విధంగా దైవప్రవక్తల్ని, గ్రంథాలను అవతరింపజేసిన అసలు ఉద్దేశ్యం... మానవాళికి సన్మార్గ పథాన్ని అవగతం చేయడం, స్వర్గమార్గాన్ని సుస్పష్టంగా తెలియజేయడం. సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను, మంచీ చెడులను విడమరచి వారిని శాశ్వత సాఫల్యానికి అర్హులుగా చేయడం.
 
నిజానికి ప్రారంభంలో మానవులంతా ఒకే ధర్మాన్ని అనుసరిస్తూ, ఒకే మార్గాన నడుస్తూ ఉండేవారు. ఆ తరువాత వారిలో వారికి విభేదాలు వచ్చాయి. అప్పుడు దైవం వారి వద్దకు శుభవార్తలు తెలియజేసే (సన్మార్గ దర్శకులను) పంపుతూ వచ్చాడు. ‘సత్యం’ గురించి ప్రజల్లో వచ్చిన విభేదాలను పరిష్కరించడానికి ఆయన ప్రవక్తలపై సత్యపూరిత గ్రంథాలను కూడా అవతరింపజేశాడు (2-212).
 
ఇందులో భాగంగానే ఈసా ప్రవక్తను కూడా ఆయన పంపాడు. ఆయనపై ఇన్జీల్ (బైబిల్ ) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈసా (అ) గొప్ప దైవప్రవక్త. ఆయన పవిత్ర జననం గురించి పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది.
 ‘‘అప్పుడు దైవదూతలు మర్యంతో... (ఈసా ప్రవక్త మాతృమూర్తి) మర్యం! దైవం నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచాడు. యావత్ ప్రపంచ మహిళల్లో నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, తన సేవకోసం నియమించుకున్నాడు. కనుక మర్యం! నువ్వు ఇక నీ ప్రభువుకు విధేయురాలివై ఉండు. ఆయన దివ్య సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. మోకరిల్లే వారితో నువ్వు కూడా వినమ్రంగా తలవంచి ప్రార్థన చెయ్యి.’
 
‘మర్యం! దేవుడు నీకు తన వైపు నుండి ఒక వాణికి సంబంధించిన శుభవార్త అందజేస్తున్నాడు. అతని పేరు మర్యం కుమారుడైన ఈసా మసీహా. అతను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ గౌరవనీయుడవుతాడు. దైవసాన్నిధ్యం పొందిన వారిలో ఒకడవుతాడు. అంతేకాదు, తల్లి ఒడిలో ఉన్నప్పుడూ, తరువాత పెరిగి పెద్దవాడైనప్పుడూ, అతను ప్రజలతో మాట్లాడతాడు. ఒక సత్‌పురుషుడిగా వర్థిల్లుతాడు.’
 మర్యం ఈ మాటలు విని కంగారు పడుతూ ‘ప్రభూ! నాకు పిల్లాడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ పురుషుడూ తాకనైనా తాకలేదే!’ అన్నది.
 
‘ఇది అలాగే జరిగి తీరుతుంది. దైవం తాను తలచిన దాన్ని చేయగలడు. ఆయన ఒక పని చేయాలనుకున్నప్పుడు ‘అయిపో’ అంటే చాలు. అది వెంటనే అయిపో తుంది. దైవం అతనికి (మర్యం కుమారు డైన యేసుకు) గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్, ఇన్‌జీల్ గ్రంథాల జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు’’ అన్నారు దైవదూతలు. (పవిత్ర ఖురాన్ - 3 - 42, 48)
 
తరువాత దైవం అతన్ని (యేసును) తన ప్రవక్తగా నియమించి ఇస్రాయీల్ సంతతి ప్రజల వద్దకు పంపిస్తాడు. అతను దైవసందేశ హరునిగా వారి వద్దకు వెళ్లి ఇలా అంటాడు...‘‘నేను మీ ప్రభువు వద్దనుండి మీకోసం కొన్ని సూచనలు తెచ్చాను. ఇప్పుడు మీ ముందు మట్టితో పక్షి ఆకారం గల బొమ్మను చేసి అందులో (గాలి) ఊదుతాను. అది దైవాజ్ఞతో సజీవ పక్షిగా మారిపోతుంది. నేను దేవుని ఆజ్ఞతో పుట్టుగుడ్డికి చూపును ప్రసాదిస్తాను.

కుష్టురోగికి స్వస్థతనిస్తాను. మృతుల్ని కూడా బతికిస్తాను. మీరు ఏమేమి తింటారో, మీ ఇళ్లలో ఏమేమి నిల్వ చేసి ఉంచుకుంటారో అంతా మీకు తెలియజేస్తాను. మీరు విశ్వసించేవారైతే, ఇందులో మీకు గొప్ప గొప్ప నిదర్శనాలున్నాయి (3-49).
 ఈ విధంగా దైవం ఈసా (అ) అంటే క్రీస్తు మహనీయులవారి ద్వారా అద్భుతాలు చేయించాడు. మహిమలు చూపించాడు. తద్వారానైనా ప్రజలు తనను శుద్ధంగా విశ్వసించి, సదాచరణలు ఆచరించి, సమాజ సంక్షేమానికి పాటుపడుతూ, సాఫల్యం పొందుతారని, ఎందుకంటే అసలు ఆరాధ్యుడు ఏకైక దైవం మాత్రమే. ఆయన తప్ప మరొక దైవం లేడు.

ఆయన నిత్య సజీవుడు, ఎప్పటికీ నిద్రించనివాడు. కనీసం కునుకుపాట్లు కూడా పడనివాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అనుమతి లేకుండా ఆయన సన్నిధిలో ఎవరూ సిఫారసు చేయలేరు. వారి (కళ్ల) ముందున్నదేమిటో, వారికి కనపడకుండా గుప్తంగా ఉన్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. ఆయన తలచుకుంటే తప్ప, ఆయనకున్న జ్ఞానసంపదలోని ఏ విషయమూ ఎవరికీ తెలియదు. ఆయన రాజ్యాధికారం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. వాటి రక్షణ ఆయనకు ఏ మాత్రం కష్టమైన పని కాదు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు.
 
మానవులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. కరుణామయుడు, కృపాసాగరుడు అయిన ఆ దైవం తప్ప మీకు మరో దేవుడు లేనే లేడు. భూమ్యాకాశాల సృజనలో, రేయింబవళ్ల చక్రభ్రమణంలో, సముద్రాలలో పయనిస్తూ, మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో, దేవుడు పైనుండి కురిపించే వర్షపు నీటిలో - తద్వారా ఆయన మృతి భూమికి ప్రాణ ం పోసే (చెట్లూ చేమల్ని పచ్చదనం చేసే పనిలో) పుడమిపై పలు విధాల జీవరాశుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి నైపుణ్యంలో వాయువుల సంచారంలో.

నేలకు నింగికి మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘమాలికల్లో బుద్ధిజీవులకు అసంఖ్యాక నిదర్శనాలున్నాయి. (2.163-164).
 ఈ విధంగా సృష్టికర్త అయిన దైవం మానవుల మార్గదర్శనం కోసం, వారి ఇహ పర సాఫల్యాల కోసం అనేక ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లలో భాగమే ప్రవక్తల ప్రభవన. గ్రంథాల అవతరణ. దైవాదేశాల ప్రకారం, దైవప్రవక్తల, దైవగ్రంథాల మార్గదర్శకంలో, ఎలాంటి హెచ్చు తగ్గులకు, అతిశయాలకు తావు లేకుండా నడుచుకుంటే తప్పకుండా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. అమర సుఖాల శాశ్వత స్వర్గసీమను సొంతం చేసుకోవచ్చు.         
- ఎండీ ఉస్మాన్‌ఖాన్

మరిన్ని వార్తలు