ఒక్క రాత్రి కోసం 

18 Feb, 2018 00:52 IST|Sakshi

కథా ప్రపంచం

ఎవరో సంగీతకారుడు ఎడతెగకుండా ఒకే స్వరం వాయిస్తున్నట్టు మానిటర్ల బీప్‌ బీప్‌ శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ శబ్దం వినసొంపుగా ప్రాణానికి చాలా హాయిగా ఉంది. మంచం పక్కనే కాపలాదారుల్లాంటి యంత్రాలు, వాటినుంచి బయటకు వచ్చిన లెక్కకు మించిన వైర్లు, స్ట్రాపులు మంచం మీద శరీరాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. అవి బాకాల్లా చేస్తున్న తూతూమనే చప్పుడు కూడా వినిపిస్తోంది. నాకిక్కడ ఉండాలని లేదు. కానీ ఉన్నాను. పక్క గదిలోంచి నవ్వులు వినిపించాయి. తాతగారు కోలుకున్నారని కుటుంబ సభ్యులంతా కేరింతలు కొడుతున్నారేమో? అయ్యుండచ్చు. వాళ్ళందరికీ అనారోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారి ఆనందం నా వేదనకి పూర్తి వ్యతిరేకం. నేనున్న ఈ గదిలో కోలుకోవటం అనేది ఉండదు. మూత్రం, ఫినాయిల్‌ వాసనలు చావుకి దగ్గర వాసనల్లా అనిపిస్తున్నాయి. పావురం గూటిలాంటి ఈ ఇరుకు గదిలో వాడిపోతున్న పూలు పరిసరాల్లాగే చావుని తలపిస్తున్నాయి. వాటిని విదిలించి కొట్టాను. నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి జీవం లేని పూలు! దయనీయమైన అవిటి స్థితిలో నేలమీద పరుచుకున్న వాటిని చూసి పరిహాసంగా నవ్వాను. నవ్వుతో పాటే వచ్చిన హుంకారం గొంతుకడ్డం పడి లోపల్నించీ కుళ్ళిన పైత్యరసం తన్నుకొచ్చింది. అది నా గొంతుని కాల్చేసి వంద హాంగోవర్ల అనుభూతిని రగిల్చి నోరంతా వ్యాపించింది.

ఇక్కడ – నాకు ఉండాలని లేని ఈ స్థలంలో – ఎంత సేపట్నుంచీ ఉన్నానో తెలియడం లేదు. చావు చాలా చంచలమైన గుణం కలవాడు. వాడి కాల ప్రమాణం వేరు. దానికనుగుణంగా మాత్రమే పని చేస్తాడు. మనుషుల్ని చంపెయ్యడమే పని అయినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు చేయచ్చు కదా!గిన్నెలోంచి ఒక ద్రాక్ష పండు చేతిలోకి తీసుకున్నాను. అది రంగు మారిపోయి కొంచెం వత్తితే చాలు రసం వచ్చేట్టు మెత్తగా కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. గదిలోని వేడి ఇప్పుడు తెలుస్తోంది. పూలు పళ్ళు వాడిపోయాయంటే పోవూ మరి? మా అక్క వాటినిక్కడకు తెచ్చి రెండు రోజులే అయింది. అక్క చాలా మంచిది. ‘‘ఈ రాత్రికి నువ్వు విశ్రాంతి తీసుకో’’ అని నేనే పట్టుబట్టి పంపించేశాను. రోజూ ఆస్పత్రికి రావటం వల్ల తను ఏరోబిక్స్‌ తరగతులకు వెళ్లలేకపోతోంది. ‘ఈ రోజుల్లో ఎవరికీ మంచి మనసు లేదు’ అనే ఫెర్గల్‌ షార్కీ పాట పాడాను తనకోసం. ఇందులోని జోక్‌ అర్థమైందో లేదో గానీ ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని అక్క మెచ్చుకుంటున్నట్టే అనిపించింది.

పార్శ్వపు తలనొప్పి వచ్చేలా ఉంది. వెలుతురుని భరించలేక మంచం మీదున్న రిమోట్‌ తీసుకొని దీపకాంతి తగ్గించాను. నాకు ఒత్తిడి శత్రువు. గదిలో పైకప్పు మీద ఓ చిన్న ఎల్‌ఈడీ దీపం ఎర్రగా వెలుగుతోంది. నన్ను చూసి అది మిణుకు మిణుకుమంది. నేనూ దాన్ని చూసి రెప్పలు కొట్టాను. అలా మాట్లాడుకున్నాక, నాకు దాని మీద చాలా ఈర‡్ష్య కలిగింది. ఈ దీపం జీవితం ఏ కష్టాలు సమస్యలూ లేకుండా ఎంత హాయిగా గడిచిపోతోంది?! దాని ఆయువులో సగం కూడా ఏ మనిషీ బతకలేడేమో. చిన్నదైనా ఎంతో ముఖ్యమైనది అనిపించేలా ఉంది దాని వాలకం. దయలేని దాని దర్జా బతుకులో నేను కోరుకున్నవన్నీ ఉన్నాయి – కష్టాలు లేని దీర్ఘాయుష్షు, సమస్యలు లేని సుదీర్ఘ జీవితం. చేతిలోని ద్రాక్ష దాని మీదకు విసిరేశాను. దానికీ నాకూ స్నేహం లేదిక. హఠాత్తుగా జానీ క్యాష్‌ పాడిన ‘ఇరవై ఐదు నిమిషాలు’ అనే పాట కూనిరాగాలు తీయడం మొదలు పెట్టాను. ఒక ఖైదీ ఉరికంబం ఎక్కే ఇరవై ఐదు నిమిషాల ముందు నుంచీ ఏమి జరుగుతుందో పాడాడు క్యాష్‌. చివర్లో ఉరితాడుకి వేలాడుతున్న ఖైదీని తాడుతో సహా ఒక గద్ద తన్నుకుపోతుంది. నా పరిస్థితికీ పాట అసందర్భంగా లేదూ? పక్క గదిలోంచి నవ్వులు నా పాటను ఆపేశాయి. నిజంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఆ తాత నిజంగానే డిశ్చార్జి అయి వెళ్ళిపోతున్నాడేమో. లేకుంటే నర్సు ఆయనకి  మంచంలోనే స్నానం చేయిస్తూ కుటుంబమంతా నవ్వటానికి ఏదో కారణం కనుక్కున్నట్టుంది.

ఈ ఆలోచన నా బాల్య స్మృతులను తట్టి లేపింది. చెత్త కుప్పలో పారేసిన పాత చెప్పుల్లా వాటిని ఎప్పుడో వదిలించుకున్నా పరుగున వచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా తండ్రి నాకు భిక్షగా ప్రసాదించిన దూషణ తిట్లు, దెబ్బలు, హింస గుర్తొచ్చాయి. నా తల్లి ఆయన్నే సమర్థిస్తూ నాకు నచ్చచెప్పడానికి  చూసేది. ‘‘ఆయన ఒక శాసకుడు. నీకు అంతా మంచి జరగాలనే, నువ్వు అన్నిట్లోనూ ముందుండాలనే ఆయన ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు’’ అని పదే పదే చెప్తుండేది. అంతా మంచి జరగటం అంటే దెబ్బలకి కమిలిపోయిన కళ్ళు నొప్పెట్టడం, చీకటంటే భయం కలగటం అయితే కచ్చితంగా నా తండ్రి క్రమశిక్షణలో కృతకృత్యుడయ్యాడు.

ఉన్నట్టుండి నా ఆలోచనలకు కళ్ళెం పడింది. రోగి గుండె కొట్టుకోవటం ఆగిపోయినప్పుడు యంత్రం చేసే కీచుమనే చప్పుడు నా తపస్సుని భంగం చేసింది. చటుక్కున తలతిప్పి నా పక్కనున్న మానిటర్ని చూశాను. ఈ మానిటర్‌ కాదు. అంత అదృష్టం కూడానా? ఇక్కడ నేనుండటం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతోంది. గాజు తలుపులోంచి బయటకు చూశాను. నర్సులంతా ఎక్కడికో హడావుడిగా పరిగెత్తుతున్నారు. ఇంకెక్కడికి? డిశ్చార్జ్‌ అవుతున్న ఆ ముసలి తొక్కుగాడి దగ్గరికే. వాడికి పెట్టిన వైర్లన్నీ పీకేశారు. అందుకే ఆ చప్పుడు. కులుక్కుంటూ ఇంటికెళ్ళడానికి తయారయ్యాడు. కొడుకు కాబోలు తలుపు దగ్గరికి నడిపించుకుంటూ వచ్చాడు. ఇద్దరూ నవ్వుతున్నారు. కొడుకు తండ్రి ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు చాలా సంతోషంగా, సుఖంగా ఉన్నారు. దొంగ నా కొడుకులు. శాపనార్థాలు పెడుతూ వాళ్ళని శాశ్వతంగా ద్వేషిస్తానని అప్పటికప్పుడే అక్కడిక్కడే శపథం చేసుకున్నాను. నాకు తెలుసు నా తండ్రిని ఎప్పటికీ అలా పట్టుకోలేనని.

మళ్ళీ తండ్రి గురించిన ఆలోచనలు. శారీరక హింస కన్నా మానసిక హింస చాలా భయానకం. ఒంటి మీది గాయాలు మానిపోతై. పగిలిన మనసు అతుక్కుంటుందా? నల్ల జాతీయుణ్ణి డేట్‌ చేస్తున్నానని చెప్పినప్పుడు నన్ను కోమాలోకి జారిపోయేట్టు కొట్టాడు. అయినా నేను ఆయన మీద పరువు నష్టం దావా వేశానా? పోలీసులకి చెప్పి బొక్కలోకి తోయించానా? అప్పట్నుంచీ మా మధ్య మాటలు తక్కువయ్యాయి, అంతే! అయినా, నా తప్పు లేకుండా చాలాసార్లు మాట్లాడిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా పోయిన నెల ఆయనకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినప్పటి నుండి. కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేయటం వల్లో పశ్చాత్తా్తపం కట్టి కుదిపెయ్యటం వల్లో తేలు కుట్టిన దొంగలా ఆయనే జవాబివ్వలేదు.

ఆ ముసలి వాడి కుటుంబం వెళ్ళిపోయినట్టున్నారు. బయట నిశ్శబ్దంగా ఉంది. బీప్‌ శబ్దం, నా ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి ఈ నిర్బంధ ప్రదేశంలో. ఇంకో గంటవరకూ నర్సులెవరూ ఇటువైపు రారని నాకు తెలుసు. వాళ్ళు వచ్చినా పక్క తడిసిందా, బీపులు వినిపిస్తున్నాయా అని మాత్రమే చూస్తారు. అచేతనంగా నిశ్చలంగా కూర్చున్నాను, గత కొన్ని వారాల నుంచి ప్రతి రాత్రి కూర్చున్నట్టే. ఇంకా ఇలాగే కొనసాగే ఓపికుందా నాకు? లేమ్మా, నువ్వే పూనుకుని ఏదైనా చెయ్యాలి అని నన్ను నేనే బతిమాలుకున్నాను. చావు వాడంతట వాడు రాడు. వాడు – కాదు కాదు, వాళ్ళు– చావు, నా తండ్రి – ఇద్దరూ నా బలహీనతల్ని ఎగతాళి చేస్తారు. నేను ఈ విషయంలో చాలా గట్టిగా ఉండాలి. ఎందుకీ ఎదురు చూపు? అనుమతి కోసమా? ఎవరున్నారు అవుననడానికి కాదనడానికి? ఇక్కడ నేనూ ఈ యంత్రపు సూదీ తప్ప ఎవరూ లేరు. నేనే సర్వాధికారిని. చావు నన్ను కొరుక్కు తిననీ. వాడికన్నా నేనే బాగా చేయగలను. వాడుత్త కల్పన! మనుషుల మరణం మీద వాడికసలు పట్టు ఉందా? లేదు అంటున్నాను బల్ల గుద్ది! ఇక నేనే ఆధిపత్య కళ్ళాలు తీసుకుంటున్నా. విధి దుష్ట హస్తాన్ని నేనే అవుతా ఈ రాత్రికి.

అత్యంత దయనీయంగా పడుకొని ఉన్న ఆయన్ని చూశాను. హార్ట్‌ ఎటాక్‌ తర్వాత మనిషి చాలా పీక్కుపోయాడు. ఇక ఎందుకూ పనికిరాడు. పనెక్కువ జీతాలు తక్కువ అయినా దేవదూతల్లాంటి ఈ ఆస్పత్రి నర్సుల వల్ల, హాస్పిటల్‌ వాళ్ళిచ్చే టీఎల్‌సీ ఆహారం వల్లా, కంప్యూటర్‌ యంత్రాల వల్లా ఆయనింకా బతికున్నాడు. ఆయన చేతి మీద చొక్కాగుడ్డ ఎత్తాను. ఇంజక్షన్‌ చేయటానికి వీలుగా సిరంజిలో కడ్డీని నెమ్మదిగా పళ్ళతో పట్టి బయటకు లాగాను. దాన్ని నోట్లోనే చప్పరించాను. చిన్న కరెంట్‌ షాక్‌ కొట్టింది. చాల జాగ్రత్తగా, నెమ్మదిగా సూదిని సెలైన్‌ ఎక్కుతున్న నరంలోకి గుచ్చాను. డెమెరాల్‌ పని చేయటం మొదలుపెడుతుంది. ఓ గంటలో చనిపోతాడు. హార్ట్‌ ఎటాక్‌ పేషెంట్‌ హార్ట్‌ ఎటాక్‌తో పోతే ఇంకా అనుమానాలేముంటాయి? పోస్ట్‌మార్టం కూడా ఉండదు. పర్ఫెక్ట్‌ మర్డర్‌. ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకోవడానికి వంగినప్పుడు నా కన్నీటి చుక్క రాలిపడింది. ‘‘గుడ్‌ బై నాన్నా’’ అన్నాను.ఆస్పత్రి క్యాంటీన్‌ వైపు నడిచాను కాఫీ కోసం. ఎలాగూ ఓ గంటలో మళ్ళీ రావాలిగా. ఈ లోపు కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్లి రావటం దండగ. నా నిరీక్షణ ఫలించబోతోంది. ఇక్కడ కొచ్చినందుకు సంతోషంగా ఉంది. 
  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సులువైన వంటకాలు.. అదిరిపోయే రుచులు

పిచ్చుక చేతికి బంగారు పంట..

రారా కృష్ణయ్య..!

విరాజ్‌పేట్‌ లిల్లీ!

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ..!

తేనెటీగలు అంతరిస్తే..?

ఈ దొంగేట్రం పక్కోళ్ల కొంప ముంచింది

విప్లవ విద్యార్థి

మాయన్నగాడు నన్ను పిలవకపోతాడా..!

ఇలా చేసి చూడండి..

డాక్టర్ల కిడ్నీలు, కళ్లు పీకేసింది ఎవరు..?

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ

చందా అడగటమంటే భిక్షమడగటమే కదా!

వేట మొదలైంది..

ఆ సమస్య ఉంటే... గర్భం దాల్చవచ్చా?

‘మా నాన్నని నేనే చంపాను’

టారో వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

దేవతలు పంపిన రాయబారి!

మానవుడిగా పుట్టి... మహనీయుడై

నా పాలి వేదం అన్నయ్య పలుకు

బ్రెయిడ్‌ బ్యాండ్‌ స్టైల్‌

చారులత వాళ్ల అమ్మ

అప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు!

పే...ద్ద దోశ !

ఆ కొండలు చూసిన కొత్త సూర్యోదయం

మనిషి – మనీషి 

 టారో వారఫలాలు( 11 ఆగస్టు నుంచి  17 ఆగస్టు, 2019 వరకు)

వారఫలాలు (11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు 2019 వరకు)

ఈ టైమ్‌లో వాడితే సైడ్‌ఎఫెక్ట్సా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..