హృదయం: మళ్లీ పెళ్లి..!

22 Mar, 2014 23:31 IST|Sakshi
హృదయం: మళ్లీ పెళ్లి..!

పెళ్లి ప్రాధాన్యత గురించి చెప్పే సమయంలో ‘‘వయసులో ఉన్నప్పుడు పర్లేదు కాని వయసైపోయాక, ఒక తోడు అవసరం తెలుస్తుంది’’ అంటారు. ఈ మాట అక్షరాలా నిజం అంటున్నారు సీనియర్ సిటిజన్స్. వేర్వేరు కారణాల వల్ల జీవిత భాగస్వామి దూరమై, బిజీ బిజీగా గడిపే పిల్లలకు చేరువ కాలేక... తోడొకరుండిన అదే భాగ్యమూ అనుకుంటున్న పెద్దలు... తలపండిన వయసులో పెళ్లిళ్లకు సై అంటున్నారు.  ఆ భాగ్యం కోసం అవసరమైతే కంటికిరెప్పల్లా పెంచుకున్న పిల్లలను సైతం ఎదిరిస్తున్నారు. ఈ రెండు కధనాలే దీనికి నిదర్శనం...
 
 తోడొకరుండిన అదే భాగ్యమూ.... ఆరోగ్యమూ...  ‘‘ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏంటో నాకు, నా ఆర్థిక పరిస్థితి ఏంటో ఆయనకు తెలియదు’ అన్నారు రాజేశ్వరి. విజయవాడ, స్టెల్లా కాలేజీ దగ్గర తన ప్రస్తుత భర్త కోటేశ్వరరావుతో కలిసి నివసిస్తున్నారామె. వ్యవసాయ నేపథ్యం గల కోటేశ్వరరావు(75) ఆరేళ్ల క్రితం భార్యను కోల్పోయారు. మరోవైపు పిల్లలు కూడా లేకపోవడంతో మరింత ఒంటరి అయ్యారు. ఈ పరిస్థితిలో ఆయనకు రాజేశ్వరి (61) పరిచయం అయ్యారు. ఇరువురి అంగీకారంతో గత ఏడాది కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
 
 ముగ్గురు పిల్లలున్న రాజేశ్వరి 30 ఏళ్ల క్రితం భర్తను పోగొట్టుకున్నా పిల్లలను చక్కగా పెంచి జీవితంలో స్థిరపడేలా చేశారు. అనంతరం అకస్మాత్తుగా ఆవరించిన ఒంటరితనాన్ని ఆమె కోటేశ్వరరావు పరిచయంతో దూరం చేసుకోగలిగారు. ‘‘నా బాగోగులు చూసుకునేందుకు నా కంట్లో ఐ డ్రాప్ వేసేందుకు ఓ సహచరి ఉంది’ అని కోటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేస్తుంటే, ‘‘నేను ఏ గుడికి వెళ్లాలన్నా, పేరంటానికి వెళ్లాలన్నా ఓ తోడున్నార’’ని రాజేశ్వరి సంబరంగా చెబుతున్నారు.
 
 మన సమాజంలోకి అనూహ్యంగా చొచ్చుకుపోతూ... ‘మలి దశలో మనువు’ అనే సరికొత్త పంథా... రాన్రానూ ఓ సంప్రదాయంలా స్థిరపడుతోంది.  జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి... ఓ చిన్న ఓదార్పు కోసం, ఓ మనసైన తోడు కోసం పరితపిస్తున్న పెద్దల చివరి మజిలీలోని ‘చిన్ని చిన్ని’ఆశల్ని తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు నవతరం మీద ఉందనేది నిజం.
 
 మనకు తోడు అత్యవసరమైన వయసులో జీవితభాగస్వామి దూరం కావడం చాలా క్షోభకు గురిచేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకటి కావడం ద్వారా ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడం ఇరు జీవితాలకే కాదు వారి కుటుంబాలకు కూడా మేలు చేస్తుంది. అందుకే పెద్ద వయసు పెళ్ళిళ్లను ప్రోత్సహించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. మరిన్ని వివరాలు కావల్సిన వారు ఫోన్: 8106367014లో సంప్రదించండి లేదా... తోడునీడ వెబ్‌సైట్లో చూడవచ్చు.
 - రాజేశ్వరి, తోడునీడ
 
 పెళ్లాడదామా? పిల్లల్ని అడిగి చెబుతా...

 ఒకప్పుడు ఇది పెద్ద జోక్. అయితే ఇప్పుడు ‘నిఖా’ర్సయిన నిజం. మలిదశలో మనువు కోరుకుంటున్న వారికి పిల్లల అంగీకారం అత్యవసరంగా మారుతోంది. చాలా మంది పిల్లల అభీష్టానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోలేక తమ ఇష్టాలను చంపుకుంటుంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈశ్వరరావు (65), కుమారి (60) (పేర్లు మార్చాం) మాత్రం ‘పిల్లల్ని’ ఎదిరించారు. అదెలా అంటే...
 
 ఎనిమిదేళ్ల క్రితం భార్యను కోల్పోయిన ఈశ్వరరావు, భర్త మరణంతో ముగ్గురు పిల్లల్ని పోషించలేక తంటాలు పడుతున్న కుమారి తోడు నీడ అనే వృద్ధుల సేవా సంస్థ ద్వారా తొలిసారి కలిశారు. మొదటిచూపులోనే  ఈశ్వరరావుకు కుమారి నచ్చేశారు. ‘‘నిన్నే పెళ్లాడుతా’’నన్నారు. అందుకామె ‘‘పిల్లల్నడిగి చెబుతా’’ అన్నారు. ఇక్కడి వరకూ బానే ఉంది. దీనికి ఈశ్వరరావు కుటుంబం నుంచి ఏ అభ్యంతరం రాలేదు కాని కుమారి పిల్లలు ఒప్పుకోం అన్నారు. నిరుద్యోగిగా ఉన్న ఓ కొడుకైతే... ఇకపై అలాంటి సంస్థల దగ్గరకు వెళితే ఊరుకోనంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే కుమారిని మనసా వాచా ఇష్టపడిన ఈశ్వరరావు... ఆమెని ఇంట్లో నుంచి తీసుకువచ్చి గుడిలో పెళ్లి చేసేసుకున్నారు. తన ఇంటికి తెచ్చేసుకున్నారు.
 
 ఇది తెలుసుకున్న ఆమె కొడుకు  ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈశ్వరరావును కొట్టి, తల్లిని తనతో పాటు తన ఇంటికి తీసుకుపోయాడు. అంతే కాదు తను బయటకు వెళ్లేటప్పుడు చెల్లిని తల్లికి కాపలా పెట్టాడు. అయితే  ఈశ్వరరావు, కుమారి  ఈసారి ఎవరికీ తెలీని మారుమూల ప్రాంతంలో సంసారం మొదలెట్టారు. తల్లి జాడ తెలియకపోవడంతో... కాస్త దిగొచ్చిన ఆ కొడుకు ‘తోడు నీడ’ సహాయంతో రాజీకి సిద్ధమయ్యాడు.  చివరకు...కుమారి కొడుకు జీవితంలో స్థిరపడేలా చూస్తాననీ, ఆమె కూతురి పెళ్లి చేస్తానని ఈశ్వరరావు మాట ఇచ్చి ఆమె కొడుకును ఒప్పించారు. ఆ తర్వాత ఇచ్చిన మాటను  నిలబెట్టుకున్నారు కూడా. నాలుగేళ్ల వయసున్న వీరి కాపురం ఇప్పుడు ఆనందంగా సాగిపోతోంది.
 - ఎస్.సత్యబాబు, ఫొటో: కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు