వర్ణం: డాన్స్ రోబో డాన్స్! | Sakshi
Sakshi News home page

వర్ణం: డాన్స్ రోబో డాన్స్!

Published Sun, Mar 23 2014 2:00 AM

వర్ణం: డాన్స్ రోబో డాన్స్!

జర్మనీలో జరిగిన ‘సెబిట్’ టెక్నాలజీ ట్రేడ్ ఫెయిర్ విశేషాల్ని ఇలా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తలు, వందలకొద్దీ కాన్ఫరెన్సులు, మిలియన్ యూరోల ఒప్పందాలు! వాటిల్లో సోషల్ బిజినెస్ ఎరీనా, ఎకోసిస్టమ్ ఆఫ్ సైబర్‌జంగిల్‌లాంటి దొర్లిపోయే మాటలు! వీటన్నింట్లోకీ ఆసక్తికరం ఈ రోబోలు! ఫెయిర్ పేరుకు తగ్గట్టుగా రూపొందించిన ఇవి పోలో డాన్స్ చేస్తూ ఆహుతులను ఉత్సాహపరిచాయి. వేడివేడి చర్చల్లో ఈమాత్రం ఆటవిడుపు లేకపోతే ఎలా!
 
 ‘పెద్దల’ పండగ
 ఈ పిల్లలకూ బుద్ధుడికీ ఉన్న సంబంధం వీళ్లు బౌద్ధులు కావడం ఒక్కటే కాదు! వీళ్లు గౌతముడి శాక్య తెగకు చెందినవారు కూడా! ఇక్కడి సందర్భం: నేపాల్‌లోని కొన్ని కొండప్రాంతాల ప్రజలు కౌమారంలోకి అడిగిడుతున్న తమ పిల్లలకు జరిపే ‘వ్రతబంధ’ వేడుక ఇది. వాళ్లకు శుభ్రంగా బోడిగుండు చేసి, సాధువు బట్టలు కట్టి ముద్దుచేస్తారు. మనదగ్గర పంచలు కట్టించరూ, అలా! ఫొటోలోని పసివాళ్లకు వయసు ఏమీరాలేదులేగానీ, ఆచారం ఆచారమేగా!
 
 చివరికి రొట్టె ముఖ్యం...
 ఈ పాలస్తీనా పెద్దమ్మ ఏం చేస్తోంది? తమ దేశానికి ఇజ్రాయిల్‌తో ఎన్ని సమస్యలైనా ఉండనీ! అదే ఇజ్రాయిల్‌కు మిత్రుడైన అమెరికాతో ఏ అరబ్ దేశమైనా అంటకాగనీ! ఈ వ్యవహారాలన్నీ రాజకీయనాయకులకు వదిలేసి... పనిలోకి పోయి ఆకలితో ఆవురావురమంటూ ఇల్లుచేరే తన కొడుకుల కోసం అరబ్ వంటకం ‘మఫ్తోల్’ సిద్ధం చేస్తోంది. ఇంకా కోడికూర తయారుకావాల్సి ఉంది! అతిథిగా మననీ పిలిస్తే బాగుణ్ను!

Advertisement
Advertisement