కాపీ చేశారు... పేస్ట్ చేయడంలో ఫెయిలయ్యారు!

13 Dec, 2015 11:53 IST|Sakshi
కాపీ చేశారు... పేస్ట్ చేయడంలో ఫెయిలయ్యారు!

ఆ సీన్ - ఈ సీన్
ఒక రకంగా చూస్తే కంప్యూటర్‌ను కనుక్కొన్నవాడి కన్నా కాపీ పేస్ట్‌ను కనుకున్నవాడు గొప్పవాడు. అయితే సరిగ్గా పేస్ట్ చేయడం తెలీనప్పుడు కాపీ చేస్తే మాత్రం చేసిన ప్రయత్నం వృథా అయిపోతుంది. ముఖ్యంగా క్లాసిక్స్ అనదగ్గ సినిమాలను కాపీ చేసేసి, వాటిని అతి సాదాసీదాగా పేస్ట్ చేస్తే... సినిమా అభిమానుల ఫీలింగ్స్ దారుణంగా హర్ట్ అవుతాయి. అలా హర్ట్ చేసిన ఓ సినిమా... ‘మా నాన్నకు చిరంజీవి’. సూపర్ హిట్ అయిన ‘ద పర్‌స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’కి అనుకరణగా రూపొందిన ఈ సినిమా ఘోరంగా విఫలమైంది.  
 
విల్ స్మిత్‌కు ఆస్కార్ అవార్డును, అంతకు మించిన అభిమానగణాన్ని సంపాదించి పెట్టిన సినిమా ‘ద పర్‌స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’. 2006లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా ఒక వాస్తవ కథ. అతుకుల్లేని, అలంకారాల్లేని, పారదర్శకమైన కథ. స్మిత్ నులివెచ్చని భావవ్యక్తీకరణ సినిమాను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శ్రీమంతుల్లో ఒకరు క్రిస్ గార్డ్‌నర్. ఈ వ్యాపారవేత్త తన జీవితంలోని ఒక దశలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఆయన అధిగమించిన తీరును ఆటోబయోగ్రఫీగా రాశారు.

దాన్నే ‘ద పర్‌స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ సినిమాగా మలిచారు. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్ని ఎక్స్‌రే మిషన్లను కొని, వాటి వ్యాపారంలో తేడాలొచ్చి కట్టుబట్టలతో మిగులుతాడు క్రిస్ గార్డ్‌నర్ (విల్ స్మిత్). దీంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. కొడుకును తన దగ్గర వదిలిపెట్టి భార్య వెళ్లిపోతుంది. ఆరేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఆ సేల్స్‌మెన్ రోడ్డున పడ తాడు. తన పరిస్థితి తనయుడికి ఏ మాత్రం అర్థం తెలియ నీకుండా జాగ్రత్తపడతాడు.

బాబుకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవ డానికి ఆ తండ్రి పడే తపన, మరోవైపు అడుగడుగునా దురదృష్టం ఎదురవుతున్నా ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదలక తన లక్ష్యం దిశగా ప్రయత్నాలను కొనసాగించే అతని ప్రయాణమే ఈ చిత్రం. ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతుందీ సినిమా. ఈ కథా నేపథ్యాన్ని ‘మా నాన్న చిరంజీవి’ సినిమాకు అన్వయించే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ వెర్షన్‌లో విల్ స్మిత్, ఆయన సొంత తనయుడు జేడెన్ స్మిత్‌లు నటించిన పాత్రల్లో తెలుగు వెర్షన్‌లో జగపతిబాబు, మాస్టర్ అతులిత్‌లు కనిపిస్తారు.

భార్య మాట విని తనకు తెలియని వ్యాపారంలో డబ్బులన్నీ పెట్టి నష్టపోతాడు జగపతిబాబు. ఆయన ఆర్థికంగా నష్టపోవడానికి తనే కారణం అయినా... భార్య అతడిని వదలి వెళ్లిపోతుంది. దీంతో హీరో కొడుకును తీసుకుని హైదరాబాద్ వ స్తాడు. ఈ రకంగా నేపథ్యాన్ని మార్చినా... ఇక్కడి నుంచి ఇక హీరోకి ఎదురయ్యే అనుభవాలన్నీ హాలీవుడ్ సినిమాకు అనుకరణగా రాసుకున్నవే.
 
కొడుకుతో కలిసి ఒక రాత్రి రైల్వేస్టేషన్ బాత్‌రూమ్‌లో తల దాచుకోవాల్సి వస్తుంది హీరోకి. ఈ సీన్‌లో విల్‌స్మిత్ నటన కన్నీటిని తెప్పిస్తుంది. ఈ సన్నివేశాన్ని తెలుగు సినిమాలో కూడా యథాతథంగా వాడుకున్నారు. హాలీవుడ్ వెర్షన్‌లో హీరో తన దగ్గరే మిగిలిపోయిన ఎక్స్‌రే మిషన్‌ను అమ్మడానికి హీరో ప్రయత్నం చేస్తుంటాడు. తెలుగులో హీరో చేతిలో డిక్షనరీలు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు, అనుకరణలు ఎన్నో ఉన్నా... ఏ దశలోనూ తెలుగు సినిమా హాలీవుడ్ డ్రామాను రీచ్ కాలేదు.

అమెరికా నేపథ్యంలో సాగే కథను లోకలైజ్ చేయబోయి... గొప్ప కాన్సెప్ట్‌ను సాధారణ స్థాయికి తీసుకొచ్చేశారు రూపకర్తలు. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా చాలామందికి తెలియదు! వాస్తవానికి విల్‌స్మిత్ సినిమాలో ఉన్న గొప్పదనం... నాటకీయమైన కథలోనిది కాదు. ఆ చిత్రంలోని అందమంతా దాని నిజాయితీలో ఉంది. ప్రతి సన్నివేశం ఎంతో వాస్తవికంగా, మనసును తడిమేలా ఉంటడమే దాని సక్సెస్ సీక్రెట్. అలాంటి ఫీల్ తెలుగు సినిమాలో మిస్ అయ్యింది! అందుకే... పరాజయాల లిస్టులో చేరిపోయింది!
- బి.జీవన్‌రెడ్డి

మరిన్ని వార్తలు