విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో

6 Oct, 2019 10:43 IST|Sakshi

పాటతత్త్వం

శ్రీరమణ కథా రచయిత

చిత్రం: ముత్యాలముగ్గు  రచన: గుంటూరు శేషేంద్ర శర్మ గానం: పి. సుశీల సంగీతం: కె. వి. మహదేవన్‌

బాపురమణల సారథ్యంలో రూపొందిన ‘ముత్యాల ముగ్గు’. విడుదలై నాలుగు న్నర దశాబ్దాలు కావస్తున్నా ఆ చిత్రంలోని మాటలు పాటలు పచ్చతోరణాలుగా తెలుగువారి మనసులో రెపరెపలాడుతూనే ఉన్నాయి, నిత్య నూత నంగా నిలిచాయి. ఇందులో గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన అధివాస్తవిక గీతం ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది’ జనసామాన్యంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ పాట చాలామంది అనుకున్నట్టు చిత్రం కోసం సందర్భానికి తగినట్టు కూర్చిన సాహిత్యం కాదు. అంతకుముందెప్పుడో ఒక వారపత్రికలో కవితగా వెలువడింది. ‘ముత్యాలముగ్గు’ చిత్రానికి నిర్మాతగా యమ్వీయల్‌ పేరు వుంటుంది. ఆయన నూజివీడు రాజావారి కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులు. సుకుమార్‌ రాజా (రాజావారి వారసులు) యమ్వీయల్‌ గారి విద్యార్థి. సుకుమార్‌ బాపురమణలతో సినిమా తియ్యాలను కున్నప్పుడు యమ్వీయల్‌ సంధానకర్తగా వున్నారు. ఆయన  శేషేంద్రకి అభిమాని, అంతకుమించి సాహిత్యాభిమాని. బాపు రమణలతో కథా చర్చలు జరిగేప్పుడే ఈ పాటను యమ్వీయల్‌ సూచించారు.

సినిమాలో చక్కగా అమరింది. అనుమానంతో ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా పంపివేయబడిన కథానాయిక, తన ఇద్దరు పిల్లలతో వాల్మీకి ఆశ్రమంలాంటి చోట తల దాచుకుంటుంది. భర్త ఎక్కడో రాజమహల్‌లో వుంటాడు. యాదృచ్ఛికంగా లాంచీ మీద, కథానాయిక ఉండే రేవు మీదుగా కథా నాయకుడు దాటి వెళ్లే నేపథ్యంలో కథా నాయిక మనస్థితిని విప్పిచెప్పే పాటగా నడుస్తుంది. రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది/దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది/శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది/ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది’ అనే పదాలు... ఆ సన్నివేశాన్ని బాపురమణలు ఈ పాట కోసమే సృష్టించారా అనిపించేలా అమరాయి. అందుకే ఇది శేషేంద్ర సినిమాకి రాసిన పాట అనుకుంటారు. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో/ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి/కొమ్మల్లో పక్షుల్లారా/గగనంలో మబ్బుల్లారా/నది దోచుకు పోతున్న నావను ఆపండి/రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’ – అంటూ కథానాయిక బావురు మంటుంది. శేషేంద్ర లాంటి మహానుభావుడు సర్రియ లిస్టిక్‌ ధోరణిలో నిగూఢ భావాలతో రాసిన ఈ గేయాన్ని ముత్యాలముగ్గులో సంద ర్భోచితంగా పొదిగి పాటకి బాపురమణలు వన్నె తెచ్చారు. జనం మెచ్చారు. శేషేంద్ర సవ్యసాచి!
– సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు