వికారాబాద్, రంగారెడ్డి రెండు కళ్లు: సబిత

6 Oct, 2019 10:40 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్‌ నాయకులు

ఇరు జిల్లాల అభివృద్ధికి కృషిచేస్తా 

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు తనకు రెండు కళ్లలాంటివని, వీటి అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి అమె శనివారం  వికారాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా గంగారం సమీపంలోని రూ.2.కోట్లతో చేపట్టిన డంపింగ్‌ యార్డు పనులను ప్రారంభించారు. రూ.కోటితో నిర్మించే వైకుంఠధామం, మధుకాలనీలో సీసీ రోడ్డు, మోడల్‌ కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి, సుభాష్‌నగర్, సాకేత్‌నగర్, కొత్రెపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.  

మంత్రికి ఘనంగా సన్మానం.. 
రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా భాద్యతలు చేపట్టిన సబితాఇంద్రారెడ్డిని పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. స్థానిక గౌలికర్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ తదితరులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది ఇంద్రారెడ్డి కల అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఆయన ఆశయం నెరవేరిందని తెలిపారు. కేసీఆర్‌ కేబినెట్‌లో తనకు స్థానం కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.

జిల్లాలోని అందరు ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎండీ హపీజ్, సుభాష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటాలని పిలుపునిచ్చారు. 100 గజాలు ఉన్న స్థలానికి కేవలం రూపాయితో ఫీజుతో రిజిస్ట్రేషన్‌ చేసేలా చట్టం రూపొందిస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి సమస్యను తీరుస్తామని  సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్, రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ నాగేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ధారూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌ కుమార్, మాజీ కౌన్సిలర్‌ రాజమల్లయ్య, విజేందర్‌గౌడ్, నర్సింగ్‌రావు   పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు