నన్నే... ఎందుకు?

26 Jun, 2016 08:40 IST|Sakshi
నన్నే... ఎందుకు?

జీవన గమనం
నేను ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాను. కాలేజీలో మా మేడమ్‌తో సమస్యగా ఉంది. ఆమె కోర్ సబ్జెక్ట్ చెబుతారు. క్లాస్‌లో ఆమె పాఠం చెప్పేటప్పుడు మిగిలిన క్లాస్‌మేట్స్ అందరిలాగే నేనూ నువ్వుతూ ఉంటాను. ఇతరులు నవ్వినప్పుడు ఏమీ అనని మేడమ్ నేను నవ్వినప్పుడు మాత్రమే తిడుతూ ఉంటారు. దాంతో క్లాస్‌లో నవ్వడమే మానేశాను. క్లాస్‌లో నేను నవ్వకపోయినా, వేరే వాళ్లెవరో నవ్వినా ఆమె నన్నే తిడుతున్నారు. ఆమె తరచూ నన్నే తిడుతుండటంతో చదువు మీద శ్రద్ధ చూపలేకపోతున్నాను. ఇదే పరిస్థితి కొనసాగితే నా చదువు ఏమైపోతుందోనని బెంగగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు
 - గంగాధర్, ఏలూరు

 
ఆమె మనస్థితి, గృహపరిస్థితి తెలీదు కాబట్టి తరచూ పిల్లల్ని ఎందుకు తిడుతోందో, తిట్టడానికి ఎప్పుడూ మిమ్మల్నే ఎందుకు ఎన్నుకుంటుందో వదిలేద్దాం. మీ నవ్వు ఎలా ఉందో పరిశీలించుకోండి. వెటకారంగా ఉందా? ఆమె లెక్చరర్‌ని పరిహసిస్తున్నట్టు ఉందా? అలా ఉంటే ఎవరికైనా ఒళ్లు మండుతుంది కదా. రెండో విషయం ఏమిటంటే, నవ్వుతూ ఉండటం వేరు. ఆహ్లాదంగా ఉండటం వేరు. మేము తరచూ క్లాసుల్లో విద్యార్థులకు ’సీరియస్‌గా ఉండొద్దనీ, పాఠాలను ఆహ్లాదంగా వినండి’ అని చెబుతూ ఉంటాం.

చాలామంది టీచర్లు క్లాసులో పిల్లల్ని ‘నవ్వకు, శ్రద్ధగా విను’ అని తిడుతూ ఉంటారు. శ్రద్ధగా వినటం అంటే సీరియస్‌గా వినటం కాదు. ప్రశాంతంగా వినటం. అదే విధంగా పెద్దలు కూడా పిల్లల్ని ‘హార్డ్‌వర్క్ చెయ్యి, పైకి వస్తావు’ అంటారు. హార్డ్‌వర్క్ అంటే కష్టపడి పని చెయ్యటం...! మనసుకు గానీ, శరీరానికి గానీ ఒక పని సాధ్యం కానప్పుడు అది హార్డ్‌వర్క్ అవుతుంది... హార్డ్‌వర్క్ చేస్తూ టీవీ చూడు. హార్డ్ వర్క్ చేసి క్రికెట్ ఆడు అని మాత్రం అనరు. చదువుకే ఈ పనిని ఆపాదిస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే... పెద్దలే పిల్లలకు చిన్నతనం నుంచి చదువంటే ఒక రకమైన విరక్తిభావం కలుగ చేస్తున్నారన్న మాట. ఈ సమాధానం ఆమె చదివేలా చెయ్యండి. మీ సమస్య తొలగిపోతుంది.
 
నేను ఇటీవలే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయ్యాను. మా పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. మా పేరెంట్స్ కోరుకుంటున్నట్లుగా నాకు ఎంబీబీఎస్‌లో చేరాలని లేదు. ఎంబీబీఎస్‌లో చేరే బదులు క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని ఉంది. ఏదైనా ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే నాకు ఇష్టం. ఎంబీబీఎస్ నాకు తగిన కోర్సు కాదని బలంగా అనిపిస్తోంది. అలాగని, ఏ కోర్సులో చేరితే రాణించగలనో అనే దానిపై ఎంతగా ఆలోచించినా ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి.
 - అమూల్య, ఊరు రాయలేదు

 
’ప్రాక్టికల్‌గా నేర్చుకోవటం’ అంటూ వ్రాసిన మీ ఉత్తరం అస్పష్టంగా ఉంది. మెడిసిన్‌లో ప్రాక్టికాలిటీ గానీ, మెడికల్ రీసెర్చ్‌లో క్రియేటివిటీ గానీ లేవని ఎలా అనుకుంటున్నారు? మీకు మరో రకమైన రీసెర్చ్ కావాలనుకుంటే ఫార్మసీలో గానీ, అగ్రికల్చర్ రంగంలో గానీ చేరండి.  
 
నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. పాలిటిక్స్‌లో చేరితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. అయితే, పాలిటిక్స్‌లో రాణించగలనా? లేదా? అనే మీమాంసలో పడి ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. పాలిటిక్స్‌లో రాణించడానికి ఏం చేయాలో నాకు తెలియదు. అయితే, ఎలాగైనా పాలిటిక్స్‌లోకి రావాలని ఉంది. దానికి నేను ఏం చేయాలి?
  - పేరు రాయలేదు

 
1. ‘ఒక నాయకుడి కింద ఎంత కాలం నిజాయతీగా ఉండాలి? ఎప్పుడు అతణ్ని అధిగమించాలి’ అన్న విచక్షణాజ్ఞానం.
 2. ఎప్పుడు వినాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అన్న సంయమనం.
 3. అనుచరుల్నీ, హితుల్నీ ఊరు పేరుతో సహా గుర్తుపెట్టుకోగలిగే జ్ఞాపక శక్తి.
4. తర్వాత వచ్చే ఎన్నికలకు డబ్బు సంపాదించగలిగే ఆర్థిక ప్రణాళిక.
5. కార్యకర్తలను ఆకట్టుకునే నైపుణ్యం, నిరంతరం అధిష్టానం కనుసన్నల్లో మెలిగే చాతుర్యం... ఈ అయిదూ రాజకీయ విజయానికి అయిదు మెట్లు. ఈ అర్హతలు మీకెంత వరకు ఉన్నాయో... ఎంతవరకు పెంచుకోగలరో అలోచించుకోండి.              
- యండమూరి వీరేంద్రనాథ్

మరిన్ని వార్తలు