రహస్యం

18 Dec, 2016 00:41 IST|Sakshi
రహస్యం

నారాయణ ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే... పదిమందికి ధైర్యం చెప్పడం తప్ప ఆయన మాటల్లో అధైర్యం ఎప్పుడూ తొంగిచూడదు. అయితే తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకునేవాడు కాదు. ప్రతి చిన్న విషయంలో గోప్యత పాటించేవాడు.అందుకే ‘నారాయణ జీవితం తెరవని పుస్తకం’ అంటారు కొద్దిమంది.ప్రతి విషయంలో గోప్యత పాటించే నారాయణ వైఖరి చాలామందికి చాదస్తంగా అనిపించేది. కానీ అతని హోదా దృష్ట్యా  ఎవరూ ఏమీ అనడానికి సాహసించేవాళ్లు కాదు. తన మనసులో ఉన్న భావాన్ని చివరికి భార్యాపిల్లలకు కూడా చెప్పేవాడు కాదు. ఇలాంటి నారాయణకు ఒక అలవాటు ఉంది. ప్రతి చిన్న విషయాన్ని డైరీలో రాసుకునేవాడు. ఆ డైరీని ఎవరైనా చదువుతారేమోననే భయం వల్ల కాబోలు దాన్ని ఒక లాకర్‌లో పెట్టేవాడు.  నారాయణ ఆత్మహత్య చేసుకోవడంతో... ఇప్పుడు అందరి దృష్టి ఆ లాకర్‌పై పడింది.


‘ఈ లాకర్‌ను తెరిస్తే చాలు... డైరీ దొరుకుతుంది. నారాయణ ఆత్మహత్య కారణం తెలిసిపోతుంది’ అనుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌.
అయితే అదంత సులభమైన విషయమేమీ కాదని ఇన్‌స్పెక్టర్‌గా అర్థమైంది. ఎవరికీ ఆ లాకర్‌ను తెరిచే ‘కోడ్‌’ ఏమిటో తెలియదు.
‘ఎలా?’ అని తెగ ఆలోచిస్తున్న సమయంలో తన క్లోజ్‌ఫ్రెండ్‌ రాజ్‌కుమార్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.
‘‘ఒక పని మీద నేను రేపు మీ ఊరికి వస్తున్నాను’’ అని చెప్పాడు రాజ్‌కుమార్‌.
‘‘చాలా మంచి సమయంలో వస్తున్నావు’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. రాజ్‌కుమార్‌ సైకాలజిస్ట్‌. కొన్ని కేసుల చిక్కుముడులు విప్పడానికి ఇన్‌స్పెక్టర్‌ నరసింహకు సహాయపడ్డాడు.

‘‘అవునూ... ఏదో విషయం మాట్లాడాలన్నావు? ఏమిటా విషయం?’’  ఆసక్తిగా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘అవును. చాలా ముఖ్యమైన విషయం. ఈ సిటీలో నారాయణ అని ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు. కారణం ఏమిటో తెలియదు... సడన్‌గా ఒకరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. తన డైరీలో ప్రతి చిన్న విషయం రాసే అలవాటు ఉందట’’ అని చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘ఇప్పుడు ఆ డైరీ ఎక్కడ ఉంది?’’ అడిగాడు రాజ్‌కుమార్‌.

‘‘ఇప్పుడు సమస్యంతా ఆ డైరీ గురించే’’
‘‘ఏమైంది?’’
‘‘ఆ డైరీని ఒక లాకర్‌లో పెడతాడు. అయితే ఆ లాకర్‌ కోడ్‌ ఎవరికీ తెలియదు. అది ఫోర్‌ డిజిట్స్‌ కాంబినేషన్‌ లాకర్‌’’
‘‘పాస్‌వర్డ్‌లు, కోడ్‌లు ఎంపిక చేసుకోవడంలో వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఉంటాయని తెలుసా?’’ అన్నాడు రాజ్‌కుమార్‌.
‘‘ఇలా కూడా ఉంటుందా!’’ కాస్త ఆశ్చర్యంగా అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘ఇలా కూడా ఉంటుందా...అని తీరిగ్గా ఆశ్చర్యపోదువుగానీ... ఆ నారాయణ ఇష్టాయిష్టాలేమిటో ముందుగా తెలుసుకో... ఏమైనా పనికొస్తుందేమో చూద్దాం’’ అన్నాడు రాజ్‌కుమార్‌.
నిజమే అనిపించింది ఇన్‌స్పెక్టర్‌కు.
వెంటనే రంగంలోకి దిగాడు.

నారాయణకు సినిమాలంటే పెద్దగా ఆసక్తేమీ లేదు. చూడక చూడక... ‘షోలే’  సినిమా చూశాడు. ఇక అది మొదలు ఆ సినిమా మీద ఎంతో ఇష్టం పెంచుకున్నాడు. ఆ సినిమాలో డైలాగులు సరదాగా చెబుతుండేవాడు. ‘షోలే’ మీద  ఏ పుస్తకం వచ్చినా కొని లైబ్రరీలో దాచుకునేవాడు. ఇది తప్ప అతనికి ఉన్న ప్రత్యేక ఆసక్తి అనేది ఏదీ లేదు అనే విషయం తెలిసింది. ఇదే విషయాన్ని రాజ్‌కుమార్‌తో పంచుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌.
కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు రాజ్‌కుమార్‌.

అతనికో ఆలోచన వచ్చింది.
‘‘ఈ నంబర్‌ ట్రై చేసి చూడు... నా అంచనా నిజమవుతుందని నమ్ముతున్నాను’’ అంటూ ఫోర్‌ డిజిట్స్‌తో ఒక ఫిగర్‌ చెప్పాడు రాజ్‌కుమార్‌.
 ఇన్‌స్పెక్టర్‌ నరసింహ ఆ నంబర్లు ఉపయోగించి... లాకర్‌ ఓపెన్‌ చేశాడు.
లాకర్‌ తలుపులు తెరుచుకున్నాయి. డైరీ బయటపడింది. నారాయణ ఏ కారణంతో చనిపోయాడు అనేది తరువాత విషయం... ఇన్‌స్పెక్టర్‌కు రాజ్‌కుమార్‌ చెప్పిన నంబర్లు ఏమిటి? అవి చెప్పడానికి కారణం ఏమిటి?

అద్దంలో ఆన్సర్‌
ఇన్‌స్పెక్టర్‌కు రాజ్‌కుమార్‌ చెప్పిన నంబర్లు...
1–9–7–5
‘షోలే’ విడుదలైన సంవత్సరం... 1975


కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి

మరిన్ని వార్తలు