కొత్త పుస్తకాలు

27 Jul, 2014 00:33 IST|Sakshi
కొత్త పుస్తకాలు

హోసూరు వంటలు

మీకు ‘రామక్కగారి సుమ’ తెలుసా? ఇరవై ఏళ్లుంటాయంతే! తమిళనాడులోని హోసూరులో ఉంటుంది. ‘తల్లి నుడి కోసం, తల్లినుడిలో మాటకోసం, పాటకోసం’ తపన పడే తెలుగు తావు అది. అలాంటి నేలమీది ‘మాలగేర్లో’ పుట్టిన సుమ వాళ్లమ్మ పేరునే ఇంటిపేరుగా పెట్టుకుంది. వాళ్లమ్మ చేసే వంటల్నే కథలుగా మలిచింది. ఒబ్బట్లు, శాస్తాలు, చల్లిపిండి, సబ్బచ్చి బోండాలు, కజ్జాయలు, పులగూరాకు, వెదురుకొమ్ము చారు, పొట్లినంజర మసాలు, పెసలబేడల పాయసం, మొలక ఉలవల చారు... ‘ఉలవల చారు గములు మా ఇల్లు దాటి ఊరుదాటి దిన్నలో మేకలు మేపుతా ఉండే మా అమ్మ దగ్గరకు పోయి నా మింద దూర్లు చెప్పినట్లుంది. ఉడికిన చారును దించుకొని, నీళ్లను ఇంకొక గిన్నెలోకి వంచుకొంటా ఉండగా మా అమ్మాఅబ్బలు వచ్చేసినారు.’ మీకూ నోరూరుతోందా! వంటల్ని రుచి చూపించే సాకుతో వాళ్ల బతుకుల్నీ రుచి చూపించారీ రచయిత్రి.
 
హోసూరు కథలు
హోసూరు ప్రాంతీయుడు అగరం వసంత్ గతంలో ‘తెల్లకొక్కర్ల తెప్పం’ కథాసంకలనం తెచ్చారు. ఇప్పుడు ‘వెండిమొయిళ్లు బండబతుకులు’ కథలతో మళ్లీ పలకరిస్తున్నారు. పాముకడుపోడు, పాక్కాయల తోపు, జనిగిలోడు, జొన్నకడ్లగుడి లాంటి 54 పొట్టికథలున్నాయిందులో. లత్తనాయాలు, పుంగుమాటలు, ఇటెంకిటెంకలాంటి ఎన్నో జాతైన మాటలతోపాటు, సింతలేని సితరంగి సంతకొక బడ్డని కన్నెంట లాంటి చమత్కారపు సామెతలూ నాలుక్కి తగులుతాయి. ‘ఇది మా తావు తెలుగు కాదు కదా’ అనుకునేదే లేదు. అక్కున చేర్చుకోవాల్సిన తెలుగు!

 ‘మన బతుకేమో, మన మాటేమో’ అన్నట్టుగా రాస్తూపోవాలనే (స.వెం.) రమేశప్ప స్ఫూర్తితో కలం పట్టిన ఇతర హోసూరు కథకుల సంకలనం ‘మోతుకుపూల వాన’. నంద్యాల నారాయణరెడ్డి, ఎన్.సురేఖ, కృష్ణకళావతి, అమరనారా బసవరాజు, అశ్వత్థరెడ్డి, మునిరాజు లాంటివాళ్లు రాసిన 19 కథలున్నాయిందులో. ‘మరచిన తెలుగుమాటలు దొరుకుచోటు’ హోసూరు అనిపిస్తుంది ఇవి చదివితే.
 దీనికి సాక్ష్యంగా అన్నట్టు వచ్చిన పుస్తకం ‘పొరుగు తెలుగు బతుకులు’. హోసూరు నుంచి వచ్చిన సాహిత్యం మీది (రేడియో) వ్యాసాల సంకలనం ఇది. తొలిపలుకి(టెలిఫోన్), అలపలుకి (సెల్‌ఫోన్), మిన్నులువు (రేడియో), కోగురేకు (బ్లేడ్), ఉల్లాకు (కరపత్రం), మలయిక (ఎక్స్‌కర్షన్) లాంటి ఎన్నో కడుపునింపే మాటలున్న కథల్ని మనసునిండేలా విశ్లేషించారు విజయలక్ష్మి.

మరిన్ని వార్తలు