రూ.7,260 కోట్లతో రుణప్రణాళిక

27 Jul, 2014 00:29 IST|Sakshi
రూ.7,260 కోట్లతో రుణప్రణాళిక
  •      లక్ష్యాలను అధిగమించాలి
  •      బ్యాంకర్లకు కలెక్టర్ పిలుపు
  • విశాఖ రూరల్: వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.7,260 కోట్లకు మించి అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకర్లను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రాధాన్యత రంగాలకు రూ.5,377 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,883 కోట్ల మేర రుణాలు మంజూరుకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.

    ఖరీఫ్ ప్రారంభమైనందున, ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలు అందిన వెంటనే ఆలస్యం చేయకుండా అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. అనకాపల్లి మండలం శంకరంలో రాజీవ్ గృహ కల్ప పథకం లబ్ధిదారుల్లో 314 మందికి బ్యాంకు రుణాలు సత్వరమే మంజూరు చేయాలని కోరారు. ఏజెన్సీలో విలీనం చేసిన, రీలొకేట్ చేసిన బ్యాంకులశాఖలను  అవసరం ఉన్న ప్రాంతాల్లో మళ్లీ ఏర్పాటు చేయాలన్నారు.

    రుణాల రికవరీ విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, మొండి బకాయిలను వసూలుకు అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలుచేస్తామన్నారు. జిల్లాలో 91 శాతం ఆధార్‌కార్డుల జారీపూర్తయిందని, దశల వారీ అన్నిబ్యాంకు అకౌంట్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాలన్నారు.
     
    ఎస్‌బీఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నివేదిక ఆవిష్కరణ
     
    అనకాపల్లిలో నిర్వహిస్తున్న స్టేట్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన గతేడాది వార్షిక కార్యాచరణ నివేదికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.జయబాబు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది నూతనంగా 54 బ్యాంక్ శాఖలుప్రారంభించామని, 734 ఏటీఎం కేంద్రాలతో విస్తృత సేవలు అందిస్తున్నామన్నారు.

    ఆర్‌బీఐ ఏజీఎం కామేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం ప్రసాదరావు, స్టేట్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సంచాలకుడు షేక్‌బాబర్ వారు అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికలను కలెక్టర్‌కు వివరించారు.  సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాస్, జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, డుమా పీడీ శ్రీరాములు నాయుడు, మెప్మా పీడీ పాండురంగారావు, యూసీడీ పీడీ ప్రేమ స్వరూపారాణి, గృహ నిర్మాణ సంస్థ పీడీ ప్రసాదరావు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు