'సాంగ్‌'రే బంగారు రాజా

19 Jun, 2016 01:35 IST|Sakshi
'సాంగ్‌'రే బంగారు రాజా

కదలింది కరుణరథం / సాగింది క్షమా యుగం
మనిషి కొరకు దైవమే / కరిగి వెలిగే కాంతిపథం

 
తెలుగులో పౌరాణికాలు అనేకానేకం. అసలు భారతీయ సినిమానే హరిశ్చంద్రుని కథతో మొదలయ్యింది. శకుంతల, దుష్యంతుడు, రాముడు, శ్రీకృష్ణుడు... వీళ్లందరి మీద సినిమాలు తీయడానికి తీసిన సినిమాలు చూడటానికి ఏ ఇబ్బందీ లేదు. కాని ఏసుక్రీస్తు మీద అంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. తీస్తే చూస్తారో లేదో తెలియదు. కాని నటుడు విజయచందర్ ఈ ఒక్క సినిమా తీయడానికే పుట్టినట్టున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా ఆగకుండా ‘ప్రేమ, కరుణ, సేవ’లను బోధించిన ఏసుక్రీస్తును ప్రజలకు చేరువ చేయాలని ప్రవక్తల జీవితానికి కులం, మతం, ప్రాంతం వంటి అడ్డంకులు ఏమీ లేవని ఒక మతంగా కాకపోయినా కనీసం ఒక చరిత్రగా అయినా ఈ కథను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఆయన ఈ సినిమా తీశాడు.

సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్ ఒకెత్తు. అంతటి కరుణామయునికి శత్రువుని కూడా ప్రేమించగలిగిన మహోన్నతునికి శిలువ వేసి ఊరేగిస్తుంటే చూసిన ప్రతి కన్నూ చెమ్మగిల్లుతుంది. మరి ఆ సందర్భానికి కలం ఎన్ని వెక్కిళ్లు పెడుతుంది? ‘కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే’.... హిందీలో గొప్ప వైష్ణవ భక్తి గీతాన్ని నౌషాద్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడాడు.

ఇక్కడ ఏసుక్రీస్తు పాత్రను విజయచందర్ పోషిస్తుంటే బాలూ అద్భుతమైన విషాదంతో ఆ వీడ్కోలు గీతాన్ని పాడుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. మతం- మనిషి పైకి పెట్టుకున్న జీవిత విధానం. లోలోన అందరిది ఒకటే మతం. అది మానవతా మతం. మోదుకూరి జాన్సన్ రాసిన ఈ సుదీర్ఘమైన పాటను బాలు పాడిన తీరు ఎన్నిసార్లు విన్నా శ్రోతను కళ్లనీళ్ల పర్యంతం చేస్తుంది. మనుషుల్లో కరుణ అడుగంటిన ప్రతి సందర్భంలోనూ వారిని కరిగించే పాట ఇది. కనికరం కలిగించే పాట.చిత్రం: కరుణామయుడు (1978)
సంగీతం: జోసెఫ్ ఫెర్నాండేజ్, బి.గోపాలం
రచన: మోదుకూరి జాన్సన్
గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం

 
జోరు మీదున్నావు తుమ్మెదా.. నీ జోరెవరి కోసమే తుమ్మెదా..
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా.. నీ ఒళ్లు జాగరతె తుమ్మెదా

 
సినిమా వాళ్ల మీద సినిమాలు తీయడం తమిళంలో ఎక్కువ. తెలుగులో హీరో హీరోగా మారడం హీరోయిన్‌గా మారడం కథలో భాగంగా చూపించినా అసలు కథే ఒక హీరోయిన్ జీవితాన్ని చర్చించడం ‘శివరంజని’లో కనిపిస్తుంది. దీనికి దాదాపు ఆరేళ్ల తర్వాత వంశీ ‘సితార’ వచ్చింది. గాత్రం, లావణ్యం ఉన్న పల్లెటూరి అమ్మాయి మోసగాడి వలలో చిక్కి మద్రాసు చేరి సినీ తారగా గొప్ప స్థానం సంపాదించినా బంధువుల చేతిలో నానా బాధలు పడుతూ భర్త చేతిలో కష్టాలు పడుతూ ఓదార్పుగా ఒక స్నేహితుణ్ణి వెతుక్కుందామనుకుంటే అక్కడా అడ్డంకులు ఏర్పడి- తెర మీద కష్టాలు ఎదుర్కోవడం చేతనవుతున్నది కాని నిజజీవితంలో ఈ కష్టాన్ని ఎదుర్కోవడం చేత కాక ప్రాణాలు విడిచే దురదృష్టవంతురాలి కథ ఇది.

ఫ్లాష్ బ్యాక్‌లో ఏక్‌తారా మోగించుకుంటూ జయసుధ పాడే ఈ పాట రమేశ్‌నాయుడి మేలిమి సృజనాత్మకతల్లో ఒకటి. దానికి సినారె పల్లెపదాలు జతపడటం మరింత అందం తెచ్చింది. ‘ముస్తాబు అయ్యావు తుమ్మెదా... కస్తూరి రాశావు తుమ్మెదా...’ పల్లెల్లో పెరిగినవాళ్లకే ఈ కస్తూరి పరిమళం అబ్బుతుంది. సుశీల గానంలో క్రాఫ్ట్ తెలియాలంటే ఈ పాట వినాలి. ఫ్లా లెస్.చిత్రం: శివరంజని (1978)
సంగీతం: పి.రమేశ్ నాయుడు
రచన: సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

 
మౌనమె నీ భాష ఓ మూగ మనసా... ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు... కల్లలు కాగానే కన్నీరౌతావు

 
హృదయం గుండె కాదు. మనసు మెదడు కాదు. కొన్ని స్పందనలు హృదయం చేస్తుంది. కొన్ని మాయలకు మనసు లోనవుతుంది. మనసు- ఇది పిచ్చిది. వెర్రిది. పసిది. ఇదే ఒక్కోసారి జడల దయ్యం. మరోసారి కదలని మెదలని బండరాయి. దీని ధాటికి పతాకంలా ఎగిరినవారు ఉన్నారు. దీని దెబ్బకు పండులా రాలినవారు ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ, కోరిక- స్త్రీ పట్ల పురుషుడికి, పురుషుడి పట్ల స్త్రీ- ఈ విషయంలో మనసు వెయ్యి గొంతులతో ఊళ వేసే తుఫానుగాలిలా మారుతుంది.

అంతలోనే కామరూపిగా మారి వేణువులో సన్నిటి శ్వాసలా ఇమిడిపోతుంది. ‘గుప్పెడు మనసు’ సినిమాలో శరత్‌బాబు, సుజాత, సరితల మధ్య చోటు చేసుకునే ఆకర్షణ వికర్షణలకు మనసే హేతువు. ఆ సందర్భానికి పాట కావాలి. ఎమ్మెస్ విశ్వనాథన్ రెడీ. ఆత్రేయ రెడీ. పాటకు మాత్రం మనసంత లోతైన గళం కావాలి. మనసంత ఉన్నతాలకు చేరే స్వరం కావాలి.

జవాబు తోచింది. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. ఆయన పాటకు అంగీకరించాడు. మైక్రోఫోన్ ఎదుట గొంతు సవరించుకున్నాడు... అంత పెద్ద భూతం చిన్న సీసాలో దూరినట్టుగా అనంత భావాల అగాథమైన మనసూ ఒక చిన్న పాటలాగా అమరిపోయింది. ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు... ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’.... మనసును తేల్చి చెప్పడానికి ఇంతకు మించిన పంక్తి ఏముంది... పదం ఏముంది? ఎల్లకాలమూ మనసులు గెలిచే పాట ఇది.చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
రచన: ఆత్రేయ
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మరిన్ని వార్తలు