Sakshi News home page

మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..

Published Mon, Sep 11 2023 2:24 PM

Acharya Atreya Went To Unknowable Worlds Without Fulfilling That Desire - Sakshi

మాట తప్పడం ఆత్రేయకు మామూలు అనీ, ఆయన మాటను పాటిస్తే అది విశేష మని లోక వ్యాప్తమైన ప్రతీతి. ఆత్రేయ రాయక నిర్మాతలను ఏడిపించేవారనీ, అందుకే ఆయన పుల్లయ్య నుంచి మురారి వరకూ అనేక నిర్మాతల ఆగ్రహానికీ, ఆ తర్వాత ఆనందానికీ కారకులయ్యే వారని పరిశ్రమలో కథలు వినిపించేవి. వృత్తి రీత్యా ఆత్రేయ సత్యహరిశ్చంద్రుడు కాకపోవడం నిజమైనా, అవసాన కాలంలో ఆయన ఎంతో ముచ్చటపడి ఇచ్చిన మాట విధి వశాత్తూ వమ్ము కావడం ఆయన సుకవి మీద అభిమానులందరికీ సానుభూతి కలిగించే విషాద కరమైన ఉదంతం!

ముద్రణ పట్ల వ్యామోహం లేని ఆత్రేయకు ఆఖరి దశలో తను రాసిన సినిమా పాటల్లో కొన్నిటిని ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలనే కోరిక కలిగింది. కొందరు నిర్మాతలు వాగ్దానాలు చేసినా, అది సాకారం కాలేదు. చివరకు చిరకాల మిత్రులైన కొంగర జగ్గయ్య దగ్గర ఈ విషయం వెల్లడించగా, ఆయన ఆత్రేయ అంతవరకు రాసిన మొత్తం సినిమా పాటల్ని రెండు, మూడు సంపుటాలుగా వెలువరిద్దామని ప్రతిపాదించారు. అనుకోకుండా తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలైన ఆత్రేయ ఆ పాటల సంపుటాలు అట్ట పెట్టెల్లో ఉంచే ‘సెట్స్‌’గా రావాలని అభిలషించారు. జగ్గయ్య  ఆమోదించారు. ఆ రోజు నుంచే (1989 ఆగస్టు 13) ఆత్రేయ తన పాటల సెట్లను ఊహించుకొని మురిసిపోతూ, ఆ ముద్రణ ముచ్చట గురించి ఆత్మీయులకు చెప్పసాగారు.

సభలకూ, సమావేశాలకూ దూరంగా ఉండే ఆత్రేయ ఒక ఆప్త మిత్రుని బలవంతం మీద ప.గో. జిల్లా భీమవరంలో జరుగు తున్న ‘అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళా పరిషత్‌’ నాటక పోటీలకు చూడ్డానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ ప్రదర్శనలతో స్ఫూర్తి పొంది తను రాయాలనుకున్న ‘ఆఖరి నాటకా’నికి శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఆయన రెండ్రోజులపాటు ఆ నాటకాలను చూస్తూ ఉండిపోయారు. అలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక రామరాజభూషణ సాహిత్య పరిషత్‌ వారు ఒక సాయంకాల సమావేశానికి ఆత్రేయను అతిథిగా ఆహ్వానించారు.

ఆ సమావేశంలో పలువురు కవులు, సాహితీవేత్తలు ఆత్రేయ నాటకాల గురించి, పాటల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసి వారి రచనలను ఆయనకు కానుకలుగా సమర్పించారు. వారి అభిమానానికి ముగ్ధులైన ఆత్రేయ ప్రతిస్పందిస్తూ ముక్తసరిగా మాట్లాడి, మరోసారి వచ్చి ఆ సభ్యులంతా తృప్తిపడేలా సుదీర్ఘోపన్యాసం చేస్తానన్నారు. అంతేగాక త్వరలో అచ్చుకానున్న తన పాటల సంపుటాలను భీమవరం పంపిస్తానని వాటిని తనకు పుస్తకాలనిచ్చిన రచయితలందరికీ అందజేయాలనీ పరిషత్‌ నిర్వాహకులు రాయప్రోలు భగవాన్‌ గారిని కోరారు.

పుస్తక ముద్రణ గురించి చర్చించడానికి జగ్గయ్య గారిని తిరిగి కలవడానికి నిర్ణయించిన 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మాట తప్పారు. ఆకస్మికంగా తిరిగిరాని లోకానికి పయన మయ్యారు. పాటల సంపుటాలతో పాటు మనస్విని సౌజన్యంతో వెలువడిన 7 సంపుటాల ‘ఆత్రేయ సాహితి’ని ఆయన చూసుకోలేదు. ఉద్వేగంతో ఆయన మాటిచ్చినట్టు ఆత్రేయ రచనల సెట్‌ రామరాజ భూషణ సాహిత్య పరిషత్‌ సాహితీ వేత్తల కందలేదు!
పైడిపాల, వ్యాసకర్త సినీగేయసాహిత్య పరిశోధకులు

(చదవండి: నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి)

Advertisement

What’s your opinion

Advertisement