ప్రజావెల్లువతో పులకరింపు...

4 May, 2014 00:14 IST|Sakshi
ప్రజావెల్లువతో పులకరింపు...

ప్రజా సేవకుడు అన్న బిరుదును ప్రజానాయకుడు అన్న హోదా కంటే గొప్పగా భావించినపుడు ప్రజాస్వామ్యం పూలతోటలా, పండ్ల చెట్టులా మురిసిపోతుంది.

 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాసేవకుడిగా పనిచేశాడు. ప్రజానాయకుడిగా జీవించాడు. ప్రజలమనిషిగా జీవిస్తున్నాడు. పేద, గొప్ప... కుల, మత... ప్రాంత, వర్గాలకు అతీతంగా ఆయనకు తమ గుండెల్లో పక్క సర్ది, దూది దిండు వేసి ఉయ్యాల సేవ చేశారు. చేస్తున్నారు.
 అలా నిదురించాలని వైఎస్‌ఆర్‌కు మనసులో ఉందో లేదో నాకు తెలియదు కానీ... మెలకువగా ఉన్న ప్రతి నిమిషమూ ప్రజల కష్టాన్ని, ఆవేదనను తన బాధగా కౌగిలించుకున్నాడాయన.

బియ్యంలో రాళ్లను ఏరేసినట్టు...
బాటలో ముళ్లు వేరేసినట్టు...
గుండె తడిలో కన్నీరు వేరేసినట్టు...
కాంతితో నీడను వేరేసినట్టు...
దీపంలో వొత్తికి ఉన్న నొప్పిని కూడా వేరేసినట్టు...
ప్రజల జీవితాల్లో గుచ్చుకున్న ప్రతి కష్టాన్నీ వేరేస్తూ జీవించాడు.
అందుకే ప్రజలు ఆయనకు తమ గుండెల్లో పక్క సర్దారు.
అక్కడ కంటున్న కలలే వైఎస్ జగన్ నిజం చేయాలంటున్నాడు.

 తండ్రిని మించిన తనయుడు కావాలన్నది ప్రతి తండ్రి ఆశయం. కానీ జగన్ మరోలా ఆలోచించాడు. తన వల్ల తండ్రికి ఇంకా కీర్తి పెరగాలనుకున్నాడు. ‘వైఎస్‌ఆర్ శకం ముగిసింది... జగన్ యుగం మొదలైంది’ అని ఎవరైనా చెబితే... కాదు... వైఎస్‌ఆర్ యుగం కొనసాగుతోంది అని నవ్వుతూ అంటాడు జగన్. అదే ఆయనకు శక్తి.

  అందుకే... 

ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, పిల్లల్ని వదిలి పెద్ద కుటుంబం కోసం పరితపించాడు. ఏసీ గదిలో పడుకుని నచ్చిన నాలుగు రకాల వంటలు తినేవాడు గుడిసెలో గంజిని ఎన్నుకున్నాడు. 103 జ్వరం వచ్చి ఒళ్లు కాలిపోతున్నా చల్లగా నవ్వుతూ ఉండగలిగాడు. అభిమానంతో ప్రజలు తనను ఎలాగైనా తాకాలనే ఉత్సాహంలో చేతులకు గాట్లు పడుతున్నా ప్రేమతో కరచాలనం చేయగలిగాడు. ప్రజల పట్ల అతని ప్రేమను తలచుకుంటేనే మనసు పులకరిస్తుంది. వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లోంచి తొంగి కొడుకును చూసి మురిసిపోతుంటాడు అనిపిస్తుంది.
 నిజమే కదా! మన పిల్లలు ఒక చూపులేని మనిషిని రోడ్డు దాటిస్తే ఎంతగా ముచ్చటపడతాం! ఎన్నాళ్లు మురిసిపోతాం! మరి జగన్ ఇంతమందిని కష్టం నుంచి దాటేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్‌మురిసిపోడా!

 జగన్ అలాంటి కొడుకుగా బతకాలనుకున్నాడు కాబట్టే... తను, తన కుటుంబం కష్టాల నీడలో జీవించాల్సి వచ్చింది. ఒక్కసారి ఢిల్లీ ముందు మోకరిల్లి ఉంటే ఓ క్యాబినెట్ పదవి, ఓ ముఖ్యమంత్రి పదవి ఖాయం కదా! ఆ మాట ఢిల్లీవాళ్లే చెప్పారు కదా!
 సర్దుబాటు చేసుకుంటే దొంగ కేసులు, 16 నెలల జైలు జీవితం, అవమానం, ఆవేదన తప్పి ఉండేవి కదా!

అన్నిసార్లు గుచ్చినా, ఎన్నిసార్లు కింద పడేయాలని చూసినా, ఇంకెన్నిసార్లు వెనక్కి లాగేయాలని కుట్ర చేసినా వదల్లేదు కదా జగన్! ఎంత క్షోభపెట్టినా, ఎంత హింసించినా తన తండ్రి ఆశయాన్ని, తన మాటను ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాడు తప్ప వదిలేయలేదు కదా.
 
అంత కష్టంలో ప్రజలను వదలనివాడు...

 గెలిపించుకుంటే ఏం చేస్తాడో తలచుకుంటేనే గుండె పులకరిస్తుంది. వైఎస్‌ఆర్ పడుకున్న ప్రతి గుండెను తట్టి... ఆ సారును లేపి... ‘‘అయ్యా చూడు... అచ్చం నీలాగే ఎంత మంచి మనసయ్యా నీ కొడుకుది. స్వామీ చూడు... నీ ఆశయాలనే వారసత్వంగా తీసుకుని పోరాడుతున్నాడయ్యా! ఎన్ని గాయాలు చేశారు నీ బిడ్డకు... ఒక్కసారి పలకరించిపో అయ్యా! నీ కీర్తి కోసం తన దేహానికి, మనసుకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్న కొడుకుతో ఒక మాట చెప్పి పోవయ్యా! ఒక్కసారి కూడా కన్నీరు పెట్టకుండా గుండెల్లో వెయ్యి అగాథాలను మోస్తూ.... ప్రతి గుండెలో నీ జాడ చూసుకుంటూ జీవిస్తోన్న, ఉద్యమిస్తోన్న తనయుడిని ‘శహభాష్’ అని అనవయ్యా! భూదేవంత సహనాన్ని, ఆకాశమంత ఆశయాన్ని నీకోసం మోస్తున్న ఆ గుండెను దీవించయ్యా..! ఆ గుండెలో రక్తం కాకుండా ప్రవహిస్తోన్న తడిని నీ చిరుజల్లుతో కడుగయ్యా..! పోనీ... ఒక్కసారి జగన్ నిద్రలోకైనా వచ్చి తల నిమిరిపోవయ్యా..! ’’ అని వెక్కివెక్కి ఏడుస్తూ అర్థించాలని ఉంది.అలాంటి యువకుడు మన నాయకుడని గుండె దరువుతో చాటింపు వేయాలని ఉంది. ప్రజాస్వామ్యాన్ని పూబాటలా, పండ్ల తోటలా మార్చాలనే అభిమతానికి సలాం కొట్టాలని ఉంది.
 
‘యువకుడు, ఉత్సాహవంతుడు.
మీకు సేవ చేయాలనుకుంటున్నాడు.    
ఆశీర్వదించండి’
ఇది ఆరోజు వైఎస్ మాట.
అదే ఈ రోజు ప్రజల నమ్మకం.
 
 - వాన చుక్క

మరిన్ని వార్తలు