వీళ్లు ఎంతో సుకుమారులు...

15 Aug, 2015 23:52 IST|Sakshi
వీళ్లు ఎంతో సుకుమారులు...

ఆస్ట్రోఫన్‌డా: మీన రాశి
రాశిచక్రంలో చివరి రాశి మీనం. ఇది సరి రాశి. జలతత్వం, బ్రాహ్మణ జాతి, సౌమ్య రాశి, ఉజ్వల వర్ణం. శరీరంలో కాళ్లను, పాదాలను సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, దిశ ఉత్తరం. ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరా భాద్ర, రేవతి నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఈ రాశి అధిపతి గురువు. ఈ రాశి వైఢూర్యాలు, ముత్యాలు, వజ్రాలు, గోరోజనం, చేపలు, మద్యం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఇది రష్యా, ఈజిప్టు పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.
 
మీనరాశిలో పుట్టినవారు  కాస్త సుకుమారులు. కాస్త బద్ధకస్తులు కూడా. కఠిన శ్రమను తట్టుకోలేరు. అయితే, అద్భుతమైన సృజనాత్మకత వీరి సొంతం. సుఖలాలస ఎక్కువ. కల్లా కపటం తెలియని వీరు, ఎదుటి వారిని ఇట్టే నమ్మే స్తారు. కొన్ని సందర్భాల్లో పిరికిగా వ్యవహ రించినా, అవసరమైన సందర్భాల్లో ధైర్య సాహసాలనూ ప్రదర్శించగలరు. సరళ స్వభావం కారణంగా తేలికగా ఆకట్టు కుంటారు. నిష్పాక్షికత, సహనం, అపారమైన ఊహాశక్తి, వాక్చాతుర్యం, కార్యనిర్వహణ నైపుణ్యాల ఫలితంగా ఏ రంగంలోనైనా రాణించగలరు.

రచయితలు, సినీ దర్శకులు, నటులు, వైద్యులు, రసాయన నిపుణులు, సాంకేతిక నిపుణులు, బోధకులు, సామాజిక కార్యకర్తలుగా బాగా రాణిస్తారు. ఆహార పానీయాలు, రవాణా, ముద్రణ, ప్రచురణ వంటి రంగాల్లో సొంత వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం. రక్షణ, విద్య, జల వనరులు, షిప్పింగ్, రైల్వే, బ్యాంకింగ్, బీమా రంగాలలోని ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు.

గ్రహగతులు అనుకూలించకుంటే, స్థిరపడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా తిరుగుతారు. నిజాయితీ లేని పనులతో నిందల పాలవుతారు. మోసాలకు గురై నష్ట పోతూ ఉంటారు. బద్ధకంతో అవకాశాలను చేజార్చుకుంటారు. వ్యసనాల ద్వారా సాంత్వన పొందేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు, వాత సంబంధ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడతారు.
 - పన్యాల జగన్నాథ దాసు
మీనరాశిలో పుట్టిన గాయని శ్రేయాఘోషల్

మరిన్ని వార్తలు