జాతీయాలు

8 Oct, 2016 21:53 IST|Sakshi

అయ్యవారుల గారి నట్టిల్లు!
కొందరు చాలా కష్టపడతారు. వచ్చిన సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేస్తారు. వర్తమానంలో భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. భవిష్యత్‌కు మంచి బాటలు వేసుకుంటారు. వారి కష్టానికి కాలం కూడా కలిసి వస్తుంది. కొందరు మాత్రం కష్టపడరు. భవిష్యత్ గురించి అసలే ఆలోచించరు.
 ‘ఈ పూట గడిచిందా... ఇక చాలు’ అని తృప్తి పడతారు.
 ఇలా ఒక పద్ధతి అంటూ లేకపోవడం వల్ల అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడతారు.
 మరికొందరు బాగా కష్టపడినా... ఎటు పోయినా నష్టం, కష్టమే ఎదురొచ్చి పలకరిస్తుంది. అంటే దురదృష్టజాతకులన్నమాట!

ఈ ఇద్దరి విషయంలో ఉపయోగించే జాతీయమే అయ్యవారుల గారి నట్టిల్లు. అంటే... ఆదాయం అనేది ఏ రోజుకు ఆరోజు అన్నట్లుగా ఉండడం, ఆరోజు ఆదాయం లేకపోతే ఆకలి బాధలు ఎదుర్కోవడం. వెనకటికి ఎవరైనా అయ్యవారి జీవితం ఇలా గడిచిందేమో... అందుకే ‘అయ్యవారుల గారి నట్టిల్లు’ అనే జాతీయం పుట్టింది. ఆ అయ్యవారి ఇల్లు  ఎప్పుడు చూసినా ఖాళీగా, శూన్యంగా, భారంగా, విషాదంగా ఉండేదట. బాగా నష్టాల్లో కష్టాల్లో  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఆ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
 ఉదా: ‘ఆయన ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అయ్యవారుల గారి నట్టిల్లులా ఉంది’
 

ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు!
ఏనుగు బలశాలి. మరి అలాంటి బలమైన  ఏనుగుతో తలపడడానికి ఎవరికైనా భయమే కదా! ఏనుగు సహజ బలానికి కొమ్ములు తోడైతే? అమ్మో! అనుకుంటాం. ఎవరైనా బలవంతుడికి మరింత బలం చేకూర్చే అధికారమో, అవకాశమో వచ్చినప్పుడు....
 ‘ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు ఉంది’ అంటుంటారు.
 
ఇసుక తక్కెడ - పేడ తక్కెడ
ఒక గ్రామంలో ఇద్దరు ప్రయాణికులు ఒకచోట బస చేశారు. వారు ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు.
 ఒకడి కావడిలో ఇసుక ఉంది. మరొకడి కావడిలో పేడ ఉంది.
 ‘‘నీ దగ్గర ఉన్నదేమిటి?’’ అని మొదటి వాడు రెండోవాడిని అడిగితే...
 ‘‘ముడిబియ్యం’’ అని గొప్పగా చెప్పాడు.
 ‘‘మరి నీ దగ్గర ఉన్నదేమిటి?’’ అని రెండోవాడు మొదటి వాడిని అడిగితే.. ‘‘వండిన అన్నం’’ అని చెప్పాడు. ఒకరి వస్తువు మీద ఒకరు కన్నేశారు.
 ఎవరి దారిన వాళ్లు వెళ్లే సమయంలో... ఒకరినొకరు మోసం చేసుకొని ఒకరి కావడిని ఇంకొకరు తీసుకున్నారు. ‘‘అబ్బ... వీడి కావడి కాజేశాను’’ అని ఎవరికి వారు అనుకున్నారు. కొంతదూరం వెళ్లాక కావడి దింపి చూసుకున్నారు. ఒకడికి ఇసుక కనిపించింది. ఇంకొకడికి పేడ కనిపించింది!
 మోసగించబోయి మోసపోయిన సందర్భాల్లో, పరస్పరం మోసం చేసుకునే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది.
 
అరచేతిలో మాణిక్యం
ఒక విషయంలో స్పష్టత, సులువు, పారదర్శకతను సూచించడానికి ఉపయోగించే జాతీయం ఇది.
 ‘అరచేతిలో ఉసిరికాయ’లాంటి వాటికి ఇది సమానార్థకమైన జాతీయం.
 అరచేతిలో మాణిక్యం కనిపిస్తే... ‘ఇదీ విషయం’ అని ఎవరూ మనకు పనిగట్టుకొని చెప్పాల్సిన పనిలేదు. అది కంటికి కనిపిస్తూనే ఉంటుంది.
 అంటే ఎలాంటి అయోమయం, అస్పష్టత అక్కర్లేదు.
 ఉదా: బుర్ర పాడుచేసుకొని ఆలోచించేంత విషయం కాదు... అది అరచేతిలో మాణిక్యం

మరిన్ని వార్తలు