సర్కార్... మ్యాన్ ఆఫ్ పవర్!

5 Sep, 2015 23:22 IST|Sakshi
సర్కార్... మ్యాన్ ఆఫ్ పవర్!

దేడ్ కహానీ - సర్కార్
* ఇది వర్మ సినిమా.
* ఇది అమితాబ్ సినిమా.
* ఇద్దరి ఫ్యాన్‌‌స మెచ్చిన సినిమా.
సెన్సార్ సర్టిఫికెట్ పడింది తెరమీద. సర్కార్, హిందీ, కలర్, సినిమా స్కోప్, 24 జూన్ 2005.. తర్వాత రెండు మూడు టైటిల్స్ పడ్డాయి కేసెరాసెరా, ఎమ్‌టీవీ ఇలా. అప్పుడొచ్చింది ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ కార్డు.

ఏమనంటే, ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న, లెక్కలేనంత మంది దర్శకులలాగే నేను కూడా గాఢంగా, లోతుగా ప్రభావితుణ్నయ్యాను ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా చూసి. ఆ సినిమాకి నేనిచ్చే నివాళి   ‘సర్కార్’ - రామ్‌గోపాల్‌వర్మ.’’  మామూలుగా రామ్‌గోపాల్‌వర్మ అనే టైటిల్ కార్డుకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి రామ్‌గోపాల్‌వర్మే ఇలా ఓ కార్డు వేస్తే... గాడ్ ఫాదర్‌కి, సర్కార్‌కి, వర్మకి మళ్లీ మళ్లీ ఫ్యాన్స్ అయిపోతారు ఎవరైనా.
 
ఇంతకీ ఎవరీ సర్కార్? వెన్ సిస్టమ్ ఫెయిల్స్. ఏ పవర్ విల్ రైజ్. ఆ పవరే సర్కార్. అంటే, సుభాష్ నగ్రే. ఆ పాత్ర పోషించింది భారతదేశం ప్రేమించి, పడి చచ్చిపోయే అమితాబ్ బచ్చన్.
 వర్మ అంటే... ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కళ్యాణ్ పాత్రలాగ లెక్కలేనంత తిక్క ఉన్న వ్యక్తిగా ఈ జెనరేషన్ ట్విట్టర్ జనాలు భావించే ఓ వ్యక్తి. ఫ్లాష్‌బ్యాక్‌లో ‘బాషా’లో రజనీకాంత్ పాత్రలాగా మహా వ్యక్తి. తెలుగు సినిమా స్థాయిని, వ్యాపా రాన్ని మాత్రమే కాదు, సినిమా తీసే విధానాన్ని కూడా విపరీతంగా ప్రభావితం చేసిన మేధావి.

మన నుంచి హిందీ సీమ కెగసి ‘రంగీలా’తో అక్కడ కూడా అగ్ర దర్శకుడిగా జెండా ఎగరేసిన ఘటికుడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీయ డంలో సిద్ధహస్తుడు. తన శిష్యులందర్నీ దర్శకులుగా మార్చిన నాణ్యమైన నిర్మాత. అతను మనవాడవ్వడం మన అదృష్టం, ఆయన దురదృష్టం (ఈ కోవలోకి వచ్చే తెలుగువాళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు).  

ముందు తీసిన సినిమాలతో అందరూ ఇతని పనైపోయింది అనుకున్నప్పుడు తనని దర్శకుడిగా మార్చిన, ప్రభావితం చేసిన సినిమాతో మళ్లీ ప్రేరణ పొంది... తన స్టైల్‌ని, ఇమేజ్‌ని, మార్కెట్‌ని, మేధస్సుని అన్నిటినీ సవ్యంగా ట్రాక్‌మీద పెట్టినట్టు వర్మ సర్కార్ సినిమా తీశారు. దటీజ్ వర్మ... దటీజ్ సర్కార్! వర్మ తీసిన మొదటి సినిమా ‘శివ’లో భవానీ పాత్రని హీరోగా మార్చి, మణి రత్నం తీసిన ‘నాయకుడు’లో కమల్ హాసన్ కొడుకు పాత్రని చిన్న హీరోగా మార్చి, సహజంగా ఉంటుందని ఆ రెండు పాత్రలకీ నిజ జీవితంలో తండ్రీ కొడుకు లైన అమితాబ్‌ని, అభిషేక్‌ని ఊహించి, వాళ్లకనుగుణంగా స్క్రిప్ట్ రాసి, పకడ్బందీగా తీసినట్టు ఉంటుంది సర్కార్.

అలాగే ముంబైలో ఎన్నో ఏళ్లుగా మరాఠీ ప్రజల కోసం సమాంతర ప్రభుత్వం నడుపుతున్న శివసేన అధిపతి బాల్‌థాకరే జీవితంలోని సంఘటనల నుంచి స్ఫూర్తి పొందినట్టూ ఉంటుంది. వీటన్నిటికీ గాడ్ ఫాదర్ స్క్రీన్‌ప్లే స్టైల్, మేకింగ్ స్టైల్, పాత్ర చిత్రణ, స్వరూప స్వభావాలని మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కాకపోవడం వలన ఈ చిత్రం మన మధ్య జరుగుతున్న ఫీలింగునిస్తుంది.

ఇలా చాలా కోణాల్లోంచి దర్శకుడు చేసిన కృషి వల్ల ఈ చిత్రాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ లైబ్రరీలో భద్రపరిచారు. అది నిజంగా ఘనతే. ‘‘నాకు రైట్ అనిపించిందే నేను చేస్తాను. భగవంతుణ్ని ఎదిరించైనా, సమాజాన్ని ఎదిరించైనా, పోలీసుల్ని, చట్టాల్ని ఎదిరించైనా, మొత్తం సిస్టమ్‌ని ఎది రించైనా సరే’’... సమాంతర ప్రభుత్వం నడిపే వాడి ధైర్యం, యాటిట్యూడ్ అదే. ‘‘దగ్గర్లో ఉన్న లాభం చూసేముందు, దూరంగా వచ్చే నష్టాల్ని చూడు. పంచా యితీలు చేసేవాళ్లు ఆలోచించాల్సిందిదే’’.. ఇలాంటి మాటల సహాయంతో ‘సర్కార్’ పాత్రని అమితాబ్ చాలా సునాయాసంగా పోషించి మెప్పించేశారు.
 
‘‘అధికారం ఉన్నవాడు చేసే తప్ప యినా, రైటయిపోతుంది. నేను ఎవ్వర్నీ ఆలోచించొద్దు అనను. ఆలోచించకుండా పనిచెయ్యొద్దు అంటాను’’ - ‘‘సర్కార్ అనేది ఒక సిస్టమ్. అందులో జనం ఒక భాగం’’... ఇలాంటి పదునైన సంభా షణలు ఈ సినిమాలో కోకొల్లలు. బిగ్ బీ నటన సర్కార్ చిత్రానికి, వర్మ ఆలోచనలకి ప్రాణం పోసి నట్టుంటుంది. రౌడీయిజం, సోషల్ ప్రాబ్లెమ్స్ నేపథ్యం మాత్రమే. కథ, కథనం ఓ పెద్దమనిషి కుటుంబం, వారి మధ్య బంధాలు, స్పర్ధల చుట్టూ తిరు గుతూ ఉంటుంది. అందుకే ఈ చిత్రంలో ఒక ‘తడి’ ఉంటుంది. అది మనసుని తడు ముతుంది. ఇదో మంచి ఫార్ములా. అలాగే ప్రతీకారం అనేది కూడా ప్రేమలాగే తర తరాలుగా సినిమాల్లో మోస్ట్ పేయింగ్ ఎలిమెంట్. సర్కార్‌లో అదీ ఉంది.
 
సహజ నటుడు, తెలుగువారు గర్విం చదగిన నటుడు కోట శ్రీనివాసరావుని చాలా ముఖ్యమైన పాత్రకి ఎంచుకున్నారు. నటుడు జీవాకి మరో ముఖ్యమైన పాత్ర నిచ్చారు. అయినా చిత్రానికి కావలసిన నేటివిటీని అణువంతైనా మిస్ కాకుండా చూసుకోవడం వర్మ తెలివికి నిదర్శనం.
 ఇక షాట్స్ గురించి చెప్పక్కర్లేదు. శివ, క్షణక్షణం, రంగీలా, సత్య తర్వాత రామ్‌గోపాల్‌వర్మ అద్భుతమైన షాట్ టేకింగ్ సర్కార్‌లో చూడగలం. సినిమాలో ప్రతి సీనూ ఒక సినిమాలా ఉండాలం టారు. అంటే టేకింగ్, మిడిల్, ఎండింగ్ పకడ్బందీగా అల్లుకోవడం అన్నమాట. అలా స్క్రీన్‌ప్లే సూత్రానికి కట్టుబడి రాసుకున్న స్క్రిప్టులా ఉంటుంది సర్కార్.
 
ఇది కత్రినాకైఫ్‌కి రెండో సినిమా. నిషా కొఠారికి రెండో సినిమా. అభిషేక్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా. బహుశా అమితాబ్ నటించలేదని ఏ అవార్డూ ఇచ్చి ఉండరు జ్యూరీ మెంబర్లు. ఆయన అందులో జీవిం చారు మరి. లేకపోతే 1990లోనే ‘అగ్ని పథ్’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయనకి, ‘సర్కార్’కి అవార్డు రాకపోవడం విచిత్రం.
 
అలాగే హీరో షాహిద్ కపూర్ తల్లి, నటుడు, దర్శకుడు, నిర్మాత పంకజ్ కపూర్ భార్య సుప్రియా పాఠక్ నటన అనిర్వచ నీయంగా ఉంటుంది ‘సర్కార్’లో. కాజోల్ చెల్లెలు తనీషా, ఆమె భర్తగా కేకే... అంద రివీ చక్కగా అమరిన పాత్రలు. అసలు సిసలు కాస్టింగ్ డెరైక్టర్ వృత్తికి నిర్వచ నంగా ఉంటుంది ‘సర్కార్’ సినిమా పాత్ర ధారుల ఎంపిక. కొన్ని వేల సినిమాలకి ప్రయత్నించినా కుదరని విషయం అది.
 
ఈ వ్యాసం రాయడం కోసం సాహితీ మిత్రులు సిరాశ్రీ ద్వారా  రామ్‌గోపాల్ వర్మకి ఫోన్ చేశాను. నేను ఆశ్చర్యపోయే ఆసక్తికరమైన విషయం ఆయన మాటల ద్వారా తెలిసింది. రామూగారు సీనియర్ ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక స్నేహి తుడు ‘ద గాడ్ ఫాదర్’ అనే ఇంగ్లిషు నవల ఇచ్చి, అందులో 26వ పేజీలో ఉన్న రొమాంటిక్ సీన్ చదవమన్నాట్ట. ఈయన ఇంటి కొచ్చి సీన్‌ని చదివేశార్ట.
 
ఆ తర్వాత సరదాగా కవర్‌పేజీ చదివితే, ఆయన ఎప్పుడూ వినని మాఫియా లాంటి పదాలు కనపడ్డాయి. తోచక పుస్తకం మొద ట్నుంచీ చది వారట. చదవడం పూర్తయిన వెంటనే మళ్లీ మొదలు పెట్టారట. అలా నాలుగైదుసార్లు ఆసాంతం చదివేశార్ట. ఆయన ఇమాజి నేషన్‌లో గాడ్ ఫాదర్ నవల గాడ్ ఫాదర్ సినిమా కన్నా ఎక్కువగా, గొప్పగా కన పడింది, స్థిరపడిపోయింది. ఆ ఇమాజి నేషనే ఆయన దర్శకుడవ్వాలని బలంగా నిర్ణయించుకునేలా చేసింది. ఫ్రెండ్ నవల ఇచ్చినప్పుడు తన ఉద్దేశం వేరు. తీసుకున్నపుడు రామూగారి ఉద్దేశం వేరు. కానీ, ఏ విషయం నుంచి ఏం పుడుతుందో అది ఎలా పరిణమిస్తుందో - ఎవ్వరికీ తెలీదు. పైవాడికి తప్ప. ఆ పైవాడినే గాడ్ అంటారు. ఆయనే మనందరికీ ఫాదర్ అవుతారు. ఆయన సర్కారే భూమ్మీద చెల్లుబాటవుతుంది. అంతే!
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

మరిన్ని వార్తలు