అడవి పిలిచింది

8 Dec, 2019 02:30 IST|Sakshi

స్పెయిన్‌ దేశానికి ఉత్తర భాగంలో  ఫ్రాన్స్‌ దేశాన్ని ఆనుకొని వున్న నవర్రా (navarra) ప్రాంతం అందానికి మారుపేరు. నిత్యం చినుకుతూ, పచ్చగా కళకళలాడుతుంటే ఈ నవర్రాలో ఉంది మరో అందమైన ప్రపంచం. అదే సెల్వా ఇరాతి. స్పానిష్‌ భాషలో ‘సెల్వా’ అంటే అరణ్యం అని అర్థం. ఆ ప్రాంతంలో మాట్లాడే వాస్క్‌ భాషలో ‘ఇరాతి’ అంటే అడవి మొక్కలు పెరిగే వనం అని అర్థం. ఇంత అందమైన అర్థం వున్న ‘ఇరాతి’ అనే పేరుతో నవర్రా ప్రాంతంలో అనేక మంది ఆడపిల్లలుంటారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. జర్మనీలో వున్నా బ్లేక్‌ఫారెస్ట్‌ తర్వాత ఐరోపా ఖండంలో వున్న అతి పెద్ద ‘బీచ్‌వుడ్‌ అరణ్యం’ ఇదే. ఆకురాలు కాలంలో, ముఖ్యంగా నవంబర్‌ నెలలో ఇరాతి అరణ్యం ఒక అందమైన రంగుల కలగా రూపాంతరం చెందుతుంది. కేవలం రెండు వారాల పాటు ఉండే ఈ ఆకురాలు కాలం చూడడానికి చుట్టుపక్కల దేశాల నుంచి వేలాదిమంది యాత్రికులు వస్తారు.

అడవికి 26 కిలోమీటర్ల దూరంలో వున్న ఎప్పినాల్‌ అనే గ్రామంలో బస చేసి ఉదయాన్నే ఇరాతి అరణ్యానికి కాలి నడకన బయల్దేరాను. ఈ అడవి మార్గం అందాల్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఇదొకటే మార్గం, గ్రామం దాటగానే అడవి మొదలవుతుంది. ముందురాత్రి వచ్చిన గాలిదుమారానికి చెట్ల ఆకులన్నీ దాదాపుగా రాలిపోయాయి. ఒళ్లంతా ఉన్ని కప్పుకున్న గొర్రెలు క్రిస్మస్‌ బొమ్మల్లా వున్నాయి. తెల్లమచ్చల నల్లావుల మెళ్ళో నుంచి వచ్చే గంటారావం, పక్షుల కిలకిలారావంతో అడవి నిండింది. రకరకాల పండ్ల చెట్లు సువాసనలు వెదజల్లుతున్నాయి. వర్షానికి తడిసిన మట్టివాసన మత్తెక్కిస్తుంది. ఈ మట్టివాసనకు తెలుగులో ఏం పేరుందో తెలీదుగాని ఆంగ్లంలో పెట్రికోర్‌ (petrichor) అనే పదం దీన్ని బాగా వర్ణిస్తుంది. ఈ మార్గంలో నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను అనే సంగతి మర్చిపోయాను.

ఎత్తుపల్లాల కొండమార్గంలో ఓ ఆరు కిలోమీటర్లు నడిచాక ఒక సన్నటి బాట కనిపించింది. బాటనానుకొని వున్న పచ్చటి మైదానం, ఆ మైదానంలో అందమైన గుర్రాలు నా దృష్టిని ఆకర్షించాయి. ‘బుర్లేతె’ అనే జాతికి చెందిన గుర్రాలు పొట్టిగా, బలంగా ఉంటాయి. తలపైన, తోకపైనా వుండే దట్టమైన వెంట్రుకలు నల్లగా పొడవుగా అందంగా అలలు తీరిన కురుల్లా వుంటాయి. వర్షం జోరు పుంజుకుంది. చలి కూడా విపరీతంగా వుండటంతో దగ్గర్లోనే వున్న ‘బుర్గెతే’ అనే గ్రామం చేరుకున్నాను. తెరచి వున్న ఒక బార్‌లోకి దూరాను. ఇక్కడ మనలా కాఫీహోటళ్ళూ, టీస్టాల్లూ వుండవు. బార్‌లోనే కాఫీ, టీలు దొరుకుతాయి. టీ తాగుతూ గోడ మీద రెండు చిన్న ఫోటోల్ని గమనించాను.

ఆ రెంటిలోనూ వున్న వ్యక్తి ఒకరే–సుప్రసిద్ధ రచయిత, అమెరికన్‌ నవలాకారుడు, 1954 నోబెల్‌ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్‌ హెమింగ్వే. సంభాషణ కోసం ‘‘మీ కుటుంబంలో ఎవరైనా రచయితలు ఉన్నారా?’’ అని అడిగాను నాకు టీ అందించిన మహిళను. బార్‌లో నా ఎదురుగా కూర్చున్న ఓ పెద్దాయన నవ్వుతూ ‘‘మీరు కూర్చున్న చోటే హెమింగ్వే కూర్చునే వారు’’ అని చెప్పాడు. ముందు వెటకారం అనుకున్నా, కాని ఇంతలో ఆ మహిళ నా ప్రక్కనే పియానో కవర్‌ తీసింది. పియానో మీద ‘ఇ.హెమింగ్వే, 25–7–1923’ అని ఆయన చేత్తో చెక్కిన సంతకం వుంది.

హెమింగ్వే గొప్ప రచనలు చదివిన నాకు కొంచెంసేపు ఆనందంతో మాట రాలేదు. హెమింగ్వే గొప్ప రచయిత మాత్రమే కాదు ఎంతో సాహస జీవితాన్ని గడిపిన వ్యక్తి. కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే మొదటి ప్రపంచ యుద్ధంలో మిలిటరీ ట్రక్‌ డ్రైవర్‌గా తన జీవితాన్ని మొదలుపెట్టిన హెమింగ్వేకు స్పెయిన్‌ దేశం అంటే చాలా ఇష్టం. నవర్రా ప్రాంతం అంటే ప్రత్యేక అభిమానం. స్పెయిన్‌లో ఆయన చూడని స్థలం లేదు. అందుకే కొందరు తమాషాకి వాళ్ళ హోటల్‌ బయట ‘హెమింగ్‌వే ఈ హోటల్‌కి రాలేదు’ అని బోర్డులు పెట్టుకుంటారు. సముద్రమట్టానికి దాదాపు మూడువేల అడుగుల ఎత్తు ఉన్న కొండమార్గంలో నడక కొనసాగింది. కింద లోయలో ఇరాతీనది ప్రవహిస్తుంది.

నదికి రెండు వైపులా కొండచరియల్లో ఎల్తైన చెట్లు రకరకాల పసుపు, ఎరుపు, పచ్చ ఛాయల్లో వున్న పత్రాలతో అప్పుడే వేసిన ‘క్లవుద్‌ మోనె’ తైలవర్ణచిత్రంలా వుంది. నది పక్కనే నడుస్తూ ‘అరీబే’ అనే గ్రామం చేరుకున్నాం. అక్కడ కూడా హెమింగ్వే మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ‘బుర్గెతే’ గ్రామం నుంచి ఆయన కూడా కాలి నడకన ఇక్కడకు వచ్చారని, ఇరాతి నది ఒడ్డున గంటల తరబడి కూర్చునే వారని తెలిసింది. ఆయనకు గేలంతో చేపల పట్టడం చాలా ఇష్టం. ఈ నదిలో ఆయన ‘ట్రౌట్‌’ అనే చేపను పట్టేవాడు. ఆహ్లాదకరమైన ప్రకృతి, అందమైన ప్రజలు, అందమైన అనుభూతులు వున్నంత సేపూ కాళ్లకు నొప్పి తెలియదు. మరో నాలుగు గ్రామాలు దాటి 26 కిలోమీటర్లు నడిచాక ఇరాతీ అరణ్యం ప్రత్యక్షమైంది.

అడవికి చేరే ముందు మార్గమంతా అత్యద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఒళ్ళు పులకరింపజేస్తుంది. అడవి చుట్టూ వున్న పచ్చని మైదానాల్లో దాదాపు ఇరవై వేల గొర్రెలు, రెండు వేలకు పైగా ఆవులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అనేకమంది పాడిపరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుంటారు. గొర్రె పాలతో చేసిన పనీర్‌ ఇక్కడ బాగా ప్రసిద్ధి. విశేషం ఏమిటంటే పచ్చగా ప్రశాంతంగా వుండే ఇరాతి ప్రాంతంలో పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న ‘ఎవ్‌గీ’  అనే గ్రామంలో 18వ శతాబ్దంలో నిర్మించిన ఆయుధ కర్మాగారం ప్రస్తుతం శిథిలమైపోయింది. ఇనుప ఖనిజానికి, కలపకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.

స్పెయిన్‌లో జరిగిన అంతర్యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయాల్లో ప్రతిఘటన యోధులు స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య రహస్య రాకపోకలను ఈ దట్టమైన అరణ్యం ద్వారా నడిపారు. నలభైమూడు వేల ఎకరాల విస్తీర్ణం వున్న ఇరాతి అడవిలో అడుగుపెట్టేసరికి ఒళ్లు జలదరిస్తుంది. కేవలం బొమ్మల్లో మాత్రమే కనిపించే అందం కళ్ల ముందు కనిపిస్తుంటే  ఎంత సంతోషమేసిందో! అడవి అంతా కళ్ళ ముందు పరిచిన అపురూపవర్ణచిత్రంలా వుంది. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న ఎరుపు పత్రాల మధ్య నుంచి ప్రవహిస్తున్న సన్నని సెలయేరు, ఇంకా రాలడానికి సిద్ధంగా వున్న ఎర్రటి పత్రాలు, అక్కడక్కడా పసుపు, ఆకుపచ్చ, కాషాయ ఛాయలతో ఇరాతి అరణ్యం ఒక ఫెయిరీ టేల్‌ సెట్టింగ్‌లా వుంది, ఒక పక్కన ఫ్రాన్స్‌ దేశం. మరో పక్క స్పెయిన్‌. రెంటీనీ కలుపుతూ అందమైన పిరినీస్‌ పర్వతాలు. వర్షానికి తడిచిన మెత్తటి మట్టిలో జారుతూ, పడుతూ లేస్తూ ఎంతదూరం నడిచామో కూడా తెలియదు. ఇక్కడ ప్రకృతి సరిహద్దులుండవు. జంతువులకు కూడా సరిహద్దులు కనిపించవు.

మరిన్ని వార్తలు