సూపర్ హ్యూమన్!

4 Sep, 2016 00:45 IST|Sakshi
సూపర్ హ్యూమన్!

విడ్డూరం
సైన్స్‌ఫిక్షన్‌లో మనం చదువుకొని ఆశ్చర్యపడిన విషయాలన్నీ నిజ జీవితంలో ఆచరణలోకి వచ్చి అబ్బురపరిచాయి. శాంటి కొర్పోరాల్ వ్యవహారం కూడా అంతే. సిడ్నీ(ఆస్ట్రేలియా)కు చెందిన  కొర్పోరాల్ తన హస్తాల్లో మైక్రోచిప్స్‌ను అమర్చుకున్నారు. దీనివల్ల ఆమె... తాళం చెవి లేకుండానే డోర్  ఓపెన్ చేయవచ్చు. ఎలాంటి పరికరం లేకుండానే కారు డోర్స్‌ను ఓపెన్ చేయవచ్చు. పాస్‌వర్డ్ ఉపయోగించకుండానే కంప్యూటర్‌లోకి వెళ్లవచ్చు. మైక్రోచిప్స్ బియ్యపు గింజ ఆకారంలో  ఉంటాయి.

ఇది మాత్రమే కాదు... పర్స్‌లు, కార్డులలాంటివేమీ ఉపయోగించకుండా కొత్తదారిలో ప్రయాణించాలనేది ఆమె భవిష్యత్ కల. పాస్‌వర్డ్‌లు, పిన్ నెంబర్లు అవసరం లేని సరికొత్త జీవితం చూడొచ్చు అంటుంది కొర్పోరాల్.
 
‘‘ఆ తరువాత ఏమిటి? అనేదానికి ఆకాశమే హద్దు’’ అంటున్న కొర్పోరాల్ పరికరాల సహాయం లేకుండా ఎన్నో పనులు చేయాలని కలలు కంటోంది.
 కలలు కనడమే కాదు ఇంప్లాంట్స్ కోసం  భర్త స్టీవెన్స్‌తో కలిసి ‘చిప్ మై లైఫ్’ పేరుతో డిస్ట్రిబ్యూషన్ సర్వీస్‌ను మొదలుపెట్టింది.
 సూపర్ హ్యూమన్‌లు నిజ జీవితంలో కూడా కనిపించే రోజు ఇంకెంతో కాలం లేదని అంటోంది కొర్పోరాల్.

మరిన్ని వార్తలు