రిలేషణం: అక్క నా బలం... నేను తన బలహీనత!

10 Aug, 2013 21:28 IST|Sakshi
రిలేషణం: అక్క నా బలం... నేను తన బలహీనత!

చిలిపి తగాదాలు, చిన్ని చిన్ని ఆనందాలు... అల్లరి చేష్టలు, ఆప్యాయతానురాగాలు... అన్నీ ఉన్నాయి తాప్సీ, షగున్‌ల జీవితంలో. వారిద్దరూ రక్తం పంచుకు పుట్టారు. అందుకేనేమో... సంతోషమైనా, విచారమైనా ఇద్దరూ కలసి పంచుకుంటారు. తమ  అందమైన అనుబంధం గురించి, తనకన్నీ అయిన అక్కయ్య తాప్సీ గురించి... చెల్లెలు షగున్ పన్నూ ఇలా చెబుతున్నారు...
 
 అక్కకీ నాకూ నాలుగేళ్లు తేడా. అయితే అల్లరి చేయడంలో ఆ తేడా ఉండేది కాదు. ఇద్దరం పోటీపడి అల్లరి చేసేవాళ్లం. అలాగని ఇంట్లో ఫుల్లుగా ఫ్రీడమ్ ఉందనుకునేరు. నాన్న యమా స్ట్రిక్ట్. ఆయనకు అన్నీ పద్ధతిగా ఉండాలి. మేం క్రమశిక్షణతో మెలగాలి. లేదంటే అంతే సంగతులు. మేమేమో అలా ఉండే టైపు కాదు. కానీ నాన్నకు భయపడి ఆయన ఉన్నప్పుడు సెలైంట్‌గా ఉండేవాళ్లం. ఆయన లేనప్పుడు మాత్రం ఇల్లు పీకి పందిరేసేవాళ్లం.
 
 అప్పుడు నాకు ఏడేళ్లు. అక్కకీ నాకూ ఏదో తగాదా వచ్చింది. అంతే, అక్క కోపం పట్టలేక దేనితోనోగానీ కొట్టింది. కంటికి కాస్త దగ్గరగా చీరుకుపోయి రక్తం విపరీతంగా కారిపోసాగింది. అంతే, అమ్మానాన్నలు కంగారు పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లిపోయారు. తర్వాత ఆ గాయం మానిపోయిందనుకోండి.
 
 అయితే, ఆ సంఘటన తరువాత అక్కలో చాలా మార్పు వచ్చింది. నన్నేమీ అనేది కాదు. నేను విసిగించినా మౌనంగానే ఉండేది. స్కూల్లో ఎవరైనా నన్ను ఏడిపించినా, కామెంట్ చేసినా విరుచుకుపడేది. మొదట్లో తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది... నన్ను గాయపర్చినందుకు తనెంతో బాధపడిందని, అందుకే నాకెప్పుడూ ఏ బాధా కలుగకుండా చూసుకోవాలని అనుకుంటోందని!
 
 నేను ఎవరితోనూ అంతగా మాట్లాడేదాన్ని కాదు. ఎవరికీ త్వరగా దగ్గరయ్యేదాన్ని కూడా కాదు. కానీ అక్క అలా కాదు. ఎవరైనా చిన్న మాట మాట్లాడితే, తిరిగి తాను ఓ పేద్ద పేరాగ్రాఫంత మాట్లాడుతుంది. అందరితోనూ కలసిపోతుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. కాకపోతే కాస్త పెంకిది. పడినా తనదే పై చేయి అంటుంది. అది కూడా నా విషయంలో మాత్రమే. తప్పు నాది కాదు తనదేనని తెలిసినా ఒప్పుకోదు. బాగా వాదిస్తుంది. నేను కాస్త బిక్కమొగం వేస్తే నవ్వేస్తుంది. చెప్పాలంటే, ఓ రకంగా నేనే తన బలహీనత! ఈ మధ్య నా పుట్టినరోజుకి నన్నో ఐల్యాండ్‌కి తీసుకెళ్లి డిన్నర్ ఇచ్చింది. అదో గొప్ప సర్‌ప్రైజ్ నాకు!
 
 అక్క సినిమాల్లోకి వస్తుందని అనుకోలేదు. నాన్న ఒప్పుకుంటారని కూడా అనుకోలేదు. కానీ తను అనుకున్నది సాధించింది.  అంతేకాదు, నేను కోరుకున్న దారిలో నడవడానికి నాక్కూడా ఎంతో సాయం చేసింది. నేను డిగ్రీ అయ్యాక ఉద్యోగంలో చేరిపోవాలనుకున్నాను. కానీ నాన్న ససేమిరా అన్నారు. ఇంకా చదవమన్నారు. అప్పుడు అక్కే నాన్నను ఒప్పించింది. ఇప్పుడు నేను హైదరాబాద్‌లోని పీవీపీ సంస్థలో పని చేస్తున్నాను. నాకు నచ్చిన దారిలో సాగిపోతున్నాను. ఇదంతా అక్క వల్లనే. చాలామంది అడుగుతూ ఉంటారు, ‘మీ అక్కలాగా నటివవుతావా’ అని. నాకా ఉద్దేశం లేదు. తెర మీద కనిపించాలన్న ఆశ, ఆలోచన నాకెప్పుడూ లేవు. అయితే అక్కని తెరమీద చూసినప్పుడు మాత్రం చాలా మురిసిపోతుంటాను. ‘గుండెల్లో గోదారి’లో తన నటన, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లోని తన రోల్ నాకు చాలా నచ్చాయి. తను ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలి. నేను తన చెల్లెల్ని అని చెప్పుకుని మురిసిపోవాలి. అదే నా కోరిక!
 
 తనేం కోరుకున్నా ఇస్తాను: తాప్సీ
 చిన్నప్పుడు మా చెల్లిని బాగా కొట్టేసేదాన్ని. కానీ ఓ సందర్భంలో అది తప్పని తెలుసుకున్నాను. అందుకే వీలైనంత వరకూ తనను కాచుకుని ఉంటాను. షగున్ చాలా నెమ్మదస్తురాలు. తన పనేంటో తను చేసుకుపోతుంది తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోదు. అందుకే తనకి ఎలాంటి కష్టమూ రాకుండా చూసుకోవాలని ఆరాటపడుతుంటాను. తను ఏం కోరుకున్నా ఇవ్వడానికి ప్రయత్ని స్తాను. తను నటినవుతానన్నా ఆనందంగా ప్రోత్సహిస్తాను. ఎందుకంటే... తను కాస్త ఫీలయినా నేను తట్టుకోలేను!
 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు