ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో

26 Sep, 2023 10:51 IST|Sakshi

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్‌సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. 

ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్‌ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది.  

ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?

మరిన్ని వార్తలు