ఇంగ్లిష్ నుంచి తరలి వచ్చిన తెనాలి!

16 May, 2015 23:00 IST|Sakshi
ఇంగ్లిష్ నుంచి తరలి వచ్చిన తెనాలి!

ఆ సీన్ - ఈ సీన్
తెనాలి రాముడికి ఏదైనా భయమే. ఒక భయం కాదు.. గాలి భయం, నేల భయం, నిప్పు భయం, నీరు భయం... ఇలా అంతా భయమయం. ఈ భయాలన్నింటినీ పోగొట్టుకోవడానికి అతడు సైకాలజిస్టు పంచభూతాన్ని ఆశ్రయిస్తాడు. మానసిక వైద్యం గురించి ఏమీ తెలియని పంచభూతం పిచ్చి తెనాలిని తనకు పోటీగా ఉన్న సైకాలజిస్టు కైలాష్ మీద ప్రయోగిస్తాడు. తెనాలి దెబ్బకు కైలాష్ మార్కెట్ దబ్బున పడిపోవాలి- అనేది పంచభూతం మాస్టర్ ప్లాన్.

అక్కడి నుంచి తెనాలిని వదిలించుకోవడానికి కైలాష్ చేసే ప్రయత్నాలు... పాట్లకు ప్రతి రూపమే కమల్‌హాసన్ సినిమా ‘తెనాలి’. మరి ఇలా భయపడుతూ నవ్వించే మన తెనాలికి అసలు

రూపం బాబ్... బాబ్ విల్లే!.  
ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్(ఐఎమ్‌డీబీ) లోని అత్యుత్తమ వంద కామెడీ సినిమాల జాబితా ‘100 ఫన్నీయెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్‌టైమ్’లో నంబర్ 44లో ఉంటుంది ‘వాట్ అబౌట్ బాబ్’. ఫ్రాంక్ ఓజ్ దర్శకత్వంలో బిల్‌ముర్రే, రిచర్డ్ డ్రేఫస్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ అద్భుతమైన సినిమాను పరిచయం చేయడానికి ఈ వాక్యాలు చాలవు. దాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తే ఆ సినిమాలో ఫన్ అర్థం అవుతుంది. ఆ ఫన్‌ను ఆస్వాదించడానికి ‘వాట్ అబౌట్ బాబ్’ సినిమానే చూడనక్కర్లేదు. మన యూనివర్సల్‌స్టార్ కమల్‌హాసన్ సినిమా

‘తెనాలి’ని గుర్తు చేస్తే చాలు!
హీరో అంటే ధీరుడు. అతడిది భయం అంటే తెలీని బ్లడ్. మరి అలాంటి హీరోని భయస్తుడిగా చూపితే.. భయస్తుడినే హీరోగా చేస్తే. ఇలాంటి భయస్తుడినే ‘వాట్ అబౌట్ బాబ్’లో హీరోగా చూపించారు. ఇద్దరు సైకాలజిస్టుల ఇగో ప్రాబ్లమ్ కు మధ్య ఒక భయస్తుడిని ప్రవేశ పెట్టి కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో జనాల్ని పగలబడి నవ్వేలా చేశారు.  
 
సైకాలజిస్టులు అయిన కైలాష్, పంచభూతం మధ్య టామ్ అండ్ జెర్రీల పోరాటం మధ్యలో తెనాలి సైకాలజిస్ట్ కైలాష్ ఇంటిలోకి చేరిపోవడం. అతడి ఇంట్లో వాళ్లను కట్టిపడేసి, కైలాష్ చెల్లెలిని ప్రేమలో పడేసుకోవడం... చివరకు ఆమెను వివాహం చేసుకోవడం.. ఇవన్నీ చూసి తట్టుకోలేక కైలాషే షాక్‌తో పక్షవాతానికి గురవ్వడం... అతడికి తెనాలి మరో షాకింగ్ ట్రీట్‌మెంట్ ఇచ్చి సరిచేయడం.. మధ్యలో పంచభూతం పావులు కదుపుతూ ఉండటం... ఇదంతా ‘వాట్ అబౌట్ బాబ్’ నుంచే తెచ్చుకొన్నదే. ఎపిసోడ్ల లెక్కన వివరించాలంటే దాదాపుగా ప్రతిసీన్‌నూ ప్రస్తావించాలి.
 
ఈ కథను తమిళులకు, తెలుగు వారికీ లోకలైజ్ చేయడంలో కమల్‌హాసన్ అండ్ కంపెనీ విజయవంతం అయింది. కమల్‌కు ఎంతో ఇష్టమైన సన్నిహితుడైన రచయిత క్రేజీ మోహన్ కలం చాకచక్యంగా కదిలి టైటిల్ దగ్గర నుంచే సినిమాకు లోకల్‌టచ్ ఇచ్చింది. తెనాలి సినిమా ప్రత్యేక  ప్రశంసలు అందుకొంది. హాలీవుడ్ సినిమాలో భయస్తుడిగా బిల్‌ముర్రే చేసిన పాత్రను కమల్ రక్తికట్టించగా, సైకాలజిస్టుగా రిచర్డ్‌డ్రేఫస్ చేసిన పాత్రను మలయాళ హీరో జయరాం చేసి తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రత్యేక జ్యూరీ అవార్డును సొంతం చేసుకొన్నాడు.
 
కథను కాపీ కొట్టారనో... స్ఫూర్తి పొందారనో కమల్ ప్రయత్నాన్ని తక్కువ చేయలేం. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించడ ం నిజంగా వండర్. టైమ్లీ కామెడీతో నటీనటుల పటిమతో ఈ సినిమా అమితంగా అలరించింది. బాబ్ తరలివచ్చి తెనాలిగా మారితేనేం.. ఆక ట్టుకొన్నాడు కదా!
 - బి.జీవన్ రెడ్డి

>
మరిన్ని వార్తలు