హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం!

20 Mar, 2016 01:30 IST|Sakshi
హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం!

శిక్ష
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  37

ఆ హత్యకి కారణం వైవాహిక జీవిత వ్యవస్థ పుట్టాక కొన్ని కోట్ల సార్లు జరిగిన హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం! తన భార్య లూసీకి, తన ఫ్రెండ్ లేన్సింగ్‌తో గల సంబంధం గురించి హెన్రీకి తెలిసి నమ్మలేకపో యాడు. కానీ తను నియమించిన డిటెక్టివ్ ఋజువు సంపాదించి తెచ్చి చూపించాక నిర్ఘాంతపోయాడు. లేన్సింగ్‌ని చంపాలని నిర్ణ యించుకున్నాడు. లూసీ కోసం చంపు తున్నాడు కాబట్టి ఆమె కళ్ల ముందే అతణ్ని చంపదలచుకున్నాడు. తనని పోలీసులకి పట్టిస్తే తనమీద కన్నా లేన్సింగ్ మీదే ఆమెకి అధిక ప్రేమ ఉన్నట్లు లేదా తనని గాఢంగా ప్రేమిస్తున్నట్లు అని భావిం చాడు. తగిన అవకాశం కోసం ఓపికగా వేచి ఉన్నాడు.ఆ శనివారం రాత్రి తన ఇంటికి వచ్చిన లేన్సింగ్‌తో కలిసి ఎప్పటిలా హెన్రీ డ్రింక్ తీసుకున్నాడు. ఇద్దరూ పిట్ట గోడ దగ్గర నిలబడి ఉండగా హెన్రీ తన భార్యతో చెప్పాడు. ‘‘ఇటు చూడు లూసీ.’’


ఆమె తల తిప్పి చూడగానే లేన్సింగ్ రెండు కాళ్లూ పట్టుకుని ఎత్తి అతన్ని కింద పడేసాడు. ఏడో అంతస్థు నించి తలకిందు లుగా పడ్డ లేన్సింగ్ తల పగిలి పుర్రెలోని మెదడు కూడా బయటికి వచ్చేసింది. ఆడవాళ్లు ఎమోషనల్‌గా ప్రవర్తిస్తారు. ఆ ఎదురు చూడని దుర్ఘటనకి లూసీ సరిగ్గా అలాగే ప్రవర్తించింది. అయితే హెన్రీ పోలీసులు వచ్చేలోగా లూసీని తన అధీనంలోకి తీసుకోగలిగాడు.

 
‘‘లేన్సింగ్ తాగిన మత్తులో జారి కిందపడ్డాడని నేను పోలీసులతో చెప్తాను. నువ్వూ అదే చెప్పడం మంచిది. నువ్వు నిజం చెప్పినా అందుకు ఋజువు లేదు. ఋజువు లేని సాక్ష్యాన్ని కోర్టులో కొట్టే స్తారు. మనిద్దరి మీదా పత్రికల్లో అవా కులు, చెవాకులు రాస్తారు. వాటిలో ఒకటి లేన్సింగ్‌తో నీకు గల సంబంధం. ఆ ఋజువు కోర్టుకిస్తే, నాకు శిక్షపడే పక్షంలో నా ఆస్తిలోంచి నీకు పెన్నీ కూడా రాదు. కాబట్టి లేన్సింగ్ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడం నాకన్నా నీకే మంచిది. నేను అన్నిటికీ తెగించినవాణ్ని.’’


లూసీ పోలీసులు వచ్చేసరికి షాక్‌లోనే ఉంది. తన భర్త చెప్పిందే వారికి చెప్పింది. ఆమె మానసిక స్థితిని గమనించిన పోలీసులు కూడా లూసీని గుచ్చి గుచ్చి ప్రశ్నించలేదు. ‘‘లేన్సింగ్ డిప్రెస్డ్‌గా కనిపించాడు. ఒంటరిగా ఉండలేనని ఫోన్‌చేసి ఇంటికి వచ్చాడు. భోజనానికి మునుపు, తర్వాత చాలా తాగాడు. లాయర్‌గా లేన్సింగ్ ఆదాయం ఈ మధ్య బాగా తగ్గడం అందుకు కారణం’’ హెన్రీ పోలీసులకి చెప్పాడు. చివరగా లేన్సింగ్ టై పిట్టగోడ దగ్గరికి చేరుకున్నాక అతని కదలికల్ని గురించి కూడా చెప్పాడు. వాళ్లకి ఆ దంపతులు అబద్ధం ఆడుతున్నా రన్న అనుమానం కలగలేదు. లేన్సింగ్ ఆదాయం తగ్గిందన్న సంగతి వారి విచారణలో నిర్ధారణయ్యాక ఆ కేసుని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా మూసేసారు. తనకి వచ్చిన కేన్సర్.. మూలాల నించి తొలగిపోయిందని తెలిసిన రోగిలా ఆనందించాడు హెన్రీ.

  

‘‘లూసీ! లేన్సింగ్ చేసిన ద్రోహానికి అతన్ని నేను చంపాను. నేనిక ఎన్నటికీ వాడి మొహం చూడాల్సిన అవసరం లేదు’’ కొద్ది రోజుల తర్వాత హెన్రీ తన భార్యతో చెప్పాడు. ఆ హత్య జరిగాక మొదటిసారి లూసీ తన భర్త మొహం వంక కొద్దిసేపు దీర్ఘంగా చూసింది. ఆ మొహంలో పగ కాని, బాధ కాని, క్రోధం కాని, జాలి కాని... అసలెలాంటి భావాలు కనిపించలేదు. ‘‘ఏమిటా చూపు?’’ అడిగాడు. లూసీ జవాబు చెప్పలేదు. ఓ ప్రశ్న అడిగింది. ‘‘ఏం జరగనట్లే మానసిక క్షోభ లేకుండా జీవించగలరా? మీ ప్రియ మిత్రుడ్ని చంపాననే బాధ లేదా? మీరు శిక్షకి అర్హులని మీకు అనిపించడం లేదా?’’

 ‘‘నా మీదకి దాడి చేసిన క్రూర మృగాన్ని చంపినట్లుగానే నీ ప్రియుడ్ని చంపాను. ఇది అతి పాత న్యాయం. కన్నుకి కన్ను. చేతికి చెయ్యి. శిక్ష దేనికి?’’  వారిద్దరి మధ్యా లేన్సింగ్ గురించి జరిగిన ఆఖరి సంభాషణ అది. హెన్రీ ఆమెకి ఇంకో ప్రియుడు లభించే అవకాశం కల్పించదలచుకోలేదు. తన భార్య పూర్తిగా తనకే దక్కాలనే స్వార్థంతో తన పన్నెండు మంది మగ మిత్రులకి దూరం అయ్యాడు. కాని ఆమె పెట్టెలో అడుగున వెదికి ఉంటే  లూసీ లేన్సింగ్‌ని మర్చిపో లేకపోతోందని అతని ఫోటోని చూసి గ్రహించేవాడు.

  

ఆఫీస్ పనిమీద హెన్రీ చికాగోకి కారులో బయదేరాడు. అకస్మాత్తుగా మంచు కురవసాగింది. కార్ రేడియోని ఆన్ చేస్తే మంచు తుఫాను అని తెలిసింది. ఇంకో అరగంటలో గమ్యానికి చేరతాడు కాబట్టి హెన్రీ కారుని మధ్యలో ఆపదలచు కోలేదు. కారుని జాగత్తగా, వేగం పరిమితి మించకుండా పోనివ్వసాగాడు. పొగ మంచు వల్ల రోడ్డు ఐదారు అడుగుల మేర దూరమే కనిపించసాగింది. పక్క రోడ్లోంచి వచ్చిన కలప లారీ డ్రైవర్‌కి హెన్రీ కారు కనపడలేదు. రెండు లైట్ల కాంతి హెన్రీ కంట్లో గుచ్చుకుంది. సరిగ్గా నాలుగైదు క్షణాల్లో అతని కారు ఆ పద హారు చక్రాల లారీ కిందికి వెళ్లిపోయింది.

 
హెన్రీ మరణించలేదు. లూసీ హాస్పి టల్‌కి హెన్రీని చూడడానికి వచ్చినప్పుడు చెప్పింది. ‘‘డాక్టర్ ఇది అద్భుతం అని చెప్పాడు. మీ మొహానికి తప్ప శరీరంలోని ఇంకే భాగానికీ దెబ్బ తగల్లేదుట.’’ అతను ఆరు వారాలు హాస్పిటల్‌లోనే గడిపాడు. ఆరో వారం డాక్టర్ హెన్రీతో చెప్పాడు. ‘‘కట్లు విప్పాక తెలిసింది. మీ మొహం బాగా దెబ్బతింది. పిల్లలు చూస్తే జడుకునేలా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. కాని అది మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. మీరు వ్యక్తిగతంగా బిల్ చెల్లిస్తే ప్లాస్టిక్ సర్జన్ వచ్చి మిమ్మల్ని చూస్తాడు.’’
 

కట్లు విప్పిన అతని మొహాన్ని చూడ గానే లూసీ మొహం వివర్ణమైంది. ‘‘అంత భయంకరంగా ఉందా?’’ అడిగాడు. ‘‘అవును. మన ఇల్లు అమ్మయినా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి.’’  ‘‘ఇది నువ్వు కోరిన శిక్ష అనుకుంటు న్నావా? కాదు’’ చెప్పాడు.  ఎనిమిది వారాల తర్వాత కట్లు విప్పారు. భర్తకి అద్దం ఇచ్చి చెప్పింది లూసీ... ‘‘చూసుకోండి.’’  అద్దంలోకి చూసిన హెన్రీ కెవ్వున అరిచాడు. ఎదురుగా లేన్సింగ్ ప్రతిబింబం కనిపించింది. ‘‘ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్‌కి ముందు మీ ఫోటో అడిగితే లేన్సింగ్ ఫోటోని ఇచ్చాను. ఇది మీ నేరానికి తగిన శిక్ష’’ లూసీ నెమ్మదిగా చెప్పింది.

 (మిరియం లించ్ కథకి స్వేచ్ఛానువాదం)

మరిన్ని వార్తలు